ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి కృషి

sit2

*కుమ్రం భీం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

మన తెలంగాణ/తిర్యాణి : ఏజెన్సీ ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం తిర్యాణి మండలాన్ని ఆయన సందర్శించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేపట్టారు. పలు అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తిర్యాణి మండలంలో పిఎంజీఎస్‌వై పథకం ద్వారా పండిగి మాదర ఎక్స్‌రోడ్ నుండి భీమ్‌జీ రోడ్ మీదుగా దంతెన పల్లి వరకు, జడ్‌పిరోడ్ నుండి నాగుగూడ వరకు రోంపల్లి నుండి గుండాల వరకు అటవీశాఖ క్లీయరెన్స్ లేక రోడ్ల పనులు నిలిచిపోయాయని వీటి నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, మరో రెండు నెలల్లోగా అటవీ అనుమతి రానుందన్నారు. అలాగే ముల్కల మంద నుండి గుండాల, దాంపూర్ నుండి కేరెగూడ మీదుగా మంగివరకు పంగిడి మాదర నుండి కౌటెగాం వరకు, చెలిమెల నుండి మాణిక్యాపూర్ వరకు సైతం అటవీ అనుమతులు లేక మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఈ రోడ్ల నిర్మాణాల కోసం అటవీశాఖ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి అధికారుల సమన్వయంతో డిజిటల్ సర్వేలు చేపట్టి నివేదికలు తయారు చేయాలని  ఆదేశించారు. ఈ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లయితే 20 గ్రామాలకు పైగా రోడ్డు సౌకర్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. మండలంలోని నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వచ్చే హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలని డిఆర్‌డిఓ పిడిని ఆదేశించారు. వేసవికాలం రానున్న దృష్టా ప్రతీ గ్రామంలో ఎడ్లబండ్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా  చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓడిఎఫ్ కింద ఎంపికైన గ్రామాల్లో నిర్ణీత గడువులోగా మరుగుదొడ్లు పూర్తయినట్లయితే రూ. 5 లక్షలనుండి 10 లక్షల వరకు ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. అనంతరం ఆయా గిరిజన సంఘాల నాయకులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్‌కు వెంటా ఆయాశాఖల అధికారులు, పలువురు ఉన్నారు.