ఎనిమిదేళ్లకే భారీ వాహనాలు నడిపిన రైడింగ్ ‘రిఫా’

Raiding-ri;ha-image

పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అంటారు. పట్టుదల ఉండాలేకానీ  ఎంత పెద్ద సాహసాన్నైనా  అవలీలగా చేయగలరు కొంతమంది. దానికి వయసు నిమిత్తం  లేదు. బుడిబుడి అడుగుల చిన్నారులు సైతం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదిస్తున్నారు. దంగల్ సినిమాలో అమీర్‌ఖాన్ తను కుస్తి పోటీలో ఇంటర్నేషనల్  మెడల్ సాధిద్దాం అని అనుకుంటాడు కాని తన వల్ల కాలేదు.. అప్పుడు తన ఇద్దరు కూతుళ్లతో ఆ కలను నిజం చేసుకుంటాడు. అచ్చం అలాంటి సన్నివేశం ఒకటి మైసూర్‌లో జరిగింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కదానిలో ముందుండాలని నిరూపించింది 8 సంవత్సరాల  మైసూరుకి చెందిన  అమ్మాయి. అసలు సైకిల్ తొక్కాలంటేనే భయపడుతుంటారు చిన్న పిల్లలు. అలాంటిది 17 రకాల పెద్ద పెద్ద వాహనాలను నడుపుతూ రికార్డు సృష్టించింది.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది రిఫా.

రిఫా మైసూరులోని బన్నిమంటపానికి చెందిన అమ్మాయి. అక్కడే స్థానిక సెంట్ జోసఫ్ స్కూల్‌లో మూడో తరగతి చదువుకుంటుంది. తల్లిదండ్రులు తాజుద్దీన్ టైల్స్ డీలర్. మాజీ రేసర్ కూడా. ఇంక తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. రిఫా తండ్రికి చిన్నప్పటి నుండి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. జాతీయ స్థాయిలో కార్ రేసింగ్‌లో ఒకప్పుడు ఆయన పాల్గొన్నాడు. ప్రపంచ ఛాంపియన్ కావాలన్నది ఆయన కల. ఆర్థిక పరిస్థితులు సరిగ్గాలేకపోడంతో ఆయన కల కలగానే మిగిలిపోయింది. తనకు ఇద్దరు కూతుళ్లు. వారు చదువుతో పాటు ఇంట్లో కూడా చాలా అల్లరిగా ఉండేవారు. వాళ్ల ద్వారా తన కలను నిజం చేసుకోవాలనుకున్నాడు తాజుద్దీన్.

పెద్ద కూతురు రిఫా తస్కీన్ తండ్రికి తగ్గ కూతురుగా పేరుతెచ్చుకుంది. తనకు చిన్నప్పటినుంచే డ్రైవింగ్ అంటే ఇష్టం. మూడు సంవత్సరాల వయసు నుంచే డ్రైవింగ్ నేర్చుకోవడం అలవాటుచేసుకుంది. ఏకంగా రిఫా ఇప్పుడు తను అన్ని రకాల బైకులు, కార్లు, పెద్ద పెద్ద లారీలను సైతం నడిపేయడం నేర్చుకుంది. ప్రస్తుతం పవర్‌స్టీరింగ్ వాహనం ఎలాంటిదైనా ఓకె అంటుంది. . వెహికల్స్‌ను రివర్స్‌లో నడపడం కూడా రిఫాకి వచ్చు. దాంతో ఇప్పటివరకు 50 సార్లు వెహికల్స్‌ని రివర్స్‌లో నడిపి మైసూరులో ఏర్పాటు చేసిన ఎన్నో పోటీల్లో పాల్గొని అవార్డులు రివార్డులు తన సొంతం చేసుకుంది.

“అమెరికాలో ఓ అబ్బాయి 10 ఏండ్ల వయసులో ఓ కారు నడుపుతూ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు నా కూతురు ఆల్టో 800, స్విఫ్ట్, సాంత్రో, స్కార్పియో, ఇన్నోవా, లాన్సర్, ఫెరారీ, టాటా ఏస్, బోలేరో, ఐషర్ లారీని సైతం నడపగలుగుతుంది. ఇంతవరకు అమ్మాయిలెవరూ ప్రపంచ రికార్డు సృష్టించలేదు. నా కూతురుకు ఆ ప్రతిభ ఉన్నది అంటాడు రిఫా తండ్రి తాజుద్దీన్. ‘మా నాన్నే నాకు స్ఫూర్తి. నేను వాహనాలు నడుపుతుంటే.. ఆయన నా పక్కనుండి నన్ను నడిపిస్తుంటారు. డ్రైవింగ్‌ని నేను ప్రేమిస్తాను. వాహనాలు నడపడం నాకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మా నాన్న తయారు చేసిన క్వాడ్ బైక్ నడపడం ఇంకా ఇష్టం. భవిష్యత్‌లో ఫైటర్ పైలట్ కావాలనుకుంటున్నా. అలాగే ప్రపంచ ప్రఖ్యాత రైడర్ కావాలనుకుంటున్నా’ అని చెబుతోంది రిఫా. ‘నా కూతురును చూస్తే గర్వంగా ఉంటుంది. మూడేండ్ల నుంచే డ్రైవింగ్ నేర్చుకుంది. ఆమె డ్రైవ్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఖాళీగా ఉండి, ఎవరూ లేని గ్రౌండ్స్‌లోనే తను ప్రాక్టీస్ చేస్తుంది” అని రిఫా తల్లి బీబీ ఫాతిమా చెబుతుంది. నిజానికి 18 ఏండ్లలోపు వాళ్లు బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు నడపడానికి అనుమతి లేదు. వాళ్ల సొంత స్థలాల్లో నే వాహనాలను నడిపించుకోవాలి.

యువతీయువకులు చిన్న వయసు నుంచే వారికి నచ్చిన వచ్చిన విషయాలను తల్లిదండ్రులు గుర్తించి వారికి ప్రోత్సాహం అందిస్తే దేశానికి, తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెస్తారు అని అంటున్నారు నేటి తరం యువత.