ఉత్తమ మైనింగ్ అధికారిగా ఇల్లందు జిఎం

GM Illandu is the best mining officer

ఇల్లందు : ప్రతి సంవత్సరం మైనింగ్ విభాగంలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీమతి గుళ్ళపల్లి సరళాదేవి మెమోరియల్ అవార్డును బహుకరించడం జరుగుతుంది. అందులో భాగంగా 2017 సంవత్సరానికి గాను ఉత్తమ మైనింగ్ అధికారిగా ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మినారాయణను వివిధ మైనింగ్ రంగాలలో విశిష్ట సేవలు అందించినందుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం రాజస్ధాన్ రాష్ట్రంలోని జైపూర్ పట్టణంలోని సంక్షేమ కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో జిఎం లక్ష్మినారాయణకు శ్రీమతి గుళ్ళపల్లి సరళాదేవి మెమోరియల్ బంగారు పధకంతో పాటు జ్ఞాపిక, ప్రశంస పత్రం బహుకరించారు. అవార్డు గ్రహిత జిఎం లక్ష్మినారాయణ 1984 సంవత్సరంలో ఉస్మానియా యునివర్సిటిలో ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకోని సింగరేణిలో ప్రస్థానం ప్రారంభించారు. గత 35 సంవత్సరాల నుండి మైనింగ్ విభాగంలో వివిధ స్ధాయిల మైనింగ్ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తూ నలుగురు సిఎమ్‌డిలతో ఆరుగురు డైరెక్టర్‌లతో ఎనిమిది మంది జనరల్ మేనేజర్‌లతో ప్రశంస పత్రాలు అందుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశ స్థాయిలో వరుసగా రాష్ట్ర గౌరవ అవార్డు 2015ను, అభహిరాజ్ దత్త మెమోరియల్ అవార్డు 2016ను, బెస్ట్ ఇంజనీర్ 2017ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వార వీరిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఏకే కొఠారి, వయోజన విద్యాశాఖ మాత్యులు ఆర్‌కే సిన్హా, కంట్రోలర్ జనరల్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆర్‌కే శర్మ, చైర్మన్ జైపూర్ చాప్టర్ ఎస్‌కే వాధవన్ తదితరులు పాల్గొన్నారు.