ఇసుక అక్రమ రవాణా..

వెల్దుర్తిః మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో గల హల్దీ పరివాహక ప్రాంతం నుండి గత కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగేది. డబుల్ బెడ్ రూం నిర్మాణాల పేరిట గుత్తేదార్లు అనుమతులు తీసుకుంటే గతంలో ఇసుక రవాణాలో ఆరి తేరిన తూప్రాన్ మండలంలోని కొందరు అక్రమార్కులు రంగ ప్రవేశం చేసి తాము ఇసుకను రవాణా చేస్తామంటూ పక్కదారి పట్టించేవారు. వీరికి ఇటీవల బదిలీపై వెళ్ళిన తహసీల్దార్ అండదండలు పుష్కలంగా ఉండేవని పలు […]


వెల్దుర్తిః మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో గల హల్దీ పరివాహక ప్రాంతం నుండి గత కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగేది. డబుల్ బెడ్ రూం నిర్మాణాల పేరిట గుత్తేదార్లు అనుమతులు తీసుకుంటే గతంలో ఇసుక రవాణాలో ఆరి తేరిన తూప్రాన్ మండలంలోని కొందరు అక్రమార్కులు రంగ ప్రవేశం చేసి తాము ఇసుకను రవాణా చేస్తామంటూ పక్కదారి పట్టించేవారు. వీరికి ఇటీవల బదిలీపై వెళ్ళిన తహసీల్దార్ అండదండలు పుష్కలంగా ఉండేవని పలు గ్రామాల ప్రజలు బహిరంగంగానే చర్చించుకునేవారు. రెవిన్యూ కార్యాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తిష్టవేసి అక్రమంగా అనుమతులు తీసుకుంటూ యదేశ్చగా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు దర్జాగా డబ్బులు దండుకున్నారు. అయితే చిన్న చిన్న అవసరాల కోసం కార్యాలయానికి వచ్చే సామాన్య మధ్య తరగతి ప్రజలకు మాత్రం ట్రాక్టర్ ఇసుకను తెచ్చుకోవడానికి రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. అయినా సదరు అధికారి మాత్రం నిబంధనల పేరిట నిరుపేదలకు అనుమతులు ఇవ్వలేదు కాని ఇసుక మాఫియా నేతలకు మాత్రం క్షణాల్లోనే అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన పలు గ్రామాల ప్రజలు అక్రమంగా తరలుతున్న ఇసుక టిప్పర్‌లను పట్టుకొని అధికారులకు అప్పగించేవారు. అయినా ఫలితం లేకపోగా అక్రమ రవాణా మరింత పెరిగింది. దీంతో గ్రామస్తుల ఆంధోళనకు కాంగ్రెస్ నాయకులు తోడై ఎలాంటి అనుమతులు, వేబిల్లులు లేకుండా తరలుతున్న టిప్పర్‌లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా హల్దీ బచావో పేరిట ఇటీవల డిసిసి అధ్యక్షురాలు సునితారెడ్డి సైతం మండలంలోని మెల్లూర్ నుండి ఉప్పులింగాపూర్ వరకు సుమారు 8 కి.మి.ల మేర పాదయాత్ర చేపట్టారు.

ఇతర జిల్లాలకు ఇక్కడినుండి ఇసుకను తరలించొద్దంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం కలెక్టర్‌తో పాటు స్తానిక రెవిన్యూ కార్యాలయం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నారు. దీనిపై నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం పలుమార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. తహసీల్దార్ తీసుకుంటున్న అనాలోచిత చర్యల వల్ల నియోజకవర్గంలో పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని, దీనిని అరికట్టాలంటూ సూచించారు. అయినా సదరు అధికారి మాత్రం ఇవేమి పట్టించుకోకుండా యదేశ్చగా అనుమతులు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే మండలంలోని శెట్టిపల్లి, కొల్చారం మండలంలోని కొంగోడ్‌ల శివారు నుండి డబుల్ బెడ్ రూంల పేరిట అనుమతులు తీసుకొని ఇసుకను తరలిస్తుండగా పలు గ్రామాల ప్రజలు అడ్డుకొని టిప్పర్ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో శెట్టిపల్లి గ్రామానికి చెందిన 11 మందిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆగ్రహంతో మండిపడుతూ తహసీల్దార్ రాజెశ్వర్‌రావ్‌ను ఇక్కడి నుండి వెంటనే అల్లాదుర్గంకు బదిలీ చేయించినట్లు ప్రజలు చర్చింటుకుంటున్నారు. స్తానిక అవసరాలకు అనుమతులు ఇవ్వకుండా అక్రమార్కులకు కొమ్ముకాయడం వల్లే అతనిపై వేటు పడిందని చర్చించుకుంటున్నారు. అయితే మూడు రోజుల క్రితం కొల్చారం డిప్యూటి తహసీల్దార్‌గా పనిచేస్తున్న రవికుమార్‌కు వెల్దుర్తి తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. నూతన తహసీల్దార్ ఆధ్వర్యంలో నైనా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా డబుల్ బెడ్ రూం నిర్మాణాల పేరిట ఇసుక పక్కదారి పట్టకుండా ప్రస్తుత తహసీల్దార్ రవికుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Related Stories: