మన తెలంగాణ /వికారాబాద్ జిల్లా/కోట్పల్లి : వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అమర్నాథ్పంతులు ఇంట్లో ఒక చెట్టుకు దాదాపుగా 20 బ్రహ్మకమలాలు విచ్చుకున్నాయి. సాధారణంగా ఏ ఇంట్లో అయినా బ్రహ్మకమలం ఒకటి లేక రెండు పువ్వులు ఒకే సారి పూస్తుంటాయి. కానీ గత సంవత్సరం ఇదే ఇంట్లో చెట్టుకు ఐదు పువ్వులు పూసిన సందర్భం ఉన్నది. ఈ సంవత్సరం అదే ఇంట్లో చెట్టుకు దాదాపుగా ఒకేసారి 20 బ్రహ్మకమలాలు విచ్చుకోవడంతో కుటుంబంలోని వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విచ్చుకున్న బ్రహ్మకమలాలు తీసుకోని దగ్గర్లోని రాజరాజేశ్వరి ఆలయంలో అభిషేకం చేసి స్వామికి ఆ బ్రహ్మకమలాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఇంటి యాజమాని అమర్నాథ్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఐదు బ్రహ్మకమలాలు ఒకేసారి విచ్చుకున్నాయి. ఈ సంవత్సరం పరమేశ్వరుని అనుగ్రహంతో 20 బ్రహ్మకమలాలు ఒకే సారి విచ్చుకోవం చాలా ఆనందంగాఉన్నదన్నారు. ఈ పువ్వులు వికసించడం వల్ల గ్రామంలోని వారందరికీ మేలు జరుగుతుందన్నారు. ఒకేసారి 20 పుష్పాలు ఉద్భవించడం శుభసూచికమని ఆయన తెలిపారు.