ఆస్ట్రేలియా-కివీస్ పోరు వర్షార్పణం

Rainబర్మింగ్‌హామ్: న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఎ మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయింది. భారీ వర్షం వల్ల మ్యాచ్‌ను రద్దు చేశారు. శుక్రవారం ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన మ్యాచ్‌ను ప్రారంభం నుంచే వర్షాం వెంటాడుతోంది. దీంతో మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కానె విలియమ్‌సన్ (100) అద్భుత సెంచరీతో కివీస్‌ను ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన విలియమ్‌సన్ 97 బంతుల్లోనే 8ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఓపెనర్ లుక్ రోంచి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. చెలరేగి ఆడిన రోంచి 43 బంతుల్లోనే 9ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు సాధించాడు. చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే ముగిసింది. హాజిల్‌వుడ్ అద్భుత బౌలింగ్‌తో కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. హాజిల్ 52 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. కాగా, న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మళ్లీ వర్షం మొదలైంది. దీంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 235 పరుగులకు కుదించారు. అయితే ఆస్ట్రేలియా స్కోరు 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు మళ్లీ భారీ వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. మ్యాచ్ జరిగి ఉంటే న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవి.