ఎమన్‌లో సౌదీ మారణ హోమం

66 children died in the August attack on Eman

ఎమన్‌పై ఆగష్టులో జరిగిన దాడుల్లో 66 మంది పిల్లలు మరణించారు. అమెరికా, బ్రిటన్ల సహాయసహకారాలతో సౌదీ అరేబియా చేస్తున్న ఈ దాడులు నిజానికి అమాయక పౌరులను హతమార్చే జాతినిర్మూలన చర్యల వంటివి.

మూడు సంవత్సరాలుగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇతర అరబ్బు దేశాలు ఎమన్ లో హూతీ తిరుగుబాటుదారులపై అమానుష దాడులకు పాల్పడుతున్నాయి. పది వేలకు మించి ఎమనీ పౌరులు మరణించారు. ఇందులో అనేకమంది స్త్రీలు, పిల్లలు ఉన్నారు. పాశ్చాత్య మీడియా ఈ నరహత్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా, బ్రిటన్ల ఆయుధ సహాయం, ఇంటిలెజన్స్ సహకారం లేనిదే ఈ దాడులు సాధ్యమయ్యేవి కావు. ఎమన్‌లో జరుగుతున్నది యుద్ధనేరాలని ఇప్పుడు అందరూ అంగీకరించక తప్పడం లేదు. అమెరికా, బ్రిటన్ల దుర్మార్గపు వైఖరి అందరి ముందు బట్టబయలైంది.

ఆగష్టు 23వ తేదీన సౌదీ నాయకత్వంలో ఎమన్‌లోని హుదైదా పోర్టుపై బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 24 మంది పిల్లలు నలుగురు మహిళలు మరణించారు. ఆ తర్వాత సౌదీ అయిష్టంగానే పొరబాటు జరిగిందని ఒప్పుకుంది. అంతేకాదు, అంతకు ముందు ఆగష్టు 9వ తేదీన జరిగిన వైమానిక దాడుల్లోను పొరబాటు జరిగిందని ఒప్పుకుంది. ఆ దాడుల్లో 40 మంది పిల్లలు మరణించారు. ఈ దాడులకు సహాయసహకారాలు పాశ్చాత్య దేశాల నుంచే లభిస్తున్నాయి.

అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో తప్పు జరిగిందని సౌదీ ప్రకటించింది. ఎమన్ యుద్ధంలో స్పెయిన్‌కు ప్రత్యక్షంగా సంబంధమేమీ లేదు. అయినా సౌదీ అరేబియాకు అమ్మాలని ఒప్పందం కుదిరిన 400 లేజర్ గైడెడ్ బాంబుల అమ్మకాన్ని రద్దు చేసింది. ఎమన్‌పై విచక్షణ లేకుండా దాడులను బ్రిటన్ పైకి మాత్రం ఖండిస్తోంది. కాని లోపాయికారిగా మాత్రం సౌదీతో స్నేహం కొనసాగిస్తుంది. బిలియన్ల డాలర్ల అత్యాధునిక ఆయుధాలను సౌదీకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అమ్ముతోంది. బ్రిటీష్, అమెరికా మిలిటరీ నిపుణులు సౌదీ వార్ రూముల్లో కూర్చుని ఎమన్ పై దాడులను పర్యవేక్షిస్తున్నారు.

సౌదీ దాడుల వల్ల ఎమన్‌లో పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు మరణించారని రెండు వారాల క్రితం ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. ఎమన్‌లోని ఓడరేవులను, గగనతలాన్ని దిగ్బంధించడం ద్వారా సౌదీ మిత్రపక్షాలు అంతర్జాతీయ మానవీయ సూత్రాలను ఉల్లంఘించాయని కూడా ఐక్యరాజ్యసమితి విమర్శించింది.

నిజానికి ఎమన్ యుద్ధం షియా ఇరాన్, సున్నీ సౌదీల మధ్య సాగుతున్న ముసుగు సమరం. పరోక్ష యుద్ధం. ఎమన్‌లో హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సహాయం, ఆయుధాలు లభిస్తున్నాయి. హూతీలను కట్టడి చేయడంలో అరబ్బు దళాలు విఫలమైన తర్వాత సౌదీ అరేబియా కొత్త సైనిక నాయకత్వాన్ని తీసుకువచ్చింది. పాకిస్తాన్ రిటైర్డ్ ఆర్మీ చీఫ్ రాహిల్ షరీఫ్ సేవలను 2016 నుంచి పొందడం ప్రారంభించింది. ఆ తర్వాతి నుంచి సౌదీ దాడుల తీవ్రత పెరిగింది. యుద్ధనేరాల ట్రిబ్యునల్ ఏర్పడితే రాహిల్ షరీఫ్ పై కూడా కేసు తప్పదు.

సిరియాలో ఇద్లిబ్ పై అక్కడి సైన్యం దాడులను ఖండించడానికి భూమ్యాకాశాలను ఏకం చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాత్రం మాట్లాడడం లేదు. ఇద్లిబ్‌లో సౌదీ మద్దతున్న తిరుగుబాటుదారులను సిరియా సైన్యం పారదోలినప్పుడు గోల చేసిన అమెరికా ఇప్పుడు ఎమన్ విషయంలో మౌనంగా ఊరుకుంటోంది. అమెరికా సమకూర్చిన ఆధునిక ఫైటర్ విమానాలు, ఇతర ఆయుధాలు లేకుండా సౌదీ సైన్యం ఈ స్థాయిలో మారణహోమం సాగించడం సాధ్యమయ్యేది కాదు.

పాశ్చాత్య మీడియా పాత్ర కూడా దుర్మార్గంగానే ఉంది. ఆన్ లైన్ జర్నల్ స్ట్రాటజిక్ కల్చర్ ఫౌండేషన్ జూన్‌లో ఎమన్ పరిస్థితిపై రాస్తూ సౌదీ, ఎమిరేట్ దళాలు, విదేశీ కిరాయి సైనికులు ఉన్న సంకీర్ణ సైన్యానికి బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సు దేశాలు పూర్తి సహకారం అందిస్తున్నాయని చెప్పింది. హుదైదా ఓడరేవును స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత హుతీ తిరుగుబాటుదారులను అణచేయడం చాలా తేలికైపోతుందన్నారు. కాని హుదైదా ఓడరేవును స్వాధీనం చేసుకోడం ద్వారా ఎమన్‌లో సాధారణ ప్రజలకు ఆహారం, ఇతర నిత్యావసరాలు అందకుండా చేసి ఆకలిని ఆయుధంగా మార్చుకోవడం అనేది అత్యంత నీచమైన యుద్ధనేరం.

హుదైదా ఘోరకలి జరిగినప్పుడు పాశ్చాత్య మీడియా అక్కడి సాధారణ ప్రజలకు మానవీయ సహాయం అందడం ఆగిపోవచ్చని, ఎమన్ ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చని రాసినప్పటికీ, ఈ దాడులకు సహాయసహకారాలు పాశ్చాత్య దేశాలే అందించాయన్న వాస్తవాన్ని మాత్రం ప్రస్తావించలేదు. బిబిసి, ఫ్రాన్స్ 24, సిఎన్‌ఎన్ వంటి వార్తాసంస్థలన్నీ ఎమన్‌కు సంబంధించి వాస్తవాలను దాచిపెడుతున్నాయి. ఉదాహరణకు వాషింగ్టన్ పోస్టు సౌదీ దాడుల గురించి మాత్రమే రాసింది కాని ఈ దాడుల్లో ఉపయోగించిన యుద్ధ విమానాలు అమెరికన్ ఎఫ్ 15 ఫైటర్ జెట్‌లు, బ్రిటీష్ టైఫూన్‌లు, ఫ్రెంచ్ డసాల్ట్ లేనని చెప్పలేదు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలతో ప్రశ్నలు ముందుకు వచ్చినప్పుడు బ్రిటీష్ మంత్రి అలీస్టయిర్ బర్ట్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

ఎమన్ హననంలో నేరస్థులకు శిక్షలుపడే అవకాశం కనబడడం లేదు. మధ్యప్రాచ్యంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందన్న సాకుతో ఇరాన్ ప్రాబల్యాన్ని దెబ్బతీయడమే సౌదీ, పాశ్చాత్య దేశాల పథకం. కాని అల్ ఖాయిదాకు నిధులు వెళ్ళింది సౌదీ నుంచే. ఇటీవల మధ్యప్రాచ్యంలో ఇరాన్ పలుకుబడి చాలా పెరిగింది. ఇప్పుడు సిరియా, ఇరాక్, లెబనాన్, ఖతర్, ఎమన్ దేశాల్లోను ఇరాన్ పలుకుబడి పెరుగుతోంది.

సౌదీ యువరాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ ఇరాన్‌ను కట్టడి చేయడానికి ఇస్రాయిల్ తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. డోనాల్డ్ ట్రంప్ అల్లుడు, సలహాదారు జెరేడ్ కుష్నర్ సౌదీ యువరాజుకు సన్నిహిత మిత్రుడు. ట్రంప్‌కు కూడా వ్యక్తిగతంగా ఇరాన్ పట్ల ద్వేషం ఉంది. ఈ కారణాలన్నీ ఇప్పుడు మధ్యప్రాచ్యంలో పరిస్థితిని మరింత చిక్కుముడిగా మార్చేశాయి. వ్యూహాత్మకంగా సౌదీ అరేబియా షియా జనాభాను బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇరాక్‌లో షియా మెజారిటీ, సిరియాలో పాలకులు షియాలే. బహ్రెయిన్లోను షియాలదే మెజారిటీ అయినా పాలకులు సున్నీలు. లెబనాన్‌లో శక్తివంతమైన హిజ్బుల్లా మిలిటెంట్లు షియాలే.

సౌదీ పాలకులకు షియాల పట్ల ఎంత వ్యతిరేకత ఉందంటే ఈ సారి హజ్‌కు ఇరాన్ యాత్రికులకు అనుమతి లభించలేదు. ఎమన్ లో యుద్ధనేరాలను చూస్తే సౌదీ యువరాజు ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. సౌదీ, ఎమిరేట్స్ దేశాలకు ఆయుధాలు అమ్మరాదన్న ఒత్తిడి ఇప్పుడు అమెరికా, బ్రిటన్లపై పెరుగుతోంది. అయినా ఈ దేశాలు ఒప్పుకోవడం లేదు. ఆయుధాల అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని వదులుకోడానికి అవి సిద్ధంగా లేవు. సౌదీ, యునైడెట్ అరబ్ ఎమిరేట్స్ వంటి అరబ్బు దేశాలు, వారికి సహకరిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పాశ్చాత్య దేశాలు పాల్పడుతున్న యుద్ధనేరాలకు ట్రిబ్యునల్ ముందు విచారణ జరగకపోతే కేవలం నోటిమాటలుగా వ్యక్తం చేసే విచారాలు, సానుభూతులకు అర్థం లేదు.

Comments

comments