ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

3.50 కోట్ల మందికి ఉచిత కంటి పరీక్షలు ఆగస్టు 15 దేశ చరిత్రలో నూతన అధ్యాయం 4,500ల చెరువుల పునరుద్ధరణతో సంతరించుకున్న జలకళ గోదావరి జలాలతో రెండు జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి తుమ్మల జిల్లాలో 32 వైద్య శిబిరాలు మన తెలంగాణ/ఖమ్మం వైద్యవిభాగం : సర్వేంద్రియాలలో నయనం ప్రధానం అని తలంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడలేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న […]

3.50 కోట్ల మందికి ఉచిత కంటి పరీక్షలు
ఆగస్టు 15 దేశ చరిత్రలో నూతన అధ్యాయం
4,500ల చెరువుల పునరుద్ధరణతో సంతరించుకున్న జలకళ
గోదావరి జలాలతో రెండు జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం : మంత్రి తుమ్మల
జిల్లాలో 32 వైద్య శిబిరాలు

మన తెలంగాణ/ఖమ్మం వైద్యవిభాగం : సర్వేంద్రియాలలో నయనం ప్రధానం అని తలంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడలేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సేవా కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమాత్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నా కంటి వెలుగు కార్యక్రమంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజాప్రతినిధులకు, వైద్యధికారులు, సిబ్బందికి గురువారం నగరంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానమని ముఖ్యమంత్రి కేసీఆర్ తలంచి తన ఆలోచనలకు శ్రీకారం చుట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించారన్నారు.

ప్రజల ఇంటి ముంగిటికి కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 3.50 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన కంటి పరీక్షల ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు కంటి వెలుగును ముఖ్యమంత్రి రూపకల్పన చేశారన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకుని అవసరమైన కళ్లజోళ్లు, శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు. దేశ చరిత్రలోనే ఆగస్టు 15 నూతన అధ్యయనానికి నాంది పలుకుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ది సంక్షేమ పథకాల ద్వారా ప్రజాహిత పాలన సాగిస్తుందన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాతో పాటు ఆగస్టు నెలాఖరు నాటికి ప్రతి ఇంటికి శుద్ది చేసిన తాగునీటిని అందించేందుకు రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మిషన్ కాకతీయలో 4,500ల చెరువులను పునరుద్ధరించడం ద్వారా జలకళ సంతరించుకుందన్నారు. రాబోయే రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి గోదావరి జలాలతో రెండు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఖమ్మం ఎంఎల్‌ఎ పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్న ఫలితంగానే రాష్ట్రంలో 120 రోజుల పాటు కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. అంధత్వ నివారణ కై , కంటి వెలుగును ప్రసాదించేందుకు అత్యాధునీక పరిజ్ఞానం, పరికరాలతో కంటి శస్త్ర చికిత్స చేయించడం దేశ చరిత్రలో ఎక్కడ లేదన్నారు. అంధునికి చూపు వస్తే కంటి చూపు ప్రాముఖ్యత తెలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారధ్యంలో మన జిల్లా ఆగ్రస్థానంలో ఉంటుందని కంటి వెలుగులో కూడా ఆగ్రగామిగా నిలపాలన్నారు. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు గానూ ఖమ్మంజిల్లాలో 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 36 కంటి పరీక్షా బృందాలు ఆ శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందిస్తామన్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఖమ్మం నగరంలోని మమత జనరల్ ఆసుపత్రి, అఖిల కంటి ఆసుపత్రి, జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు ఎల్‌వి ప్రసాద్, సరోజిని దేవి కంటి ఆసుపత్రి హైద్రాబాద్‌లో శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించేందుకు చికిత్స పొందిన అనంతరం కంటి చూపుల్లో సంభవించే మార్పుల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రజలను భాగస్వాములను చేసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో 31 వైద్య బృందాలను కంటి వెలుగు కార్యక్రమానికి సన్నద్దం చేశామని తెలిపారు. జిల్లాలో 1.15 లక్షల కళ్లజోళ్లతో పాటు మందుల పంపిణీ జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఐడిసి చైర్మన్ బుడాన్ బేగ్, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మినారాయణ, నగర మేయర్ పాపాలాల్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, నగర పాలక సంస్థ కమిషనర్ సందీప్‌కుమార్ ఝూ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులు కొండలరావు, దయానందస్వామి, సిఈవో మారుపాక నగేష్, ఇరు జిల్లాల వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య విద్యార్థులు ఉన్నారు.

Related Stories: