ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త చెరువులు

New Ponds in giant Adilabad District

నాలుగు జిల్లాల్లో
18 కొత్త చెరువులు
4539 ఎకరాలకు సాగు నీరు
మొదటి దశ అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు

మన తెలంగాణ/ఆదిలాబాద్ : ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన హమీ మేరకు 18 కొత్త చెరువులను ఇవాళ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో 4539 ఎకరాలకు ఈ కొత్త చెరువుల ద్వారా నీరందనుంది. ఈ 18 కొత్త చెరువుల స్టేజ్1 అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు చేసింది. మొదటి దశ అనుమతుల్లో భాగంగా ఈ కొత్త చెరువుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను చేపట్టనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కార్కి గ్రామంలో 150 ఎకరాలకు సాగు నీరిచ్చే కొత్త చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. అదే మండలంలో మరో 100 ఎకరాలకు నీరిచ్చేందుకు, అదే మండలంలో ఘన్పూర్‌లో 250 ఎకరాలకు, ఇచ్చోడ మండలంలో జున్ని గ్రామంలో 200 ఎకరాలకు, తలమడుగు మండలం ఉమ్రి గ్రామంలో 320 ఎకరాలకు, బైజరత్నూర్ మండలంలో ఘన్పూర్ గ్రామంలో 150 ఎకరాలకు, నార్నూర్ మండలంలో మంజరి గ్రామంలో 140 ఎకరాలకు సాగు నిరిచ్చేందుకు గ్రామానికో కొత్త చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. అదే రితీలో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో దంతనపల్లి గ్రామంలో 400 ఎకరాలకు నీరిచ్చేందుకు, ఇంద్రవెల్లి మండలం దేవపూర్ గ్రామ పరిధిలో 190 ఎకరాలకు, గౌరాపూర్ గ్రామ పరిధిలో 250 ఎకరాలకు నీరిచ్చేందుకు గ్రామానికో చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోనే నేరేడిగోండ మండలం నేరడిగోండ గ్రామంలో 200 ఎకరాలకు, నార్నూర్ మండలం మేరేగాం గ్రామంలో 121 ఎకరాలకు, అదే మండలంలోని మహాగాం గ్రామ పరిధిలో 346 ఎకరాలకు, కోమురం భీం జిల్లాలో సిర్పూర్(యు) మండలంలో మామిడి పల్లి గ్రామ పరిధిలో 121 ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు గ్రామానికో కొత్త చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక నిర్మల్ జిల్లాలో కడెం మండలం ఇస్లాంపూర్ గ్రామ పరిధిలో 250 ఎకరాలకు, వాంకిడి మండలం కేరీత్ గ్రామంలో 1001 ఎకరాలకు, ఇచ్చోడ మండలం కోకసమన్నూర్ గ్రామంలో 150 ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు గాను గ్రామానికో కొత్త చెరువును మంజూరు చేసింది. సాగు నీట శాఖ మంత్రి హరీశ్ రావు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి గిరిజన గ్రామాల ప్రజలు తమ గ్రామ పరిధిలోని ఆయకట్టును నీరు ఇవ్వాలని కోరారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి ఒక్కడ చెరువుల ద్వారానే నీరు ఇవ్వడం సాధ్యమని గ్రహించి ఈ మేరకు సాగు నీటి శాఖ ఇంజనీర్లకు ప్రజల డిమాండ్‌ను పరిష్కరించాలని ఆదేశించారు. అయితే మిషన్ కాకతీయ కింద పాత చెరువుల పునరుద్దరణ తప్ప కొత్త చెరువులు నిర్మించడం సాద్యం కాదని, ఇందుకు నిబంధనలు అనుమతించవని ఇంజనీర్లు మంత్రి హరీశ్ రావుకు తెలిపారు. దీంతో ప్రజల వినతిని మిషన్ కాకతీయ నిబంధనల వల్ల ఇబ్బందిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాల ప్రజల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త చెరువుల ఏర్పాటుకు నిబంధనలు సడలించారు. గత ఫిబ్రవరి నెల 27వ తేద ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన సందర్భంగా సీఎం అక్కడి ప్రజలకు కొత్త చెరువులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇంతకు మునుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువుల నిర్మాణానికి స్టేజ్1 అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జివో నెంబర్ 930, తేది 30.11.2017 ద్వారా రూ. 92 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ జీవోలో ఆదిలాబాద్ నియోజక వర్గంలో 5, బోథ్ నియోజకవర్గంలో 10, ఖానాపూర్ నియోజకవర్గంలో 6, ఆసిఫాబాద్ నియోజక వర్గంలో 6 చెరువులు ఉన్నాయి. ఇక మండలాల వారీగా చూసినప్పు డు బేల, తాంసీ, బోథ్, ఖానాపూర్, వాంకిడి, ఆదిలాబాద్, నేరెడిగోండ, తలమడుగు, జైనూర్, ఆసిపాబాద్ మండలాల్లో ఒకటి చొప్పున, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండాలల్లో 3, కడం, కెరమెరి మండలాల్లో 2 చొప్పన కొత్త చెరువులను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ 26 చెరువులకు సంబంధించి భూసేకరణ తదితర చట్టపరమైన పనులు జరుగుతున్నాయి. ఈ 26 చెరువులతో పాటు ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కోమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో 18 కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ 18 కొత్త చెరువులకు స్టేజ్1 అనుమతుల్లో బాగంగా భూసేకరణ, ఆర్‌అండ్‌ర్ పనులు వేగంగా చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగు నీటి శాఖ ఇంజీర్లును ఆదేశించారు.