ఇందిరానగర్ వాసుల కష్టాలు ఇంతింత కాదయా

Yelkathurthy Villagers Facing Problems With Mud Road

మనతెలంగాణ/ ఎల్కతుర్తి : మనుషులకు కష్టాలు వస్తే దేవుళ్లకు చెప్పుకుంటారు. కానీ దేవుళ్లే కష్టాలు తెచ్చిపెడితే ఎవరికి చెప్పుకుంటారు. ఇదే పరిస్థితి ఇందిరానగర్ గ్రామస్తులది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్షం అది. కానీ పైపులు వేసే క్రమంలో కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షాకాలం కావడంతో గ్రామస్తుల కష్టాలు మరింత పెరిగి రోడ్లపై కనీసం కాలుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలుపెట్టే సందు లేదు : మండలంలోని ఇందిరాగర్ గ్రామంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. సిఎం కెసిఆర్ నూతనంగా రూపొందించిన గ్రామపంచాయతీ చట్టం ద్వారా కొత్త గ్రామ పంచాయతీగా ఈ గ్రామం ఎంపిక కాబడింది. అయితే సర్పంచ్ ఎన్నికలు జరుగకపోవడం, ఇంకా చింతలపల్లి అనుబంధ గ్రామంగానే ఉంది. కాగా ఈ గ్రామంలో మిషన్ భగీరథ పైపులను వేసేందుకు దారుల వెంట తవ్వకాలు చేపట్టారు. అందులో పైపులు వేసి వదిలేశారు. గుంతలను తీసిన మట్టితో పూడ్చకుండా నిర్లక్షం వహించడంతో దారులు ధ్వంసమయ్యాయి. ఇంతలో వర్షాలు రావడంతో పైపులైన్ల కోసం తీసిన కందకాల్లోని మట్టి బురద మయంగా రోడ్డంతా పరుచుకుంది. గ్రామంలోని అన్ని రోడ్ల పరిస్థితి ఇదే విధంగా తయారై అధ్వాన్నంగా మారిపోయాయి.
ప్రమాదాలు జరుగుతున్నాయి : మిషన్ భగీరథ పైపులు వేసేందుకు కాంట్రాక్టర్ తీసిన మట్టి ఓవైపు, వర్షాలు మరోవైపు నిప్పుకు గాలి తోడైనట్లు కావడంతో రోడ్డుపై పోసిన మట్టి మొత్తం రోడ్డు కనిపించకుండా బురుదతో నిండిపోయింది. ఇందులో నుంచి కాలుతీసి కాలువేసే పరిస్థితి కనిపించడం లేదు. చెప్పులు లేకుండా ఆచితూచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగులు వేస్తే తప్ప ఈ బురుద నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇక రాత్రిళ్లు ఇళ్లకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ద్విచక్ర వాహనాలు ఇందులో నుంచి వెళ్తే టైర్లలో బురుద ఇరుక్కుని జారి పడిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ గ్రామంలో సర్వసాధారణమైపోయాయి. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యార్థులు బూట్లు వేసుకుని భుజానికి బ్యాగులు తగిలించుకుని చేతిలో టిఫిన్లు పట్టుకుని ఇందులో నుంచి నడిచి వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు. తాము పాఠశాలలకు వెళ్లమని మారాం చేస్తున్నారు. తాము పాఠశాలకు ఎలా వెళ్లాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు :
గ్రామం మొత్తం బురుద మయంగా మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధు లు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ విషయాన్ని గ్రామస్తులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదం టూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కష్టాలు లేకుండా చేయాల్సిన వారే కష్టాలు సృష్టిస్తే తాము ఎవరితో చెప్పుకోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో తీసిన కందకాలను పూడ్చివేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
బురద లేకుండా చేయాలి
అంబాల రమేశ్, గ్రామస్తుడు.
రోడ్లు మొత్తం బురుదతో నిండినయి. బురుదలకెళ్లి పోవన్నంటు సెప్పులు సేత్లపట్టుకుని, పైంట్లు, చీరెలు మీదికి దోపుకుని సర్కసు పీట్లు చేసుడైతాంది. ఈ నాల్గు రోజుల సంది మా బాధలు మరింత ఎక్కువైనయ్. మా గోస ఎవ్వరూ పట్టించుకుంటలేరు. బురుద లేకుంట చేసి మా సమస్యలు తీర్చాలె.
ఎవ్వలు పట్టించుకుంటలేరు
కడారి రమేశ్, గ్రామస్తుడు.
మా ఊర్ల రోడ్లు అధ్వానమైనయ్. కాలుతీసి కాలు పెట్టే సందు లేకుంటాపోయింది. ఇంట్లకు పోదామన్నా, బైటికి పోదామన్నా కాలు బురుదల పెట్టక తప్పుతలేదు. సార్లు మా ఊరి దిక్కే సూత్తలేరు. ఇగ ఓట్టేయించుకున్నోళ్లు పత్తకే లేరు. మా గోస దేవునికి ముడుతాంది. జర మా బాధలు చూసి మా కష్టాలను తీర్చుండ్రి సార్లు.

Comments

comments