ఇద్దరూ ఇద్దరే!

SPs intelligence on police stations

అక్రమార్కుల తాట తీస్తున్న ఎస్‌పిలు
బెల్టు రుచి చూపిస్తున్న పోలీస్ బాస్‌లు
అక్రమాలపై రహస్య నిఘా
సొంత శాఖపైనే మూడో కన్ను
తప్పుచేస్తే సొంత శాఖ వారిని వదలని వైనం
పోలీస్ స్టేషన్లపై నిఘా పెట్టిన ఎస్‌పిలు
ఫ్రెండ్లీ పోలీస్ అమల్లో రాజీ లేని వైనం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమే పోలీస్.. కంటికి కనిపించని నాలుగో సింహ మే పోలీస్.. కాని నిజమైన పోలీస్ శాఖ అంటే ఏమిటో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌పిలు డాక్టర్ అనురాధ, రెమా రాజేశ్వరీలు అక్రమార్కులకు రుచి చూపిస్తున్నారు. చీకటి దందాలకు చెక్ పెట్టడమే కాకుండా, సొంత శాఖలోని చీడ పురుగులను కూడా ఏరి పారేస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లపై పలు అవినీతి ఆరోపణలు ఉం డేవి. ప్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలతో పోలీసులు ఎలా మమే మైకం కావాలో నేర్పింది. అయితే కొందరు పోలీసు అధికారులకు ఇది నచ్చలేదు. ఈ నేపథ్యంలో ప్రతి కేసుకు ఒక ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడ్డారు. అక్కమ ఇసుక రవాణా మొదలు, మట్కా, గుట్కా రవాణాతో పాటు మద్యం షాపుల నుంచి, డాబాలు వగైరా అనేక చీకటి దందాల వెనుక కొందరు పోలీసు అధికారులకు కాసులు వచ్చి పడేవి. కాసులకు కక్కుర్తి పడిన కొందరు ఖాఖీలు పోలీస్ శాఖకే చెడ్డపేరు తీసుకొచ్చారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో అనేక పోలీసు స్టేషన్లను నెల మామూళ్లు ఠంచన్‌గా అందేవి. ఆయా పోలీస్ స్టేషన్లను డబ్బలు కుమ్మరించి మరీ అక్కడికి బదిలీ చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. కొందరు పోలీస్ బాస్‌లు అక్రమ ఇసుకలో లక్షలు వెనుకేసుకున్నారు. అలంపూర్ మొదలుకొని షాద్‌నగర్ వరకు ఉన్న 44వ నంబర్ జాతీ య రహదారి వెంబడి ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లను అక్రమ ఇసుక దందా రాయళ్లు నెల మామూళ్లు కుమ్మరించే వారు. ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక రవాణా జిల్లాలో పెద్ద ఎత్తున సాగింది. అక్రమ ఇసుక ముఠా కొన్ని సార్లు అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై కూడా దాడులు చేసిన సంఘటనలు అనేకం జిల్లాలో జరిగాయి. కొందరిని హత్యలు చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

తాట తీస్తున్న ఎస్‌పిలు
తెలంగాణ రాష్ట్రం అనంతరం కొత్త జిల్లాల్లో ఎస్‌పిలుగా బాధ్యతలు తీసుకున్న ఎస్‌పిలు ముఖ్యంగా మహబూబ్‌నగర్ ఎస్‌పి అనురాధ, గద్వాల ఎస్‌పి రెమ రాజేశ్వరి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అవినీతి పరులకు పోలీస్ బెల్టు రుచి చూపిస్తున్నారు.అవినీతి, అక్రమాలు జరిగినా వెంటనే స్పందించి ప్రజలకు న్యాయం చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదులలో వచ్చిన ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు తీసుకునేలా కింది స్థాయి పోలీస్ అధికారులకు ఆదేశిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎలాం టి రాజీ లేదని తెగేసి చెబుతున్నారు. తప్పు చేసిన వారు ఎంతటి పెద్ద వారైనా వారు ఉపేక్షించడం లేదు. చట్టం ముందు అందరూ సమానమేనని రుజువు చేస్తున్నారు.చివరికి సొంత శాఖలోని తప్పులు చేసినా వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ ఎస్‌పి అనురాధ సొంత శాఖలో అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే రహస్యంగా ఒక టీంను తయారు చేసి అక్రమాలపై నిఘా ఉంచారు. ఇందులో మెరికల్లాంటి యువత పోలీసులను నియమించి నిఘా పెట్టించింది. అందులో బాగంగానే ఇటీవల అక్రమ ఇస్తుక రవాణాపై నిఘా ఉంచింది. ఎక్కడ కూడా అక్రమ ఇసుక రవా ణా జరిగినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దెబ్బకు అక్రమ ఇసుక రవాణా ఆగిపోయింది. ప్రభుత్వ అనుమతి ప్రకారం చట్ట పరిధిలోనే ఇసుకను తరలించుకునేలా ఎస్‌పి అనురాధ చర్యలు తీసుకుంది. రాత్రి సమయాల్లో కార్బన్ సర్చ్‌లు నిర్వహించి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత దొంగతనాలు కూడా తగ్గిపోయాయి. అంతేకాకుండా అక్రమ బియ్యం రవాణాపై నిఘా ఉంచిన ఎస్‌పి కొన్ని వందల క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. కొందరు రైస్ మిల్ యజమానులు పేదల రేషన్ బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ గోదాముల వారితో రహస్యంగా మాట్లాడుకొని డీలర్లతో కుమ్మక్కై బియ్యంను రీ సైక్లింగ్‌కు తరలించుకునే వారు. ప్రతి నెల వందల క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టేవి. అయితే అక్రమ రవాణపై రహస్యంగా నిఘా వేయించి దాడులు జరిపించింది. గత నాలుగు రోజుల క్రితం హన్వాడ, భూత్‌పూర్ మండలాల్లో రైస్ మిల్లలులపై దాడులు చేసి పేదల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. జిలా కేంద్రంలో వేళ్లూనుకున్న మట్కాను బంద్ చేయించింది. అలాగే గుట్కా దందాకు చెక్ పెట్టించింది. షీటీంల ద్వారా మహిళలకు, విద్యార్థిణీలకు రక్ష ణ కల్పించడంలో ఎస్‌పి సఫలీ కృతులయ్యారు. అక్రమ ఇసుక రవాణలో మా మూళ్లు తీసుకుంటున్న జడ్చర్ల ఎస్‌ఐ వెంకటనారాయణను,పేకాట ఆడుతున్న రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అబ్దుల్ జావెద్‌ను సస్పెండ్ చేసింది. ఇక గద్వాల జిల్లా ఎస్‌పి రెమో రాజేశ్వరి కూడా తనదైన శైలిలో ప్రెండ్లీ పోలీ స్ విధానాన్ని అమలు చేస్తున్నారు.ఫ్యాక్షన్ ఆనవాళ్లు ఉన్న అలంపూర్, గద్వా ల నియోజకవర్గాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ ఇసుకపై చెక్ పెట్టించింది. అక్రమక్యాట్ ఫిష్‌లు పెంపకం పై కూడా ఆమె చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల వనపర్తి ఎస్‌పిగా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న గద్వాల ఎస్‌పి రైస్ మిల్లలపై దాడులు చేసి వందల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.కొందరిని విద్యార్థీనీలను ఎంపికి చేసి వారిని గుర్‌గావ్‌లో పోలీస్ శిక్షణ ఎలా ఉంటుందో స్వయంగా చూసేందుకు పంపించారు.ఈ విషయంలో కేంద్ర హోంమంత్రితో చర్చించి గద్వాల విద్యార్థులను గుర్‌గావ్‌కు పంపించారు. సామాజిక సేవల్లో కూడా ఇద్దరు పోలీస్ బాస్‌లు చేస్తున్న పలు సేవలపై ప్రజలు ప్రశంశల జల్లులు కురిపిస్తున్నారు.