ఏజన్సీ ప్రజలపై…దోమల దండయాత్ర

వణుకుతున్న మండల వాసులు కిక్కిరిసిన ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానాలు పూర్తి స్థాయిలో అందని ప్రభుత్వ వైద్యం కనిపించని దోమతెరలు నిర్లక్షం వహిస్తున్న ప్రభుత్వ యంత్రాగం మన తెలంగాణ/బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని ఏజన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ కారణంగా మండలంలో రోజు రోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది. మోరంపల్లి బంజర్, బూర్గంపాడు ప్రభుత్వ హాస్పటల్‌లో రోజుకూ వందల సంఖ్యలో జ్వరపీడితుల సంఖ్య […]

వణుకుతున్న మండల వాసులు
కిక్కిరిసిన ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానాలు
పూర్తి స్థాయిలో అందని ప్రభుత్వ వైద్యం
కనిపించని దోమతెరలు
నిర్లక్షం వహిస్తున్న ప్రభుత్వ యంత్రాగం

మన తెలంగాణ/బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని ఏజన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ కారణంగా మండలంలో రోజు రోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది. మోరంపల్లి బంజర్, బూర్గంపాడు ప్రభుత్వ హాస్పటల్‌లో రోజుకూ వందల సంఖ్యలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుంది. వైద్యుల ద్వారా సరైన వైద్యం అందటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది వైద్యులు జ్వరపీడితులకు మందులు బయట కొనుక్కోమని చీటి రాసి ఇస్తున్నారు. ఇలా ప్రభుత్వాసుపత్రి తీరువుండటంతో గత్యంతరం లేక పేద ప్రజలు సైతం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుల తరబడి వైద్యం చేయించుకుంటున్నా వ్యాధులు తగ్గటం లేదని, డబ్బులు మాత్రం భారీ మొత్తంలో ఖర్చులు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు పోయి వ్యాధులు నయం కావడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుప్రతుల్లో మెరుగైన వైద్యం అందితే ప్రైవేటు హాస్పటల్‌లకు వెళ్లాల్సిన పని ఉండదని, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు సేవలందించాల్సిన వైద్యులు ప్రైవేటు మాటున దందాలుగా మరో హాస్పటల్‌లు పెట్టుకుని వైద్య సేవలను చేస్తూ, అక్రమ సంపాదనకు అలావాటు పడుతున్నారని, అలాంటి వారిపై ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షలానే మారింది అని మండల ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో డ్రైనేజీలు లేక రోడ్లుపైకి మరియు ఇళ్లల్లోకి చేరిన నీటిలో దోమలు వృద్ధి చెంది ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అనేక గ్రామాలలో అపరిశుభ్రత నెలకొని, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలపై దోమలు దండయాత్ర చేసి దాని కాటుతో రోగాలను వ్యాప్తి చేస్తున్నాయి. ఇక పందులయితే విచ్చల విడిగా గ్రామల్లో తిరుగుతున్నా పంచాయతీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. దోమల ఫాగింగ్ మిషన్‌ను గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా నివారించాల్సి ఉంది కానీ మండలంలో ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోకుండా తమకేమి తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా దోమల నివారణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంటారు. కానీ దోమల నివారణకు చర్యలు తీసుకోకుండా ఈ నిధులను సైతం స్వాహా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు సమస్యలు లేని చోట క్యాంపులను నిర్వహిస్తూ, సమస్యలు ఉన్న ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేయడం లేదు. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ప్రజలు కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలో ఉన్న సమస్యలను పరిష్కారించాలని, మండల వ్యాప్తంగా దోమ తెరలను పంపిణీ చేయాలని, దోమల మందును పిచికారి చేయించాలని, జ్వరా ల భారినుంచి రక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కానరాని దోమ తెరలు : వర్షా కాలం ప్రాంరంభమై నెల రోజులు దాటినా మండలంలో దోమతెరలు కనిపించడం లేదు. అసలే ఏజెన్సీ ప్రాంతం కావడంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. జ్వరాల బారిన పడే రోగుల సంఖ్య సైతం మండలంలో అధికంగా ఉన్నది. కానీ నేటికీ మండల వ్యాప్తంగా దోమ తెరలను పంపిణీ చేయలేదు. వ్యాధుల నివారణకు పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంగా కృషి చేస్తే ఫలితం కనిపించేది కానీ సమన్వయ లోపంతో ప్రజలు జ్వరాల బారిన పడుతూ ఆస్తులను అమ్ముకుంటూ ప్రైవేట్ హాస్పటల్‌లను ఆశ్రయిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా తెలిసి కుడా అధికారుల నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు. ఇటీవల కాలంలో టేకులచెర్వు గ్రామంలో జ్వరాల భారిన పడి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ, వైద్య సేవల కోసం డబ్బులు లేక ఇంట్లోనే ఉండి కాలం వెళ్లదీస్తున్న రోగులపై అధికారులు స్పందించి హడావిడి చేసి, గ్రామంలో బ్లీచింగ్ పౌడర్‌ను గ్రామ వీధుల్లో చల్లటం, స్వయంగా సబ్‌కలెక్టర్ టేకులచెర్వు గ్రామంలో పర్యటించి రోగులకు మెరుగైనా వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించడం, దోమతెరలను పంపిణీ కార్యక్రమాలను చేశారు. కానీ సబ్‌కలెక్టర్ ఒక్క విషయాన్ని మరిచారనే ప్రశ్న ఇప్పుడు మండలంలో ఉత్పన్నమవుతుంది. ఒక టేకులచెర్వు గ్రామంలోనే విష జ్వరాలు వ్యాపించాయా, లేక మండల వ్యాప్తంగా ఈ జ్వరాలు ఉన్నాయా అని కనుక్కున్నారో లేదో కానీ మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు మాత్రం జ్వరాలు వచ్చిన చోటనే సమస్యలు ఉన్నట్లు వ్యవహరించడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండల వ్యాప్తంగా జ్వర పీడితులు ఉంటే మరి మండల వ్యాప్తంగా ఎందుకు వైద్య సేవలను అందించడం లేదని, దోమ తెరలను ఎందుకు పంపిణీ చెయ్యటం లేదని, దోమల నివారణకు ఫాగింగ్ ఎందుకు చెయ్యటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సబ్‌కలెక్టర్ స్పందించి మండల వ్యాప్తంగా వున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: