ఏడు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు 868 మంది మృతి

Heavy rains for three days to come to Sircilla District

న్యూఢిల్లీ : దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కురిసిన కుంభవృష్టి వర్షాలకు వరదలు పోటెత్తడంతో జరిగిన ఘటనలు, కొండచరియలు విరిగి పడడంతో ఇప్పటి వరకు 868 మంది మృత్యువాత పడ్డారు. అందులో అత్యధికంగా కేరళలో 324మంది ప్రాణాలు కోల్పోయినట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. శాఖకు చెందిన జాతీయ అత్యవసర స్పందన దళం (ఎన్‌ఇఆర్‌సి) గణాంకాల ప్రకారం కేరళలో 247 మంది మృతిచెందగా, 14 జిల్లాల్లోని 2.11 లక్షల మందిపై వర్షాలు, వరద ప్రభావం పడింది. 32,500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.

అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో 191 మంది, పశ్చిమ బెంగాల్‌లో 183 మంది, మహారాష్ట్రంలో 139, గుజరాత్‌లో 52, అసోంలో 45, నాగాలాండ్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీదం 33 మంది గల్లంతు కాగా, అందులో కేరళలోనే 28 మంది ఉండగా, పశ్చిమ బెంగాలో ఐదుగురు ఉన్నారు. వర్షం సంబంధిత ఘటనలకు మరో 274 మంది క్షతగాత్రులయ్యారు. మహారాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాలు ప్రభావాన్ని చూపించగా, అసోంలో, పశ్చిం బెంగాల్‌లో 23 చొప్పున, కేరళలో 14, యుపిలో 13, నాగాలాండ్‌లో 11, గుజరాత్‌లో పది జిల్లాల్లో వర్షం ప్రభావం చూపింది. 23 హెలికాప్టర్లు, 11 రవాణా విమానాల ద్వారా భారత వైమానిక దళం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. వెయ్యి లైఫ్ జాకెట్లతో గజఈతగాళ్ల బృందాలు, 1300 గంబూట్స్‌తో పాటు 51 పడవలతో భారత నావికా దళం శుక్రవారం కేరళకు బయలుదేరింది. కోస్ట్‌గార్డు కూడా సహాయక బృందాలతోపాటు 30 పడవలతో సహాయక చర్యల్లో పాల్గొంటోంది. పది కంపెనీలు, పది ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు, 60 పడవలు, 100 లైఫ్ జాకెట్లతో ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. అసోంలో వర్షాలు, వరదల్లో చిక్కుకున్న 11.45 లక్షల మంది ప్రజలు బాధితులయ్యారు. 27,600 హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. 357 మంది రెస్కూర్స్‌తో జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన మొత్తం 14 బృందాలు అసోంలో సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు ఎన్‌ఇఆర్‌సి వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో 2.27 లక్షల మంది బాధితులు కాగా, 48,550 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. యుపిలో 1.74 మందిపై వర్ష ప్రభావం పడగా, 33,855 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.

Comments

comments