ఒకరికొకరు..!

ఫేస్‌బుక్ గ్రూప్: స్ప్రెడ్ ద వర్డ్, హైదరాబాద్
సభ్యులు: 61 వేలు
2014 నుంచి చురుగ్గా పనిచేస్తోంది.
ఒకరికి ఒకరు సహాయపడటమే లక్ష్యం

హాయిగా మనసువిప్పి మాట్లాడుకోవడానికి మనుషులు కరువైన రోజులివి. గజిబిజి జీవితంలో తీరికలేకపోవడం పెద్ద కారణం. ఎంతగా సోషల్ మాధ్యమంలో ఉంటున్నా  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నామా అంటే డౌటే..మరి మన అంతరంగాన్ని ఎలా ఆవిష్కరించుకోవాలి అని మధన పడాల్సిన అవసరంలేదు.. అలాంటివారికి మేమున్నాం అంటోంది ‘స్ప్రెడ్ ద వర్డ్, హైదరాబాద్’. ఇదొక ఫేస్‌బుక్ గ్రూప్. ఈ గ్రూ ప్‌లో ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఎలాంటి సమస్యలైనా చెప్పుకోవచ్చు. వాటికి సందేహాలను తీర్చుకోవచ్చు. గ్రూప్‌లోని సభ్యులు అన్నింటికీ స్పందిస్తారు. ఎంతో విలువైన సలహాలను, పరిష్కారాలను సూచిస్తారు.. ఇంతకీ అదేంటో చూద్దాం…

Spread-the-Word

ఫేస్‌బుక్‌లోని ఈ గ్రూప్‌లోని అంశాలన్నీ ఆలోచింపజేస్తాయి. అనవసరమయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. ఫేస్‌బుక్‌లోని చెత్తనంతా ఇక్కడ నింపడానికి వీలవ్వదు. అనవసరమైన పోస్టులనేవే ఉండవు. ఈ గ్రూప్ లక్షం ఒక్కటే. సరస్పర సహకారం. ఏ అవసరం, సందేహం వచ్చినా గ్రూప్‌లో పోస్టు పెట్టేయవచ్చు. వెంటనే ఏదో ఒక సభ్యుని నుంచి కనీసం మాట సాయమో..విలువైన సమాచారమో కచ్చితంగా అందుతుంది.

ఈ రోజల్లో ఏ వివరాలు కావాలన్నా.. ఆయా వెబ్‌సైట్లు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. వాటిలో బోలెడంత సమాచారం లభిస్తుంది కూడాను. కానీ ఈ గ్రూప్‌లో పరస్పర చర్చ నడుస్తుంది. డిగ్రీ అయ్యాక ఏంచేయాలి. టెక్నికల్ కోర్సు దేంట్లో చేరాలి. టాలీ వంటి అకౌంటింగ్ ప్యాకేజీలు చేర్చుకుని ఉద్యోగం చేయాలా? ఇలాంటి సందేహాలపై చర్చను లేవనెత్తుతారు. గ్రూప్‌లోని తోటి సభ్యులు.. అనుభవజ్ఞలు వీటికి తమకు తెలిసిన సమాధానాలను చెబుతారు. దీంతో ప్రశ్న అడిగిన అభ్యర్థికి అవగాహన వస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచన చేయాల్సి వస్తుందన్న సంగతి తెలుస్తుంది.
ఈ రోజుల్లో ఒక వ్యక్తి చిన్న సహాయం పొందాలన్నా కష్టమే. ప్రభుత్వానికో, స్థానిక సంస్థలకో ఫిర్యాదు చేయాలంటేనూ తిప్పలు తప్పవు. అదే కనక పదిమంది గ్రూప్‌గా ఏర్పడితే చిటికెలో సూచనలు లభిస్తాయి. అధికారులు మన విన్నపాలకు ప్రాధాన్యం ఇస్తారు. మా గ్రూప్‌లో అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఎవరికి ఏ సందేహం వచ్చినా, అవసరమున్నా..వెంటనే తోటి సభ్యులు స్పందిస్తారు.. అని అంటున్నారు గ్రూప్ సభ్యులు. ఒకరిగా ఉండేకంటే గ్రూప్‌గా ఉంచే చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అంటున్నారు.

అరవై ఒక్కవేల పైచిలుకు సభ్యులున్న గ్రూప్‌లో రోజూ వేల పోస్టులు వచ్చి పడుతుంటాయి. అవి ఉపయోగపడేవా? నకిలీవా? అని పరిశీలించేందుకు ఒక చెక్ పోస్టులా పెట్టుకున్నారు గ్రూప్ ప్రతినిధులు. వీళ్లనే మోడరేటర్స్ అంటారు. వీళ్లు ఓకే చేశాకే గ్రూప్‌లో ఒక పోస్టు సభ్యులకు వెళుతుంది. దీనికి తోడు కొత్త సభ్యుల్ని కూడా జాగ్రత్తగా జాయిన్ చేసుకుంటారు. రిక్వెస్ట్ వచ్చిన వెంటనే తీసుకోరు. ఫేస్‌బుక్‌లో వాళ్ల ప్రొఫైల్ చూశాకే నిర్ణయం తీసుకుంటారు.

ఈ మధ్యనే హైదరాబాద్‌లో గ్రూప్ సభ్యులం తా కలిసి… తమ అనుభవాలను పంచుకున్నారు. మంచిని పదిమందికి పంచే ఆలోచనే ‘స్ప్రెడ్ ద వర్డ్’.. మార్గం. ఒక రకంగా మన ఊర్లో మంచి చెడ్డల్ని మా ట్లాడుకునే రచ్చబండ అన్న మాట. ఇంకెందుకాలస్యం.

మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, గృహిణులైనా ..సరే వెంటనే ఈ గ్రూప్‌లో సభ్యులుగా చేరి పదిమందిని పరిచయం చేసుకోండి. మీ సందేహాలకు పరిష్కారాలను తెలుసుకోండి. ఈ గ్రూప్‌లో జాయిన్ కావడానికి తెలుసుకోవాలనే తపన ఉంటే చాలు అంటున్నారు గ్రూప్ సభ్యులు.