ఆ‘నీడ’ ఓ మాయ!

Mystery of Panagal Chaya Someswara Swamy Temple, Nalgonda

అద్భుతాలకు నిలయం ఛాయ సోమేశ్వరాలయం.. 

ఛాయా సోమేశ్వరాలయం.. ఇది ఒక చరిత్ర కలిగిన మిస్టరీ టెంపుల్. ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా.. అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనాని నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగొల్లులో ఉంది.

ఛాయా సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోడులు (నల్లగొండ/నీలగిరి చోళులు) పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్భుతం. సోమేశ్వరాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఈ ఆలయంలో గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం. చెరువు ఎండితే గర్భగుడిలో నీరు కూడా ఎండిపోతుంది.

సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను పాలించిన కుందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. . శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నల్లగొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు అనే గ్రామంలో క్రీ.శ. 11, 12 శతాబ్దకాలంలో కుందూరు చోడులు నిర్మించినట్లుగా ఆర్కియాలజీ, మ్యూజియం వారి వివరాలను బట్టి తెలుస్తుంది.

ప్రత్యేకతాలు…. ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం. దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్థానాన్ని మార్చుకోదు.

ఆలయ విశేషాలు…. ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్ శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది. మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప లతలు, పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా, ద్వారానికిరుపక్కలా విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనుపించి హృదయాన్ని కలవర పరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా, ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు.

ఛాయ మిస్టరీ…  ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం…

ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? అనే మిస్టరీ ఇప్పటికీ చాలా వరకు తెలియదు. ఆలయానికి రాళ్ళతో కూడిన పునాదిని ఎంచుకోవడం ద్వారా శిల్పి భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాస్తవానికి పూర్వం గ్రామాలలో, పట్టణాలలో వివిధ కార్యాలకు అంటే వివాహాలకు, కచేరి, పండుగలు, మతకృత్యాలు మొదలైన వాటికి ఆలయాలే కేంద్రంగా ఉండేవి. కాబట్టి రాజులు వాటికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి నిర్మించేవారు.

ఆత్మే పరమాత్మ … దేవుని నమ్మని వారు తమని తాము నమ్మలేరు. శాస్త్రీయ దృక్పథానికి ఆధ్యాత్మికతను అద్ది భారతీయ సంప్రదాయాలను, సంస్కృతులను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం మనందరిమీద ఉంది.