ఇస్తారిఆకులు, చెయ్యిసంచుల వాడకం మంచిగుండె!

Meals-Plates

ప్లాస్టిక్ అనే దరిద్రపు కాయిదాలు లేనప్పుడు ఊరంత పచ్చ పచ్చగ ఉండేది. ఊరే కాదు ఇండ్లు పట్టణాలు అన్నీ ప్లాస్టిక్ రహితంగా ఉండేటివి. ఇది వరకు ఎవరింట్లనైనా పెండ్లో, ఇరవైఒక్కదినమో, యాడాది మాసికమో జరిగితే బంతులల్ల కూసుండపెట్టి ఇస్తార్లల్ల అన్నం పెట్టేది. ఇస్తార్లు మోతుకు ఆకులతో చేస్తారు. మోతుకు చెట్ల నుంచి లేతగా ఉన్నప్పుడే ఆకులు తెంపుక వచ్చి కుచ్చి దండగ ఇంటి గోడకు ఏసుకుంటరు. ఎండకాలంలో పనులు ఏం లేనప్పుడు ఆ ఆకుల కట్టను తెచ్చి దాని మీద నీళ్ళు పోసి ఒక ఆకు చుట్టు తిరిగి ఆకులు పేర్చి సొప్ప బెండ పుల్లతో కుట్టుతరు. దాన్ని ఇస్తారి అంటరు. కొందరు శానిగ మాట్లాడేటోల్లు విస్తారి అని పిలుస్తరు.

చాలా కావాలంటే ఎండు ఇస్తారి, పచ్చి ఇస్తార్ల అన్నం తింటే ఇంక మంచిగ ఉంటది. అప్పుడే తెంపుకచ్చిన పచ్చని ఆకులు కుట్టి అన్నం తింటారు. లేదా ఎటైన పొరుగూరికి పోయేవాల్లకు సద్ది కట్టి పంపుడు కూడా ఇస్తార్లనే. మోతుకు ఆకులతోనే కాదు మర్రి ఆకులతో కూడా ఇస్తారి కుట్టుతరు. కేదారేశ్వర నోములకు దేవుని దగ్గర మర్రి ఆకుల ఇస్తారి కుట్టుకుంటరు. మోతుకు ఆకులు అద్భుతంగా ఈ రోజుల్లో ప్రకృతిపరంగ తినేందుకు వాడుకుంటే ఈ రోజుల్ల ప్లాస్టిక్ ప్లేట్స్ వచ్చి పర్యావరణం నాశనం చేస్తున్నాయి. పేపర్‌తో తయారైన షీట్ మీద ప్లాస్టిక్ పొరతో పచ్చని రంగుతో ఆకులను మైమరపించేట్లుగ ప్లేట్లు చేసి అమ్ముతున్నారు. వేడి వేడి అన్నం కూర ఆ ప్లాస్టిక్ పొర మీద పడి సన్నగ ఉండటం వల్ల కరిగి కడపులకు పోవుడు. దాంతో రానూ రానూ జీర్ణకోశ వ్యాదులు రావడం గ్యాస్టోఎంట్రాలిజిస్ట్‌లకు పెద్ద గిరాకీ అయితంది.

మటన్ శాప్‌లకు ఇది వరకు ఊర్లల్లకు పొతె స్టీల్ డబ్బగిన్నెపట్టుక పోయి మాసాహారం తెచ్చుకొని వండుకునేది. స్టీలు డబ్బలు లేని వాల్లు రాతెండి గిన్నెలల్ల తెచ్చుకునేది. ఇప్పుడు ప్లాస్టిక్ సంచిల ఇస్తున్నరు. ఆ ప్లాస్టిక్ సంచి తెచ్చి ఇండ్ల పడేస్తే అది గాలికి కొట్టుక పోయి మోరీలల్ల కలుస్తది. ఇట్ల ఎన్నో ప్లాస్టిక్ సంచులు కలవడం వల్ల నీళ్లు ఆగిపోయి మురుగు తయారు అవుతంది. లేదా ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన అన్నం కూరలను ఇలా కిరాణంల నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచిల వేసి బయట విసిరివేస్తే అందులో ఉన్న అన్నం తినేందుకు, ఎడ్లు ఆవులు ఇతర జంతువులు ఆ ప్లాస్టిక్ కూడా వాటి కడుపులకు పోయి వాటికీ నష్టం కల్గుతంది.

అట్లాకే ఏదైనా కిరణ దుకాణంకు పోయే వాల్లకు ఇంటి నుండి సంచి తీసుకొని పోయే అలవాటు ఇదివరకు ఉంటుండేది. చేతి సంచి కుట్టిచ్చుకొని ఇంట్ల శిలకొయ్యకు వేసి ఉంచుకునేది. ఎవరైనా బయటకు పోయినప్పుడు తప్పనిసరిగా చెయ్యి సంచి తీసికొని ఇంట్లకు అవసరమైన వెచ్చాలు సామానులు తెచ్చుకునేది ఇప్పుడు బండి మీద రయ్యిమని పోవుడు దుకాండ్లడ్ల సామాను ప్లాస్టిక్ సంచులల్ల తెచ్చుకునుడు వల్ల పర్యావరణం పాడైపొతంది. అరటిపండ్లను ఇది వరకు పేపర్లల్ల కట్టి రీల్ దారంతో కట్టి ఇచ్చేవాల్లు . అరటి పండ్లే కాదు ఏ పండ్ల దుకాండ్లకు పోయినా పేపర్లల్ల ప్యాక్ చేసి దారంసుట్టి ఇస్తుండేది. ఇప్పుడు ఎవల దగ్గరికి పోయినగని ప్లాస్టిక్ కాయిదం ఇస్తున్నరు. వాల్లకు అది అల్కగ అయ్యిండవచ్చుగాని ఒక ప్లాస్టిక్ కాయిదం భూమిల కరగడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది.

నడీ ఊర్లల ఉన్న కిరాణం దుకాణంల ఎంత సామాను తీసికున్న చెయ్యి సంచి తెచ్చుకునేది. చిన్న చిన్న జిలకర, లవంగాలు కావాలంటే పేపర్ కాయిదంల కట్టి దారం సుట్టి వాటిని సంచిల ఏస్తుంటరి. ప్లాస్టిక్ వాడకం అనేది లేకుంటేనే ఉన్నది. అసోంటిది ఊర్లెకు కూడా ప్లాస్టిక్ వచ్చి మొత్తం వ్యవస్థకే ముప్పు తెస్తున్నది. పెండ్లిల్ల ఇది వరకు స్టీలు గ్లాసులు లేదా ఇత్తడి గిలాసలల్ల నీళ్ళు జగ్గుతో పోసేవాల్లు. ఇయ్యాల రేపు ప్లాస్టిక్ గిలాసల నీళ్ళు ఇస్తండ్రు. తిరిగి ఆ గ్లాసు వాడరు. దాన్ని ఒక్కరికే వాడి పారవేసి మల్ల కొత్తది తెస్తున్నారు. దీని వల్ల ప్లాస్టిక్ వ్యర్థం ఇబ్బడిముబ్బడిగ పెరిగి పోతంది.

గతంతో పొల్చితే పర్యావరణ అనుకుల జీవన విధానం నుంచి మనిషి దుర్మార్గ ప్లాస్టిక్ వైపు ప్రయాణం అవుతున్నాడు. ఇప్పుడు హోటలల్ల ఇడ్లి తెచ్చుకుంటే వేడి వేడి సాంబర్‌ను ప్లాస్టిక్ కాయితంల పోస్తున్నరు. బిర్యాని ప్యాక్ తెచ్చుకుంటే వేడివేడిది ప్లాస్టిక్‌లో కలిపి ఇస్తున్నారు. దాన్ని ఇస్తున్నడు మనం తింటున్నం. ఆరోగ్యం సంగతి తర్వాత తెలుస్తది. ఇప్పటికైనా మోతుకాకుల ఇస్తార్లు చెయ్యి సంచులు వాడాల్సిన అవసరం ఉన్నది.

అన్నవరం దేవేందర్ 94407 63479