ఏదీ నల్లధనం?

Ban Rs.1000 and Rs.500 notes to prevent black money

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నవంబర్ 8న దేశ ఆర్థిక జీవనానికి షాక్ థెరపీగా ప్రకటించిన రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్ల చలామణీ రద్దు (డీమానిటైజేషన్) సఫలమైనట్టా, విఫలమైనట్టా? ఆ సమయానికి చలామణీలో ఉన్న ఆ నోట్ల విలువ రూ. 15 లక్షల 41 వేల కోట్లు. అందులో రూ. 15.31 లక్షల కోట్ల విలువ గల నోట్లు తమకు తిరిగి వచ్చినట్లు భారత రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన 201718 వార్షిక నివేదిక తెలిపింది. తిరిగిరాని నోట్ల విలువ రూ. 10,720 కోట్లు మాత్రమే. బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగిరాదని ప్రభుత్వం ఆరంభంలో అంచనా వేసిన నల్లధనం రూ. 3 లక్షల కోట్లు ఏదీ? తిరిగిరాని రూ. 10,720 కోట్లలో కొంత దేశంలో ఉండగా అధిక భాగం నేపాల్, భూటాన్‌లలో ఉంటుందని అంచనా. తమ ప్రజల వద్ద నున్న రద్దయిన భారతీయ కరెన్సీ మార్చుకునేందుకు ఆ ప్రభుత్వాలు కోరిన వ్యవధిని భారత ప్రభుత్వం ఇవ్వలేదు.

2017, 2018ఆర్థిక సంవత్సరాల్లో కొత్త రూ. 2000, రూ. 500 నోట్ల ముద్రణకు ఆర్‌బిఐకి అయిన ఖర్చు రూ.12,877 కోట్లు. రాష్ట్రాల్లోని రిజర్వు బ్యాంక్ చెస్ట్‌లకు కొత్త కరెన్సీ రవాణాకు కొన్ని వేల కోట్లు ఖర్చు అయి ఉంటుంది. ఈ మొత్తం విన్యాసం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్న చందంగా ఉంది. డీమానిటైజేషన్ ప్రకటన తదుపరి కనీసం నెల రోజుల పాటు చేతిలో చిల్లిగవ్వలేక నిత్య జీవనానికి కోట్లాది మంది పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు పడిన అవస్థలకు, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో పడిగాపులు పడుతూ కుప్పకూలిన 100 మందికిపైగా ప్రాణాలకు, లక్షలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ముడిసరుకులకు, కార్మికుల జీతాలకు డబ్బులేక మూత వేస్తే కోట్ల మంది సామాన్య కార్మికులు కోల్పోయిన ఉపాధికి విలువకట్టే షరాబు ఎవరు? ఆర్థిక వ్యవస్థ మొత్తంగా దెబ్బతింది. జిడిపి వృద్ధిరేటు పడిపోయింది. నష్టం ఎంత అనే అంచనాల్లో భిన్నాభిప్రాయాలుండవచ్చుగాని దాన్ని నిరాకరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. జిడిపి వృద్ధి 1.5 శాతం తగ్గిందని, దాని విలువ సంవత్సర కాలంలో రూ. 2.25 లక్షల కోట్లని మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం అంచనా. ఆర్థిక వ్యవస్థ, ప్రజలు అనూహ్యమైన కష్టనష్టాలపాలైనా డీమానిటైజేషన్ ప్రకటిత లక్షాలు నెరవేరాయా?

ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8, 2016 టెలివిజన్ ప్రసంగంలో డీమానిటైజేషన్ కొరకు ప్రకటించిన మూడు లక్షాలు గుర్తు చేసుకోదగినవి ఒకటి, నల్లధనం వెలికితీత; రెండు, నకిలీ కరెన్సీ ఏరివేత; మూడు టెర్రరిస్టు సంస్థలకు వనరుల మూలాలు నిర్మూలించటం. ఈ లక్షాలు నెరవేరే సూచన కనిపించకపోవటంతో ప్రభుత్వం లక్షాలను మార్చుతూ వచ్చింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటలైజేషన్‌ను వేగిర పరచటం, అవినీతి నిర్మూలన డీమానిటైజేషన్ లక్షమంది. కొద్ది మాసాల హడావుడి తర్వాత, కరెన్సీ లభ్యత పెరగటంతో కరెన్సీ లావాదేవీలు పెరిగాయి. నకిలీ కరెన్సీ ధ్వంసమై ఉండవచ్చుగాని పట్టుబడలేదు. టెర్రరిస్టులకు వనరుల కొరత ఏర్పడి ఉంటే వారి కార్యకలాపాలు నిలిచిపోయి ఉండాలి. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి బంద్ అయిన దాఖలాలు లేవు. ‘నల్లధనం కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది’ అని ప్రభుత్వం కొత్త బాణీ వినిపిస్తోంది.

నల్లధనం ఎల్లప్పుడూ సహజంగా స్థిరాస్తులు, బంగారంలోకి మారుతుంటుంది. బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టం తెచ్చినప్పటికీ ఇంతవరకు ఫలితాలు కనిపించలేదు. ఒకటి మాత్రం నిజం వందలు, వేల కోట్లు అక్రమార్జనను నిల్వ చేసిన వారికి పలుకుబడిగలిగిన వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు కొద్ది రోజులు, వారాల్లోనే కొత్త నోట్ల మార్పిడి జరిగిపోయింది. ఇది ఎలా సాధ్యమో దర్యాప్తు లేదు. జన్‌ధన్ ఖాతాల్లో అమాంతం పెరిగిన నిల్వలు కొద్ది కాలంలోనే విత్‌డ్రా అయినాయి. దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు. పాత ధనం లెక్కలకే ఇంతకాలం పడితే ఆ దర్యాప్తు ఎప్పుడు కొలిక్కి వచ్చేను!

కాబట్టి మోడీ ప్రభుత్వ వైఫల్యాల్లో డీమానిటైజేషన్ ప్రథమ స్థానంలో ఉంటుంది. పారదర్శకత, జవాబుదారీతనం గూర్చి వల్లెవేస్తున్న ప్రభుత్వం వాటిని పాటించదా? డీమానిటైజేషన్ వంటి అత్యంత తీవ్రమైన చర్యకు ఏదీ జవాబుదారీతనం? ఎవరిది జవాబుదారీతనం? విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్క బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న మోడీ వాగ్దానాన్ని ‘ఎన్నికల తమాషా’ అని అమిత్ షా అన్నట్లే, దేశంలో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలన మరో తమాషా అని తేటతెల్లమైంది.