ఉపాధి హామీ పనులో భారి అక్రమాలు

Misuse of crores of funds

మంత్రి ఆదేశంతో కొనసాగుతున్న సామాజిక తనిఖీలు                                                                                              నోటీసులు అందజేసినా పట్టించుకోని అక్రమార్కులు                                                                                                  నామమాత్రంగా అధికారుల సామాజిక తనిఖీలు                                                                                                        అక్రమాలు వెలుగు చూసినా కానరాని చర్యలు                                                                                                        కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం                                                                                                              రికవరీలు పట్టించుకోని అధికార యంత్రాంగం 

మన తెలంగాణ/మంచిర్యాల : గ్రామీణ ప్రాంతాలలో పేదలకు వంద రోజుల ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్వయంగా ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని వెంటనే విచారణ జరిపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చి సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సామాజిక తనిఖీల్లో జరిగిన విచారణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు వెలుగు చూసినప్పటికీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి, అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా సామాజిక తనిఖీల్లో వెల్లడైనప్పటికి కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిధుల రికవరీ విషయంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లాలోని 14 మండల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా ఇప్పటి వరకు ఆరు మండలాల్లో సామాజిక తనిఖీలను నిర్వహించగా మరో 8 మండలాల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన 101 మంది సిబ్బందికి నోటీసులు అందజేయగా ఇందులో 10 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. జిల్లాలో జరిగిన పనులను టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఏపిఓలు క్షేత్రస్థాయిలో సక్రమంగా పరిశీలించడం లేకపోగా మరోవైపు అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. సామాజిక తనిఖీల సమయంలో ఆర్బాటం చేస్తున్న అధికారులు ఆ తరువాత అక్రమార్కులపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో గత మే నెలలో10వ విడత తనిఖీలు జరగగా 3426 ఆర్థిక అభ్యంతరాలను లేవనెత్తగా వాటి విలువ రూ. 5 లక్షలు ఉంటుంది. లక్షెట్టిపేట మండలంలోని గంపలపల్లి నుంచి మోదెల వరకు నిర్మించిన కడెం డిస్ట్రిబ్యూటరీ కాలువ మరమ్మతులు చేయకుండానే ఈజిఎస్ లో చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేసినట్లు 9వ విడతలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిన అధికారులు కేవలం సిబ్బందికి నోటీసులు మాత్రమే జారీ చేశారు. జన్నారం మండలం బాధంపల్లిలో కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో క్షేత్ర సహాయకుడు పలు అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలించిన అధికారులు అతనికి రూ. 2 వేలు జరిమానా విధించి వెంటనే విధుల నుంచి తొలగించారు. కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేసుకున్న లబ్ధిదారులకు డబ్బులు చెల్లించే విషయంలో వారిని నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు రాగా క్షేత్రసాయకున్ని విధుల నుంచి తొలగించారు. అదే విధంగా జనగామ గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులు సక్రమంగా నిర్వహించకుండా కూలీలకు అడ్డు రావడంతో మస్టర్లు వేయడంలో కూలీలకు అన్యాయం జరగగా కూలీ డబ్బులు చెల్లించే విషయంలో అక్రమాలకు పాల్పడిన క్షేత్రసాయకుడిని సస్పెండ్ చేశారు. జిల్లాలోని వేమనపల్లి, బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేట, తాండూర్ మండలాల్లో జరిగిన ఉపాధి పనుల్లో పలు అక్రమాలు వెలుగు చూసినప్పటికీ అధికారులు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూలీల ఖాతాలో డబ్బుల వివరాలు తెలియజేయకుండా క్షేత్ర సహాయకులు డబ్బులను సొంత అవసరాలకు వాడుకున్నారనే సంఘటనలు పలు చోట్ల వెలుగులోకి వచ్చాయి. కొందరు పనులు చేయకుండానే అనుకూలంగా ఉండే కూలీలకు మస్టర్లు వేసి, వారి పేరిట వచ్చిన డబ్బులను అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఉపాధి హామీ పనుల్లో జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయినప్పటికీ రికవరీ చేసే విషయంలో అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెట్టి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మంత్రి ఆదేశాలతో సామాజిక తనిఖీలను వేగవంతం చేసి, నిధులను రికవరీ చేయాలని కూలీలు కోరుతున్నారు.

Comments

comments