ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు ఆత్మహత్య..

Faced with financial difficulties, killing a humble peasant
వీర్నపల్లి : వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామపంచాయితీ పరిధిలోని బంజేరు తండాలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వృద్ద రైతు బుధవారం ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల, స్థానికుల వివరాల మేరకు… గ్రామానికి చెందిన మల్యాల పోషయ్య (60) అనే వృద్దుడు తనకున్న వ్యవసాయ భూమిలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పోషయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా పోషయ్య తనకున్న నాలుగెకరాల భూమిలో పంటలు పండించేందుకు అప్పు చేసి 5 బోర్లు వేశాడు. ఎందులోనూ నీరు పడక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ ఏడు పంటలు ఏ విధంగా పండించాలి అనr మధనపడేవాడు. ఈ క్రమంలో తన ఇద్దరు కుమారులను అప్పు చేసి గల్ఫ్ దేశం పంపించాడు. అక్కడ చాలీ చాలని జీతాలతో వెల్లదీస్తున్నామని కొడుకులు ఫోన్ చేయడంతో చేసిన అప్పులు పెరిగిపోయి సుమారు 8లక్షలకు చేరడంతో అప్పులు ఎలా తీర్చాలి అంటూ బాధపడేవాడు. అంతే కాకుండా ఇటీవల తన కోడలు కరెంటు షాక్‌కు గురై గాయపడగా ఆమెకు చికిత్స కోసం అప్పు చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక బాధలు తాళలేక ఇంట్లో వారికి పొలం వద్దకు వెళ్తున్నాని తెలిపి పోలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఉరివేసుకుని మృతి చెందిన పోషయ్య కనిపించడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతుని కుటుంబాన్ని సర్పంచ్ జోగుల సుదర్శన్, ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ, స్థానికులు పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతునికి భార్య సత్తవ్వ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Comments

comments