ఆరేళ్ళ బాలిక కిడ్నాప్…

 Kidnapped six year old girl in Nizamabad District
నందిపేట: కుటుంబ తగాదాలతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పాప కిడ్నాప్‌కు గురైన సంఘటన గురువారం మధ్యాహ్నం నందిపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పాప తల్లి హరిత, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండలం వన్నెల్‘కే’ గ్రామానికి చెందిన మద్ది రమేష్ హరిత దంపతులకు మనస్వి(6)తో పాటు 9నెలల ఆరోహి అనే పాప ఉంది. మనస్వి మండల కేంద్రంలోని గీతాకాన్వెంట్ స్కూల్‌ లో యుకేజి చదువుతుంది. కాగా రమేష్ ప్రక్కనే ఉన్న ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో మీసేవ నిర్వహిస్తుంటాడు. అయితే ఇదే గ్రామంలోని బ్లూమింగ్‌బర్డ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే రజిత అనే మహిళతో రమేష్ అక్రమ సంబందం పెట్టుకున్నాడు. ఫలితంగా వీరికి కూడా ఒక పాప కూడా జన్మించింది. కాగా గత కొన్ని రోజులుగా రజిత రమేషకు మద్య గొడవలు జరగుతున్నాయి.
టీచర్‌గా పనిచేస్తానంటూ వచ్చి :.. ఈ క్రమంలో బుధవారం రజిత నందిపేటలోని మనస్విని చదివే పాఠశాలకు వచ్చి నేను ఉపాధ్యాయురాలుగా పని చేస్తానంటూ పాఠశాల యాజమాన్యాన్ని కలిసింది. ఇప్పుడు ఖాళీలు లేవు మళ్ళీ రమ్మని చెప్పగానే అక్కడి నుండి వెలుతు మనస్వి విషయం గురించి ఆరా తీసింది. ఈ రోజు పాప రాలేదని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళింది. గరువారం ఉదయం మళ్ళీ వచ్చి పాఠశాల ఎదుట నిలబడగా యాజమాన్యం ఎందుకు వచ్చావని ప్రశ్నించడంతో మా చుట్టాలమ్మాయి ఇదే పాఠశాలలో చదువుతుందని, తనను కలుస్తానని చెప్పింది. కానీ ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పాపను కలవడానికి వారు అంగీకరించలేదు. దీంతో మధ్యాహ్నం పాప పాఠశాల బయటకు హ్యాండ్ వాష్‌కు రాగానే మరో వ్యక్తితో కలిసి బైక్‌ పై ఎక్కించుకుని పరారైనట్లు పాఠశాల యాజమన్యం గుర్తించి వెంటనే పాప తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గురువారం సాయంత్రం పాప తల్లి హరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజితపై కేసు నమోదు చేసి పాప ఆచూకీ కొరకు గాలిస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.