ఆరోగ్యానికి ముడి బియ్యం

All people like to Southern India eat Line rice

ఎక్కువగా దక్షిణ భారతంలో అందరూ తినే ఆహారం వరి అన్నం. బియ్యం సన్నగా ఉంటే కాస్త అన్నం కూడా ఎక్కువే తింటారు ఎవరైనా. సన్నగా ఉన్న బియ్యాన్నే అందరూ ఇష్టపడుతుంటారు. బియ్యపు గింజ లావుగా ఉంటే అన్నం కంటికి ఇంపుగా కనిపించదు. ఇప్పుడు తెల్లగా, విరవిరలాడుతూ ఉందా, లేదా అనేది చూస్తున్నారు. దంపుడు బియ్యం అన్నాన్ని ఇష్టంగా తినరు. కానీ వాటిలోని పోషక విలువల గురించి ఆలోచిస్తే ముడిబియ్యంలో చాలా పోషక విలువలు ఉన్నాయి. వీటితో వండిన అన్నం ఒంటికి మంచిది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్థం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు కోల్పోతున్నాము. దంపుడు బియ్యం పట్టణాల్లో దొరకడం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్‌బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దానినే ప్రజలు వాడుతున్నారు.

పెద్ద వయసు మహిళలపై జరిపిన పరిశోధనల్లో ముడిబియ్యాన్ని తినడం వల్ల ఎంటరోల్యాక్టోన్ స్థాయి పెరుగుతుందని, దీనివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం మేరకు తెలిసింది. గోధుమరంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రియంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. పెద్దపేగు కేన్సర్ నుండి కాపాడతాయి.

ముడి బియ్యంలో పీచు సమృద్ధిగా ఉన్నందున, అదనపు కేలరీలు తీసుకోకుండా చూడటమేకాక ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది. దీనితో ఎక్కువ ఆహారం తీసుకోలేం. హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం మేరకు పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు సాధారణంగా ఉంటుందని తేలింది. పీచు సమృద్ధిగా ఉన్నందున ముడిబియ్యం ఎంతో ప్రయోజనకారి. ఇది పేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ముడిబియ్యంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వీటిలో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల ధమనులలో కొవ్వు పేరుకోకుండా చేసి గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.
కప్పు ముడిబియ్యంలో దాదాపు 21% మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, కాల్షియాన్ని గ్రహించడానికీ అవసరం. ఉబ్బస వ్యాధి గ్రస్తులకి దాని తీవ్రత తగ్గిస్తుంది.

1 ముడి బియ్యపు ఊక నుండి లభ్యమయ్యే నూనె, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ముడిబియ్యంలో ఉండే పీచూ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
2 ముడిబియ్యం పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థకు అవసరమైన మాంగనీసు సమృద్ధిగా ఉంది. రోజుకు మూడుసార్లు ఈ బియ్యంతో చేసిన ఆహారం తీసుకోవలసిందిగా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అరకప్పు ముడిబియ్యం రోజువారీ పోషకాహార అవసరాలను తీరుస్తుందని చెబుతున్నారు.

                                                                                                                                                         – సైన్స్ విభాగం

Comments

comments