ఐతా చంద్రయ్య కథల్లో దళిత మహిళ

కథా రచయితగా ఐతా చంద్రయ్య సాహితీ లోకానికి సుపరిచితమే. ఆయన రాసిన వందలాది కథలు దేశ, విదేశీ తెలుగు పుస్తకాలలో, పత్రికలలో అచ్చైనవి. కొన్ని కథలు 20 సంపుటాలుగా వెలువడ్డాయి. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత స్త్రీల జీవితాలను ఎన్నో కథలుగా మలిచారు. ఆయన కథల్లోని దళిత స్త్రీ సమాజ సంస్కరణాభిలాషి. ఆ కథల్ని దళిత మహిళా చైతన్య దీపికలనవచ్చును.వందల ఏళ్ల నుండి ఆర్థిక, సామాజిక వివక్షకు గురవుతున్న […]

కథా రచయితగా ఐతా చంద్రయ్య సాహితీ లోకానికి సుపరిచితమే. ఆయన రాసిన వందలాది కథలు దేశ, విదేశీ తెలుగు పుస్తకాలలో, పత్రికలలో అచ్చైనవి. కొన్ని కథలు 20 సంపుటాలుగా వెలువడ్డాయి. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత స్త్రీల జీవితాలను ఎన్నో కథలుగా మలిచారు. ఆయన కథల్లోని దళిత స్త్రీ సమాజ సంస్కరణాభిలాషి. ఆ కథల్ని దళిత మహిళా చైతన్య దీపికలనవచ్చును.వందల ఏళ్ల నుండి ఆర్థిక, సామాజిక వివక్షకు గురవుతున్న దళిత మహిళ ఇతివృత్తం గల ఆయన కథలు కొన్నింటిని పరిశీలిస్తే తెలిసిపోతుంది.
అడవితల్లి : గిరిజన యువతి కమల అడవిలో ఉంటుంది. అడవి గుత్తేదారు వద్ద కూలిగా పనిజేస్తుంది. గుత్తేదారు జగ్గారావు మాయమాటలను నమ్మి లొంగిపోతుంటుంది. ఫలితంగా గర్భవతై కొడుక్కు జన్మనిస్తుంది. పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన జగ్గారావు మళ్ళీ కనబడడు. తనకు జరిగిన అన్యాయాన్ని కమల మహిళా సేవికా సమితికి చెప్తుంది. ఉద్యమిస్తుంది. కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు డి.ఎన్.ఏ పరీక్ష చేస్తుంది. జగ్గారావు వల్లనే కమల తల్లి అయిందని, ఆమె భారము జగ్గారావుదేనని కోర్టు తీర్పునిస్తుంది. జగ్గారావు ఆమెను పెండ్లాడుతానంటాడు. కమల మాత్రం తన కొడుక్కు తండ్రి ఎవరో సమాజానికి తెలియాలని కేసు వేసానంటుంది. అడవిలో పుట్టి పెరిగిన తాను అడవిలోనే ఉంటానంటుంది.
చంద్రహారం: మాల సామాజిక వర్గానికి చెందిన డా. భవానికి బాల్యం గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు గడీలో దాసీలుగా పనిజేసేవారు. దొర్సాని మెడలున్న చంద్రహారం తనకు కావాలంటుంది భవాని. అది విన్న దొర్సాని కోపానికొచ్చి తిడుతుంది. చంద్రహారం దొంగిలించిందని నిందవేసి, ఒళ్ళు హూనం చేయిస్తుంది. భవాని తల్లిదండ్రులతో బయటకొస్తుంది. బాగా చదువుకుని డాక్టరవుతుంది. తనను చిన్నప్పుడు దండించిన దొర్సాని చంద్రహారాన్ని అమ్మి భవాని నర్సింగ్ హోమ్ కు పేషెంట్‌గా వస్తుంది. భవాని అదే చంద్రహారాన్ని కొని మెడలో వేసుకుని దొర్సానికి వైద్యం చేస్తుంది. ఆరోగ్యవంతురాలయ్యాక విష యం తెలుసుకుని దొర్సాని పశ్చాత్తాపపడుతుంది.
దావత్తు : ఈ కథ అమెరికా భారతి తెలుగు పత్రికలో అచ్చయింది. ఎరుకల గూడెంలోని యువతీయువకులు బాలవ్వ, నారాయణ ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. వారి తల్లిదండ్రులు ఒప్పుకోరు. వారి కులాచారం ప్రకారం పుల్ల వేసుకుని పంచాయతీ పెడ్తారు. వాదనలు వింటూ పంచాయతీ పెద్దలు రోజూ దావత్తు చేసుకుంటారు. ఖర్చులన్నీ కక్షదారులే భరిస్తారు. బాలవ్వ నారాయణలు పోలీసులనాశ్రయిస్తారు. పోలీసులు పంచాయితీకొచ్చి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తారు. కథలో పెద్ద మనుషుల సంభాషణలు, వాదనలు ఆసక్తిగా ఉంటాయి.
సరళ : బొందలు తోడే బ్యాగరి బొందయ్య చనిపోతాడు. అతని కోసం బొంద తోడేందుకెవ్వరూ లేరు. యువకులు చదువుకుని కులవృత్తి తెరువు పోరు. వాగ్వివాదాలు సాగాయి. చివరికి బొందయ్య కూతురు సరళనే ముందుకొస్తుంది. పలుగు, పార పట్టుకుని బయలుదేరి ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తుంది.
సంధ్యాసమయం : చిందు భాగవతుల జీవనరేఖ జీవన సంధ్యలో సుశీలకు తాను చిన్నప్పటి యక్షగానాల ప్రదర్శన లు గుర్తుకొస్తాయి. ఆనాటి ప్రదర్శనలు నేడు కరువైనాయని మదనపడుతుంది. నేడు వృత్తి కళలు మరుగున పడిపోతున్నందుకు బాధపడుతుంది.
డప్పు : మాదిగ జయమ్మ భర్త నాగరాజు గతంలో డప్పు వాయించేవాడు. తన గణముతో డప్పుల నృత్యం చేస్తూ తాలే లెల్లియ్యలే లాంటి పాటలు పాడుతుంటే మనసు మయూరమై నర్తించేది. అతనికా కళ వంశ పారంపర్యంగా వచ్చింది. ఆమె కొడుకు రాజేశం డప్పు ముట్టుకోడు. చదివి ఉద్యోగం చేస్తున్నాడు. భర్త డప్పు ఇంట్లా వుంది. ఆయన చనిపోయాడు. మనవడు డప్పుతో ఆడి పగలగొడ్తాడు. జయమ్మ తల్లడిల్లిపోతుంది. కొడుకు-, కోడలికి వాస్తవాలు చెబుతుంది.
కలికి గాంధారి : ఈ కథ ఒక గంట నాటకముగా రేడియోలో ప్రసారమైంది. జోగిని గాంధారిని, తల్లిని, అమ్మమ్మను ఊరిదొర, అతని కొడుకు ఎల్లారావు ఉంపుడుగత్తెలుగా వాడుకుంటారు. గాంధారి తన కూతురు మేనకను చదివిస్తుంది. ఎల్లారావు కొడుకు మేనకపై అత్యాచారం చేయబోతుంటే గాంధారి అతడిని కత్తిపీట తో పొడిచి చంపేసి, జైలుకెల్తుంది. మేనక తన ప్రేమికుడిని పెళ్ళాడి కొడుకును కంటుంది. గాంధారి జైలు నుండి విడుదలయ్యేనాడు ఎల్లారావు దొర ఆ జైలుకు సూపర్నెంటుగా వస్తాడు. గాంధారిని పెళ్ళి చేసుకుంటానంటాడు. గాంధారి ధైర్యంగా నేను ఆనాటి గాంధారిలా కండ్లున్న గుడ్డిదాన్ని కాదు, కలియుగ గాంధారిని. నీ వంశం ఖతమైంది. నా వంశం నా మనువనితో షురువైంది అని తిరస్కరించి బయటకొస్తుంది.
పల్లెటూరి పిల్ల : ఆఫీసర్ రాకేశ్ చదువురాని పల్లెటూరి దళిత యువతి యమునను పెళ్ళాడ్తాడు. ఇద్దరూ పట్నంలో ఉంటున్నారు. యమునకు రాకేశ్ చదువు నేర్పుతాడు. ఓ రోజు పెద్ద రౌడీ యమున ఒంటరిగా ఉన్నప్పుడొచ్చి అత్యాచారం చేయబోతాడు. యమున వాణ్ణి యుక్తిగా నడుం కింద తన్ని, నేను పల్లెటూరి పిల్లనురా అంటుంది. అప్పుడామె ఆ రౌడీకి మహిషాసుర మర్ధనిలా కనిపిస్తుంది.
ఇంటి మనిషి : మాదిగ అరుంధతికి ఏడేళ్ల కొడుకు, భర్త చనిపోతాడు. పట్నంలో శాంతమ్మ ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. అగ్రకులానికి చెందిన శాంతమ్మ కొడుకు రామచంద్రం భార్య అప్పుడే చనిపోతుంది. అరుంధతి అణకువగా, మర్యాదగా అన్ని పనులు చేస్తుంది. ఆమెను రామచంద్రంకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న శాంతమ్మ అరుంధతి కులం తక్కువని మానుకుంటుంది. కొడుకు రామచంద్రం ఈ రోజుల్లో కులం పట్టింపులు ఎక్కడున్నాయమ్మా, బ్రాహ్మణుడైన వశిష్ఠ మహర్షి హరిజన కన్య అరుంధతిని పెళ్ళాడలేదా అని సముదాయిస్తాడు. శాంతమ్మ ఒప్పుకుంటుంది. అరుంధతి కూడా ఒప్పుకుని రామచంద్రంను పెళ్లాడుతుంది. ఆమె కొడుకును రామచంద్రం తన కొడుకులా చూస్తాడు.
తీరము దూరము : విద్యావంతురాలైన వైదేహి హరిజన యువతి. వైదేహి లెక్చరర్‌గా పనిజేస్తూ, ప్రభుత్యోద్యోగి, బ్రాహ్మణుడైన మనోహర్‌ను ప్రేమిస్తుంది. ఒకరి కులం ఇంకొకరికి తెలియదు. ఇద్దరూ కలిసి రామప్పకు విహార యాత్రకు వెళ్ళివస్తారు. అప్పుడు ఒకరి కులం ఇంకొకరికి తెలిసిపోతుంది. మనోహర్ తండ్రి వర్ణ సంకరమని పెళ్ళికి ఒప్పుకోడు. మనోహర్ అక్క, బావలు పెద్దాయనను సముదాయిస్తారు. దాంతో మనోహర్ వైదేహీల పెళ్ళవుతుంది. ఇదే కాకుండా ఐతా చంద్రయ్య కలం నుండి పొద్దు తిరిగింది, పెట్టుబడిదారు, కొత్తమెరుపు, విశారద, గొరియా, రామజోగి, పండుటాకు, కసుగాయ, గూటిగువ్వలు, పంచెవన్నెల చిలుక మొదలైన దళిత కథలు వెలువడినై. కులాల గురించి కథలలో ఆసక్తికరమైన చర్చలున్నై. చంద్రహారం కథలో భవాని దొరల గడిలో దాసీ కూతురుగా నిందలు, దెబ్బలు భరిస్తుంది. దొర్సాని మాలపోరీ, చండాలీ అని తిడుతుంది. అది భరించలేక భవాని చండాలి, మాలది చేదిన నీళ్లెట్లా దొరలు తాగుతున్నారు. చండాలుడు, మాలవాడు పండించిన పంటలనెట్లా తింటున్నారు అని తల్లిని ప్రశ్నిస్తుంది.
అడవి తల్లి కథలో గుత్తేదారు మాయమాటలు నమ్మి లొంగి, తల్లి అయిన కమల పంచాయతీ పెద్దలను ప్రశ్నిస్తుంది. తప్పు చేసినందుకు దొర వద్ద అపరాధంగా డబ్బు వసూలు చేసుకుని వదిలేస్తారు. అప్పుడు కమల ఒక ఆడదాని మానానికి ఖరీదు కడ్తారా? గీ అధికారం మీ కెవరిచ్చిండ్రు? అని పంచాయతీ పెద్దలను నిలదీస్తుంది.
దూరము తీరము కథలో బ్రాహ్మణుడు వాసుదేవశర్మ తన కొడుక్కు హరిజన కన్యతో వివాహానికి వర్ణ సంకరమంటూ ఒప్పుకోడు. అతని అల్లుడు నాగఫణిశర్మ కులాలు లేవని మనుషుల కుత్సితాలేనంటూ భగవద్గీతలో పరమాత్ముడు చాతుర్వర్ణం అంటూ , సృష్టి అన్నది పనిని బట్టే కాని పుట్టుక బట్టి కాదు, ఇవన్నీ మధ్యకాలములో కల్పించబడిన అమర్యాదలు, శ్రీకృష్ణుడు యాదవుడు అతడు క్షత్రియ కన్యను పెళ్ళాడలేదా అని ఆలోచింప జేస్తాడు. కులంపేర సాటి మనిషిని కాదనడం న్యాయమా? ఆది శంకరాచార్య ఓ ఛండాలునికి పాదాభివందనం చెయ్యలేదా అని తండ్రిని వాసుదేవశర్మ కూతురు సముదాయిస్తుంది.ఇట్లా వైవిధ్య భరితమైన అంశాలను కథల్లో ప్రస్తావించిన దళిత స్త్రీ కథలు, ఐతా చంద్రయ్య రచనాపటిమను అన్ని వర్గాల వారిని ఆలోచింప జేస్తాయి.

ఉండ్రాల రాజేశం

9966946084

Related Stories: