ఇవేమి సంరక్షణాలయాలు?

Child Abuse Child Violence in India

అసమానతలతో కూడిన, పితృస్వామ్య భావజాలం నరనరాన జీర్ణించుకుపోయిన సమాజంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వ్యత్యాసాలవల్ల మహిళలు, బాలలకు కొల్లగొట్టే, పీక్కుతినే మనస్తత్వం ఉన్న వారి నుంచి రక్షణ అవసర మవుతుంది. కానీ సంక్షేమ రాజ్యం, పౌర సమాజం ఇలా దాడులకు లోనయ్యే వారికి రక్షణ కల్పించలేకపోతోంది. రక్షించ వలసిన సంస్థలలోనే మహిళలు, బాలలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల శిశు సంరక్షణాల యాల్లోనూ ఇతర ఆశ్రయం కల్పించే కేంద్రాలలోనూ భౌతిక దాడులతో పాటు లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి. రాజ్య వ్యవస్థ కానీ, పౌర సమాజం కానీ వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయి. రక్షించవలసిన బాధ్య త ఉన్నవారే పదే పదే అఘాయిత్యాలకు పాల్పడడం సర్వసాధారణమైపోయింది. 2015 నాటి బాలలకు న్యాయం చేకూర్చే చట్టం అమలులోకి వచ్చినా ఈ అఘాయి త్యాలు ఆగడం లేదు. దీనితో పాటు జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్.సి.పి.సి.ఆర్.) ఉన్నా ప్రయోజనం ఉండడం లేదు.
బిహార్ లోని ముజఫ్ఫర్ పూర్ లోని శిశు సంరక్షణాలయంలో బాలల మీద అత్యాచారాలు జరిగినట్టు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2017లో రూపొందించిన సామజిక ఆడిట్ లో తేలింది. ఆ శిశు సం రక్షణాలయంలో మొత్తం 42 మంది బాలికలు ఉంటే ఏడు నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న 34 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగాయి. భౌతిక దాడులూ జరిగాయి. బిహార్ లోని మరో 14 శిశు సంరక్షణాల యాల్లో భౌతిక, లైంగిక, మానసిక దాడులు జరిగి నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సంరక్షణాలయాల్లో జీవన పరిస్థితు లు దారుణంగా ఉన్నాయి. మౌలికమైన స్వేచ్ఛ కూడా లేదు. విచిత్రం ఏమిటంటే ముజఫ్ఫర్ పూర్ లో అఘాయిత్యాలకు పాల్పడిన వారు ‘సం రక్షకులు‘, ‘సలహాలు‘ ఇచ్చే బాధ్యత ఉన్నవారే. ఇది మరింత తీవ్రంగా కలచి వేసే విషయం.
ఉత్తరప్రదేశ్ లోని దెవోరియాలోని ఓ శిశు సంరక్షణాలయం నుంచి పదేళ్ల బాలిక తప్పించుకుని పారిపోయి రావడంవల్ల అక్కడా ఇలాంటి దుర్భర పరిస్థితే ఉన్నట్టు తేలింది. ఆ సంరక్షణాలయంలో పిల్లలను హింసిస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సంరక్షణాలయం నుంచి తప్పించుకున్న 18 మంది అమ్మాయిల ఆచూకీ ఇప్పటివరకు తెలియనే లేదు. ఈ సంరక్షణాలయం ప్రభుత్వం దగ్గర నమోదైంది కాదట. ఇలా అఘాయిత్యాలకు గురయ్యే వారిని ఆదుకోవడానికి చట్టాలు లేక కాదు. పర్యవేక్షణ, తనిఖీ చేసే ఏర్పాట్లు లేకపోవడంవల్లే ఈ దుస్థితి కొనసాగుతోంది. అన్ని శిశు సంరక్షణాలయాలను బాలల న్యాయ చట్టం కింద రిజిస్టర్ చేయవలసి ఉంది.
ప్రతి జిల్లాలోనూ ఒక బాలల సంరక్షణాధికారి ఉండాలి. బాలల సంక్షేమ కమిటీ, బాలలకు న్యాయం చేకూర్చే బోర్డు ఉండాలి. కాని వీటి పని తీరు అఘాయిత్యాలను ఆపడానికి అనువుగా లేదు. ఈ సంస్థల నిర్వాహకులు అధికారాలను, డబ్బును విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు. బాలల న్యాయ చట్టం కింద నమోదైన శిశు సం రక్షణాలయాల్లో 32 శాతం మాత్రమే ప్రభుత్వం దగ్గర నమోదై ఉన్నాయని జాతీయ బాలల హక్కుల కమిషన్ పరిశీలనలో తేలింది. మరో 33 శాతం సంరక్షణాలయాలు ఎక్కడా నమోదు కాలేదు. సమీకృత శిశు సంరక్షణ పథకం కింద ఇలాంటి సంస్థలకు నిధులు సమకూర్చే మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇలాంటి సంస్థలపై సామాజిక తనిఖీ నిర్వహించి తీరాలి. అప్పుడే అవకతవకలు జరగకుండా నివారించగలం. కానీ ఆ తనిఖీ లేనే లేదు. చాలా సంస్థలు ఎలాంటి తనిఖీలు లేకుండానే కొనసాగుతుంటాయి. ముజఫ్ఫర్‌పూర్‌లో అఘాయిత్యం జరిగిన శిశుసం రక్షణాల యంపై అనేక వ్యవస్థలు తనిఖీ నిర్వహించినప్పటికీ ఎలాంటి అవకతవకలు, అక్రమాలు కనిపించకపోవడం మరో వైపరీత్యం. అక్కడ బాహాటంగా దుర్వినియోగం, అఘాయిత్యాలు జరుగు తున్నా తనిఖీ చేసిన సంస్థలకు ఏ అక్రమమూ కనిపించలేదు.
ముజఫ్ఫర్ పూర్ శిశు సంరక్షణాలయం కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ కేంద్రాలలో బాలల సంక్షేమంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని శిశు సంరక్షణాలయాల్లో అత్యాచారాలకు గురై బతుకుతున్న వారు 1,575 మంది ఉన్నారని బాలల హక్కుల కమిషన్ సర్వేలో తేలింది. ఈ కేంద్రాలలోని పిల్లలు ఒక వేళ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అత్యాచారానికి గురైనవారే. అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షించడం అవసరమే. కాని ప్రభుత్వం శిక్షించడంతోనే సంతృప్తి పడుతుంది. ఈ బాలల బాధలు బాపడానికి ఏమీ చెయ్యదు. తనిఖీల ఊసే ఉండదు. ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగాయన్న విషయం బయట పడితే ఆ గొడవ సద్దు మణిగిన తర్వాత పట్టించుకునే వారే ఉండరు.
దౌర్జన్యానికి, అఘాయిత్యాలకు గురైన బాలలకు, అనాథ స్త్రీలకు తమ సంక్షేమం గురించి మాట్లాడే అవకాశమే ఉండదు. తమపై పెత్తనం చేసే వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతు కీడ్వాల్సిందే. అలా పెత్తనం చేసే వారు ఆ కేంద్రాల నిర్వాహకులో, రాజకీయవాదులో, అధికారులో, సమాజంలోని ఇతరులో కావచ్చు. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలి అంటే పితృ స్వామ్య ఆలోచనా ధోరణి మారాలి. తోటి మనిషిని చులకన చేసి, అవమానించే వైఖరి మారాలి. అన్నింటికన్నా మించి ఈ కేంద్రాల లోని బాలలకు సంపూర్ణ హక్కులు కల్పించి, వారిని పౌరులుగా గుర్తించి తమకు సంబంధించిన అంశాలలో వారి పాత్ర ఉండేట్టు సాధికారికత కలిగించాలి. ఈ శిశు సంరక్షణా కేంద్రాలలో, ఆశ్రయం కల్పించే సంస్థల లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారిని రక్షించవలసిన బాధ్యత ఉన్న వారినుంచే వారిని కాపాడవలసి ఉంది. సంరక్షకుల ముసుగులో ఈ కేంద్రాలను నిర్వహించే నేరస్థులను ఏరి వేయాలి, కఠినంగా శిక్షించాలి, తరచుగా తనిఖీలు నిర్వహించాలి. అప్పుడే ఆ కేంద్రాలలోని వారి మానవ హక్కులను కాపాడగలం. తమకూ విలువ ఉందని భావించేట్టు చేయగలం.