ఎవరెస్టే నా లక్ష్యం

అతను పుట్టింది ఒక మారుమూల తండా. కాని అతని ప్రతిభ పెద్ద  కొండ. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఎక్కి ఎంతో ఎత్తుకు ఎదిగిన తెలంగాణ గిరిజన యువ పర్వతారోహకుడు. కిలిమంజారో  పర్వతంపై 18 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.  దాంతో పాటు హెల్మెట్ వాడకంపై సందేశాన్ని ఇవ్వడం ఆయన సామాజిక స్పృహకు నిదర్శనం.  ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. మట్టిలోనే మాణిక్యాలు పుడతాయి. ప్రయత్నం చేస్తే విజయం మన సొంతం అవుతుందంటూ రాష్ట్రపతి చేతుల […]

అతను పుట్టింది ఒక మారుమూల తండా. కాని అతని ప్రతిభ పెద్ద  కొండ. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఎక్కి ఎంతో ఎత్తుకు ఎదిగిన తెలంగాణ గిరిజన యువ పర్వతారోహకుడు. కిలిమంజారో  పర్వతంపై 18 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.  దాంతో పాటు హెల్మెట్ వాడకంపై సందేశాన్ని ఇవ్వడం ఆయన సామాజిక స్పృహకు నిదర్శనం.  ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. మట్టిలోనే మాణిక్యాలు పుడతాయి. ప్రయత్నం చేస్తే విజయం మన సొంతం అవుతుందంటూ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రపంచ రికార్డు గుర్తింపు అందుకున్న  అమ్గోత్ తుకారాం సకుటుంబంతో ముచ్చటించాడు.

నాకు స్కూల్లో చదువుతున్నప్పటి నుండి ఎన్‌సిసి యూనిఫాం వేసుకోవాలని చాలా కోరిక ఉండేది. నేను పదవతరగతి లో ఉన్నప్పుడే మా పిఈటి సార్ సుభాష్‌నాయక్ ప్రోత్సాహంతో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్‌సిసిలో చేరి శిక్షణ పూర్తిచేశాను. తరువాత తెలంగాణ ఎన్‌సిసి బెటాలియన్‌లో అవకాశం వచ్చింది. ఇంటర్‌లో ఉన్నప్పుడు ‘మల్కం’ అనే ఆటలో ఐదు సార్లు నేషనల్ స్థాయిలో (తమిళనాడు, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్) పాల్గొన్నాను. తర్వాత లంగ్డీ ఆటలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడాను. అదే క్రమంలో పర్వాతారోహణ శిక్షణలో అవకాశం వచ్చింది. అక్కడ ఉన్న ఆర్మీ వాళ్లతో పరిచయం ఏర్పడింది . వాళ్లు నాకు పర్వతారోహణ గురించి అవగాహన కల్పించి నాకు సహాయం చేశారు. మూడు సార్లు విఫలమయ్యాను కాని లక్ష్యాన్ని పట్టువిడవకుండా ప్రయత్నం చేసి విజయాల బాట పట్టాను.

ఇప్పటి వరకూ ఎన్ని పర్వతాలు ఎక్కారు ? వాటి ఎత్తు ?
నేను మొదటగా మూడు దేశాల్లో ఇండియా నేపాల్, పోలాండ్, లో ఉన్న పర్వతాలు ఎక్కాను. తరువాత 2016 లో మౌంట్ మార్గ్ 17,వేల 140 ఫీట్లు హిమచల్ ప్రదేశ్ లో రుగ్వేద పర్వతం, 2017 గంగోత్రి పర్వతం 19వేల 91ఫీట్లు, 2017 జూలైలో ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటయిన స్టాఫ్ కాంగ్రీ 20వేల 100ఫీట్లు, 2018 జూలై మౌంట్ కిలీ మంజారో, 19వేల 340ఫీట్లు ఎక్కాను.

చాలా మంది ఈ సాహసం చేశారు. మీ ప్రత్యేకత ఏమిటి?
నేను పర్వతారోహణ చేసేటప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నాను. అలా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా రెండు సార్లు ఎక్కి పర్వతం మీదకి చేరుకున్నాను. కిలీ మంజారో ఎక్కినపుడు 18 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం పాడాను. మొత్తం ఐదుగురం మొదలు పెడితే చివరగా నేను ఒక్కడినే పర్వతం పైకి చేరుకున్నాను. అలా ఇండియా నుండి ప్రపంచ రికార్డు సృష్టించాను. ఈ పర్వతాలు ఎక్కినప్పుడు సందేశాత్మకంగా అందరూ హెల్మెట్ ధరించాలని మన కోసం కాకపోయినా కుటుంబం కోసం తప్పని సరిగా పాటించాలని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేశాను. ఎందుకంటే నా కళ్లముందు యాక్సిడెంట్లు జరిగినపుడు చూసి చలించిపోయాను.

మీ కుటుంబ నేపథ్యం గురించి…
మాది రంగారెడ్డి జిల్లా యాచారం తక్కెళ్ల తండా. వ్యవసాయ కుటుంబం మా అమ్మ జంకు, నాన్న రామదాసు మేము ఐదుగురం పిల్లలం నేను ఇంట్లో చిన్నవాడిని. పదవ తరగతి వరకూ మెదక్ గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. మా అమ్మ నాన్న ఇంట్లో తక్కువగా ఉంటారు. పొలంలో ఎక్కువ సమయం శ్రమ చేసుకుంటునే ఉంటారు. నేను పర్వతాల ట్రెక్కింగ్ చేస్తానని తెలిసినపుడు, నా పేదరికం గురించి పరిస్థితుల గురించి హేళన చేస్తూ చాలా మంది చులకనగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అలాంటి సమయంలో టీఎస్ సుధాకర్, రామచందర్ వంటి వ్యక్తులు, సంస్థలు నాకు సహకారం అందించాయి. మనలో ప్రతిభ, నైపుణ్యం ఉన్నపుడు సహాయం చేసే చేతులు సిద్ధంగా ఉంటాయని నా విషయంలో రుజువైంది.

ఈ ప్రమాదకరమైనా సాహసం చేయడానికి వెళ్లినప్పుడు మీ కుటుంబ స్పందన…
నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదే . మా అమ్మనాన్నకు దీని గురించి వివరంగా చెప్పలేదు. ఎందుకంటే వాళ్లకు తెలిస్తే భయపడి నన్ను పంపించడానికి ఒప్పుకోరు. ఆటలాడటానికి ఇతర దేశాలకు వెళ్లి వస్తానని తెలుసు. మా బిడ్డకు మంచి గుర్తింపు లభించిందని చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. మా అన్నయ్యలకు తెలుసు వాళ్ల నుంచి నాకు సహకారం ఉంటుంది.
ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.
చాలా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో భయానికి లోనవకూడదు. ఎక్కుతున్నపుడు పర్వతాల ఎత్తు చూడకూడదు. దాని ఎత్తును బట్టి చేరుకోవడానికి వారం పది రోజులు పడుతుంది. నిర్దేశించిన సమయం ఉండదు. కొన్ని సార్లు మంచు తుఫాన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మంచు తెప్పలు కూలిపోయి మీద పడే ప్రమాదం కూడా ఉంటుంది. అనుకోని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. మాతో 15 నుంచి 20 కిలోల బరువు ఉండే కిట్ భుజానికి ఉంటుంది. ఎక్కువగా డ్రైఫ్రూట్స్ తినాలి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. పల్స్‌రేట్ పడిపోకుండా చూసుకోవాలి. పల్స్‌రేట్ తక్కువైతే తలనొప్పి, మోకాలి నొప్పులు వస్తాయి. 5,10 నిమిషాలకంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవద్దు. ఒకసారి నేను జారి పడ్డాను, ఐస్ యాక్షన్ టీమ్ నన్ను కాపాడారు. లేకపోతే మంచు లోయలో పడిపోయేవాడిని. మంచులో ఇరుక్కుపోతే టెక్నిక్‌తో బయటపడాలి. వేయి మీటర్ల దగ్గరలో ఉన్నపుడు చివరిరోజు నిద్ర పోకూడదు. నిద్రపోతే ఆ చలికి కోమాలోకి పోయే ప్రమాదం ఉంటుంది. అలా చాలా మంది సగంలోనే ఆగిపోతారు. మన దేశంలో నుండి మహిళలు తక్కుగా ఉన్నారు. కాని జర్మనీ, ఆస్ట్రేలియా వాళ్లు ఎక్కువగా ఉంటారు.

ఇప్పటి వరకూ వచ్చిన అవార్డులు…
జమ్మూకశ్మీర్‌లో జవహార్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ భారత ప్రభుత్వం తరఫున ఉత్తమ టెక్నికల్ ఆవార్డు. కిలీ మంజారో ఎక్కినపుడు 2018 జూలై 18న రాష్ట్రపతి అవార్డుతో పాటు మన గవర్నర్ కొత్త కాన్సెప్ట్ బాగుందని మెచ్చుకున్నారు. 2015,18 తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్‌మెన్ అవార్డు, సెంట్రల్ నెహ్రూ యువజన కేంద్రంలో యంగ్ అచీవర్ అవార్డు, ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాన గిరిజన సంఘం కొమురం భీం జాతీయ అవార్డులు వచ్చాయి.

ఎలాంటి అనుభూతిని పొందుతారు. ఇంకా ఏ పర్వాతాలు ఎక్కబోతున్నారు?
హిల్స్ ఎక్కినపుడు చాలా థ్రిల్‌గా సంతోషంగా ఉంటుంది. ప్రపంచమంతా మన కళ్లముందు ఉన్నట్లుగా అనిపిస్తుంది. వచ్చే సంవత్సరం 2019 మార్చి లో ఎవరెస్టు శిఖరం ఎక్కి రికార్డు సృష్టించాలను కుంటున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన పర్వాతాలు ఎక్కాలనుకుంటున్నాను. ఖచ్చితంగా సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.

                                                                                                                                                      – బొర్ర శ్రీనివాస్