ఆరంభం అదిరింది

Indonesia open to the 18th Asian Games held on Saturday

ఆసియా క్రీడలకు తెరలేచింది

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడలకు శనివారం తెరలేచింది. సెప్టెంబర్ రెండు వరకు జరిగే ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆసియాకు చెందిన 45 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. దాదాపు పది వేల మంది క్రీడాకారులు వివిధ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. శనివారం జకార్తాలోని గెలొరా బంగ్ కర్నో స్టేడియంలో ప్రారంభ వేడుకలు కనుల పండవగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఫైర్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోటీల్లో పాల్గొంటున్న దేశాలకు చెందిన క్రీడాకారులు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత బృందానికి జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించాడు. నీరజ్ చోప్రా జాతీయ పతాకంతో కవాతు చేశాడు. భారత్‌కు చెందిన 572 మంది క్రీడాకారులు కవాతులో పాల్గొన్నారు. భారత్ తరపున 311 మంది పురుషులు, 260 మంది మహిళా క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటున్నారు. కిందటిసారి కంటే ఈసారి భారత్ మరిన్ని ఎక్కువ పతకాలు గెలుచుకోవాలనే లక్షంతో ఉంది. బ్యాడ్మింటన్, కబడ్డీ, హాకీ, టెన్నిస్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. రెజ్లింగ్, షూటింగ్‌లలో కూడా భారత్‌కు పతకాల పంట తథ్యమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, సాక్షి మలిక్, వినేశ్ పొగట్, భజరంగ్ పునియా తదితరులు పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్, ప్రణయ్, సింధు, సైనాలపై భారీ ఆశలు ఉన్నాయి. కబడ్డీలో స్వర్ణం ఖాయమని చెప్పొచ్చు. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా, హిమదాస్ పతకాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. టిటిలో మనికబాత్రాపై ఆశలు ఉన్నాయి. ఆర్చరీలో కూడా భారత్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

comments