ఐదో రోజూ రూపాయి డౌన్

Rupee hits a new low of 71.58 against dollar

 

71.58కి పడిపోయిన దేశీయ కరెన్సీ విలువ

న్యూఢిల్లీ: వరుసగా ఐదో రోజూ రూపాయి విలువ పడిపోయింది. మంగళవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 48 పైసలు క్షీణించి 71.58కి చేరింది. ఈ ఏడాది ఆసియాలోనే రూపాయి అత్యంత అధ్వాన్న స్థితికి చేరుకుంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ నేపథ్యంలో రూపాయి విలువ రోజురోజుకీ పాతాళానికి పడిపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 79 డాలర్లకు చేరింది. సరఫరాను తగ్గించడంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. మధ్య ఆగస్టు నుంచి క్రూడ్ ధర 10 శాతానికి పైగా పెరిగింది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా 71.10కు పడిపోయిది. పెరుగుతున్న ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి క్షీణిస్తూ వస్తోంది. గత వారం మధ్య నుంచి పతనబాట పట్టిన రూపాయి వారాంతానికి 71 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. క్రూడ్ ధరలతో పాటు వర్ధమాన దేశాల కరెన్సీలు పతన బాట పట్టడం కూడా సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో డాలరు బలపడుతుంటే, ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. దేశీయంగానూ జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Comments

comments