ఆరగించవయ్యా లంబోదరా..!

ఉండ్రాళ్లు లేని వినాయకచవితిని ఊహించలేం. గణేశుడు భోజన ప్రియుడు. ఆయనకిష్టమైనవన్నీ శుచిగా శుభ్రంగా చేసిపెడితే, ఆరగించి తప్పక కరుణిస్తాడు. పత్రితోపాటు వీటినీ ఆయన ఆస్వాదిస్తాడు. మరి బొజ్జగణపతిని మెప్పించాలంటే ఇవన్నీ తయారుచేసి నైవద్యం పెట్టేయండి… ఉండ్రాళ్లు కావలసిన పదార్థాలు : బియ్యపు రవ్వ – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; సెనగ పప్పు/పెసర పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నెయ్యి – […]

ఉండ్రాళ్లు లేని వినాయకచవితిని ఊహించలేం. గణేశుడు భోజన ప్రియుడు. ఆయనకిష్టమైనవన్నీ శుచిగా శుభ్రంగా చేసిపెడితే, ఆరగించి తప్పక కరుణిస్తాడు. పత్రితోపాటు వీటినీ ఆయన ఆస్వాదిస్తాడు. మరి బొజ్జగణపతిని మెప్పించాలంటే ఇవన్నీ తయారుచేసి నైవద్యం పెట్టేయండి…

ఉండ్రాళ్లు

కావలసిన పదార్థాలు : బియ్యపు రవ్వ – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; సెనగ పప్పు/పెసర పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా.
తయారీ విధానం : స్టౌ మీద మందపాటి ఇత్తడి గిన్నె కాని బాణలి కాని ఉంచి వేడి చేయాలి. వేడెక్కిన తరవాత టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర వేసి వేయించాలి. శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. సెనగపప్పు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి. నీళ్లు బాగా మరిగాక బియ్యపు రవ్వ వేసి ఆపకుండా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి, మూత పెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. బాగా ఉడుకుపడుతుండగా టేబుల్ స్పూను నెయ్యి వేసి కలపాలి. పూర్తిగా ఉడికిన తరవాత గిన్నె/బాణలి దింపేసి ఉడికిన రవ్వను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చల్లారాక కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గుండ్రంగా ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి .

పూర్ణం కుడుములు

కావలసిన పదార్థాలు : సెనగ పప్పు – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా

తయారీ విధానం : సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, దింపేయాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేయాలి. బాణలిలో బెల్లం, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించాలి. పాకం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి. పొడి చేసి ఉంచుకున్న సెనగపప్పును వేసి కలియబెట్టాలి. పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు ఆపకుండా కలిపి దింపేయాలి. చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.వేరొక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. కొద్దిగా నెయ్యి జత చేసి కలపాలి. నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి బాగా కలిపి ఉడికించాలి. ఉడికిన పిండిని ఒక పళ్లెంలోకి తీసి, చేతితో మెదుపుతూ ఉండలా చేయాలి. చేతికి కొద్దిగా నెయ్యి పూసుకోవాలి. ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా తీసుకుని చేతితో ఒత్తాలి. సెనగ పప్పు, బెల్లం ఉండను మధ్యలో ఉంచి బియ్యప్పిండితో మూసేసి నున్నగా చేసి పక్కన ఉంచాలి. ఇలా అన్నీ తయారుచేసుకున్నాక, వీటిని ఇడ్లీ స్టాండ్‌లో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి. ఉడికిన తరవాత దింపేసి, బయటకు తీసి, చల్లారాక వినాయకునికి నైవేద్యం పెట్టాలి.

పాలతాలికలు   
కావలసిన పదార్థాలు:
పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; సగ్గు బియ్యం – 50 గ్రా.; బియ్యం – పావు కేజీ; జీడి పప్పు – 50 గ్రా.; నెయ్యి – 6 టీ స్పూన్లు; ఉప్పు – చిటికెడు.
తయారీ విధానం: ముందురోజు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు శుభ్రంగా ఒంపేయాలి. పొడి వస్త్రం మీద బియ్యం ఆరబోయాలి. బియ్యంలోని తడిపోయిన తరవాత, మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఈ పిండికి బెల్లం పొడి, వేడి పాలు జత చేసి చపాతీ పిండిలా చేసుకోవాలి.
కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని సన్నగా పొడవుగా తాలికలుగా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో లీటరు పాలకు కప్పుడు నీళ్లు జత చేసి, సగ్గుబియ్యం కూడా వేసి స్టౌ మీద ఉంచి, సగ్గు బియ్యం ఉడికేవరకు మరిగించాలి. తయారుచేసి ఉంచుకున్న తాలికలను పాలలో వేసి జాగ్రత్తగా కలపాలి. చివరగా బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలి. చల్లగా అందించాలి.

ఫ్రైడ్ మోదక్

కావలసిన పదార్థాలు : గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని.
ఫిల్లింగ్ కోసం: బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు.
పైభాగం తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి.
ఫిల్లింగ్ తయారీ: ఫిల్లింగ్ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి.
తయారీ విధానం: గోధుమపిండి మివ్రఘ మాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి. ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్నిపక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి. ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.

జిల్లేడుకాయలు 

కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ: 2 కప్పులు; తరిగిన బెల్లం: 1 కప్పు; పచ్చికొబ్బరి తురుము: 2 కప్పులు; గసగసాలు: 1గ్రా. ; బాదం, జీడిపప్పు, కిస్ మిస్: 2 ; నెయ్యి: కొద్దిగా ; యాలకుల పొడి : కొంచెం
తయారీ విధానం:
ముందుగా గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి.ఇప్పుడు మరో గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్దిగా నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన గసగసాలు , యాలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకుని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని , ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి.

Comments

comments