ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

Be ready when the elections are ready: MLA DK Aruna

ఎమ్మెల్యే డీకే అరుణ

మన తెలంగాణ/గద్వాల : సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఏవి వచ్చినా కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌వీ ఈవెంట్‌హాల్‌లో గట్టు మండల కార్యకర్తలు, నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెసేనన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉండకపోతే సీఎం కేసీఆర్ అయ్యేవారు కాదన్నారు. సీఎం కుర్చీ కాంగ్రెస్ పెట్టిన భిక్షేనన్నారు. నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. థర్మల్, సోలార్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినా ఎందుకు వీటిని సాధించలేదన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని, పార్టీ అభివృద్ధికి పాటు పడాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, నందిన్నె ప్రకాష్‌రావు, నాగేందర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.