ఆయుర్వేద ధామం పాలక్కడ్

భారతదేశానికి పశ్చిమ ముఖద్వారంగా భాసిల్లుతున్న పాలక్కడ్ ఓ భూతల స్వర్గం. పశ్చిమ కనుముల పర్వతశ్రేణిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలోని నీరు, గాలి, భూమి ఆయుర్వేద ఔషధాలను పులుముకుని ఆయుష్షును కాపాడే ప్రకృతి ధామంగా విరాజిల్లుతోంది. మధ్యకేరళ రాష్ట్రానికి చెందిన ఈ పట్టణం పూర్వ నామం పాలఘాట్. పశ్చిమ కనుముల నుంచి ప్రవహించే పొన్నానది తీరప్రాంతమైన పాలఘాట్‌ను క్రీ.పూ 320లో సముద్రగుప్తుడు  జయించినట్లు హరిసేనుడి శాసనాల్లో తెలుస్తుంది.  వందలాది సంవత్సరాల సుదీర్ఘ సంధికాలం అనంతరం హైదర్ ఆలీ ఇక్కడ కోటను నిర్మించి రాజ్యవిస్తరణ చేశాడు. టిప్పుసుల్తాన్ పాలనలో పాలక్కడ్ స్వర్గధామంగా విరాజిల్లింది. పాలక్కడ్ కేరళకు చెందిన రాష్ట్రం అయినప్పటికీ తమిళ సంస్కృతి కనిపిస్తుంది.

Ayurvadam 

సుదీర్ఘ చరిత్ర, సంస్కృతిని సొంతం చేసుకున్న పాలక్కడ్ ఆయుర్వేద గ్రామంగా కైరాలి ఆయుర్వేదిక్ సంస్థ తీర్చిదిద్దింది. ప్రపంచంలో టాప్ 50 వెల్‌నెస్ డిస్టినేషనల్ ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం అభివృద్ధికి కెవి రమేష్, గీత రమేష్ దంపతుల శ్రమ ఎంతో ఉంది. వందశాతం ఆయుర్వేద మొక్కలతో నిండిపోయిన పాలక్కడ్‌లో 1998లో కైరాలి ఆయుర్వేదిక్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రపంచ గుర్తింపు పొందిన ఇక్కడి ఆయుర్వేద వైద్యానికి 9 దేశాల్లో 35 చికిత్స సెంటర్లు ఉన్నాయి. దీర్ఘరోగాలను నయం చేసే మొక్కలు, సమతౌల్య వాతావారణం, అడవులు, మూలికలు ఔషధాలతో నిండిన ఈ ప్రాంతంలో తరతరాల నుంచి ఆయుర్వేద వృత్తిలో ఉన్న వైద్యులు (అష్ఠ వైద్యాస్) రోగులకు చికిత్స చేస్తూంటారు.

పాలక్కడ్ ఆయుర్వేదం: వేలాది సంవత్సరాల క్రితం నుంచి ఆధ్యాత్మిక గడ్డ అయిన భారతదేశంలో ఆవిర్భవించిన ఆయుర్వేదం ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. ఆయుర్వేదంలో వైద్యం, తాత్విక ఆలోచనలు సమ్మిళితమై ఉంటాయి. ప్రాచీన కాలంనుంచి ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా మానవాళి శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహద పడుతుంది. ప్రత్యేకమైన ఈ ఆయుర్వేద వ్యవస్థను పాలక్కడ్ లో కైరాలీ ఆయుర్వేదిక్ హెల్త్ సెంటర్ వారు సంపూర్ణ సహజసిద్ధమైన పద్ధతులతో శరీర సంతులనం కోసం వాత, పిత్త, కఫ గుణాలను నిర్ధారించి వైద్యంతో తరిమి వేస్తున్నారు. ఆయుర్వేదానికి ముని వాగ్బట్ట చెప్పిన భాష్యం కైరాలీ వైద్యంలో అగుపిస్తుంది. ఆయుర్వేద దిగ్గజాలైన చరక, శుశ్రూష సంహితల విధానాలు, చికిత్స పద్ధతులు కైరాలీ సొంతం చేసుకుంది.

వందలకొద్దీ ఆయుర్వేద మందులను భస్మం, తైలం, లేపనాలుగా వర్గీకరించి క్రమపద్ధ్దతిలో అందిస్తున్నట్లు సుప్రసిద్ధ ఆయుర్వేద వృద్ధ వైద్యుడు చంద్రశేఖరన్ చెప్పారు. 5 ఏళ్ల నుంచి సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులతో వైద్యం చేస్తూ శాస్త్రీయంగా ఆయుర్వేదంలో ఎం.డి పట్టా పొందిన 92 సంవత్సరాల చంద్రశేఖరన్ ఎందరో వైద్యులకు ఆదర్శం. ఆహార నిబంధనలు పాటిస్తే అనేక రోగాలు మటుమాయం అవుతాయని చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్‌లో తిండి అలవాట్లు ప్రమాదకరంగా ఉంటాయని అన్నారు. ఎండుమిర్చి, పప్పులు అధికంగా ఉపయోగించవద్దని సూచించారు. ఎండు మిర్చికి బదులు పచ్చిమిర్చి వాడాలని సూచించారు. కేరళలోని కైరాలి పాలక్కడ్ ఆయుర్వేదం కేవలం ఒక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మాత్రమేకాదు. ఇది కేరళ జీవన శైలిలో అంతర్భాగం. పక్షపాతం వచ్చిన వారు నడవడం, నయంకాని వ్యాధులు దూరం కావడం, షుగర్ ను నియంత్రించడం, ఒంటి నొప్పులను దూరం చేయడం, రోగనిరోధకశక్తిని పెంచి అల్లోపతి మందులకు నయంకాని రోగాలను నయంచేయడం, మనసుకు ప్రాశాంతత కల్పించడం కైరాలికే సొంతమైంది.

ప్రయాణం ఓ అనుభూతి:కొయంబత్తూర్ విమానాశ్రయం నుంచి 80 కి.మీ దూరంలో పాలక్కడ్ ఆయుర్వేద గ్రామం ఉంది. దారిపొడుగునా ప్రకృతి అందాలతో పరవశిస్త్తూ ప్రయాణం ముందుకు సాగుతుంది. ఎక్కడా భూమి కానరాదు. ప్రకృతి పచ్చని రంగు పులుముకున్నట్లు ఉంటుంది. అక్కడక్కడ నాలుగైదు ఎకరాల్లో ఓ చిన్న ఇల్లు కనిపిస్తుంటుంది. ఎప్పుడు చిరుజల్లు పడుతూనే ఉంటుంది. కొబ్బరి, అరటి, పూలమొక్కలు, అక్కడక్కడ సహజసిద్ధంగా పెరిగిన కూరగాయల మొక్కలు, పచ్చని పంటపొలాలు, పక్షుల కిలకిలా రావాలు, మయూరాల నృత్యాల మధ్య పాలక్కడ్ ప్రయాణం సాగుతుంది. చిన్నకాలువలు, కాలుష్యం లేని జలవనరులు మనసును పరవశింపజేస్తాయి. ఆ తర్వాత పాలక్కడ్ ఆయుర్వేద గ్రామం వస్తుంది. అందులో అడుగు పెట్టగానే మైమరిచి పోతుంటారు. వేలాది ఔషధ మొక్కల మధ్య అనేక దేశాల నుంచి వచ్చిన వారు యోగా, ధ్యానంలో నిమగ్నమై కనిపిస్తారు. ఇక్కడ ఆహార నియమాలు కఠినంగా ఉంటాయి. వైద్యుల సలహా మేరకు శరీరానికి కావల్సిన క్యాలరీలను అంచెనా వేసి ఆహారం ఇస్తుంటారు. పప్పులు, ఎండుకారం, చింతపండు ఆహారాల్లో ఉండవు.

మసాజ్ థెరపీ : కైరాలి మసాజ్ థెరపీకి ప్రత్యేకత ఉంది. కైరాలి ఆయుర్వేదిక్ ఫ్యాక్టరీలో తయారు అయిన ప్రత్యేక తైలంతో మసాజ్ చేస్తారు. మందాలాది వనమూలికలతో విభిన్న గుణాలున్న తైలాలు ఇక్కడ లభిస్తాయి. ఔషధ మొక్కలతోపాటు ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్, మాస్టర్ ఆయిల్, అవకోడో ఆయిల్, కొబ్బరి నూనె, క్యాస్ట్రో ఆయిల్, నువ్వుల నూనె, సన్ ప్లవర్ నూనెల్లో ఆవుపాలు, ఔషధాలతో ప్రత్యేక తైలాన్ని చేసి మసాజ్ చేస్తారు. సమర్థవంతమైన చికిత్స ప్రక్రియ మసాజ్ థెరపీ, ఈ థెరపీలో వాడే తైలాల మర్దన వల్ల అనేక రుగ్మతలను దూరం చేస్తాయి. రోగిని పరీక్షించిన అనంతరం ఏ రకమైన మసాజ్ చేయాలి, ఏ ఔషధాల తైలాన్ని ఉపయోగించాలో నిర్ధారిస్తామని డాక్టర్ రోహిత్ చెప్పారు. బాడి మసాజ్‌లో గోరువెచ్చని నూనెలను వాడటంతో అద్భుత ప్రయోజనాలు ఉంటాయన్నారు. మసాజ్ తో మనసు శరీరాన్ని ఉత్తేజ పరుస్తుందనీ, చర్మంలో రక్త ప్రసరణను పెంచడంతో పాటు సూక్షరంధ్రాల ద్వారా తైలంలోని ఔషధాలు శరీరంలోకి వెళతాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేది ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావంగా భావించవచ్చు. వాతావరణంలో, ఆహారంలో, శరీరంలో మార్పులు, వ్యాధి నిరోధక వ్యవస్థ తగ్గిపోవడం, సరైన వ్యాయామం లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 100 రకాల మసాజుల్లో ఒంటి నొప్పులను తగ్గించటంతోపాటు క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధులు తగ్గించవచ్చని ఆయుర్వేదం నిరూపిస్తుంది. అయితే మసాజ్ తోపాటు ధ్యానం, యోగా తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు.

ఔషధాల తయారీ: కైరాలి హెల్త్ సెంటర్‌కు సొంత ఫ్యాక్టరీ ఉండటంతో అవసరాలకు తగిన విధంగా ఔషధాలను తయారు చేస్తున్నారు. పాలక్కడ్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో కైరాలి ఆయుర్వేద ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఔషధమొక్కలను శుద్ధిచేసి మందులు తయారు చేస్తారు. మసాజ్ ఆయిల్స్‌తోపాటు అనేక రోగాలను తగ్గించే మందులను తయారు చేసి 23దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సౌందర్య ఔషధాలు, దీర్ఘరోగాలను తరిమే ఔషధాలు, స్త్రీ, పురుషుల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే మందులు, లేపనాలు, చూర్ణాలు, తైలాలు ఇక్కడ ప్రసిద్ధి. ప్రకృతి ఒడిలో జరిగే ఈ వైద్యం ఆధునిక శాస్త్ర విజ్ఞానం విసురుతున్న సవాళ్లను ఎప్పటికప్పుడు ఎదుర్కొని నిలుస్తూనే ఉంది.

వి.భూమేశ్వర్
మనతెలంగాణ ప్రతినిధి