ఆయిల్ అన్వేషణలో ఆశాజ్యోతి

OIL has made great progress in crude oil exploration

దేశ ఆర్థికాభివృద్ధికి, నిలకడైన పురోగతికి అత్యంత కీలకమైన క్రూడ్ ఆయిల్ అన్వేషణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థలైన ఒఎన్‌జిసి, ఒఐఎల్ గొప్ప పురోగతి సాధించాయన్న సమాచారం ప్రభుత్వ చెవులకు సుగమ సంగీతం లాంటిది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌ల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను పెద్ద ఎత్తున కనుగొన్నట్లు ఒఎన్‌జిసి డైరెక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) అజయ్ కుమార్ ద్వివేది గతవారం ప్రకటించారు. ముంబై ఆఫ్ షోర్ (సముద్రం లోపల), కృష్ణా గోదావరి బేసిన్ ఇప్పుడు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఈ రెండు కొత్త ముడినూనె, గ్యాస్ బేసిన్‌లు దేశ ఇంధన భవిష్యత్‌కు ఎంతో కీలకమవుతాయి. ఈ రెండు అన్వేషణ ప్రదేశాలు భూమి మీదే ఉన్నాయి. దేశ ఆయిల్ అవసరాల్లో 80 శాతం దిగుమతులపై ఆధారపడి ఉన్న పరిస్థితిలో ఈ కొత్త అన్వేషణలు ఊరట, ఉత్సాహం కలుగజేస్తాయి. అయితే ఆయిలు నిక్షేపాల అన్వేషణ ఆర్థికంగా, సాంకేతికంగా పెద్ద జూదం. వెలికి తీయటం కూడా భారీ వ్యయ ప్రయాసతో కూడిన వ్యవహారం. అంతేగాక గెసిషన్ పీరియడ్ (వెలికితీసే నిర్మాణాలకు పట్టేకాలం) కూడా చాలా హెచ్చుగా ఉంటుంది. అందువల్లనే పెట్టుబడిపై శీఘ్రంగా లాభాలు కోరుకునే ప్రైవేటు రంగం ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపదు. ఒక్క రిలయెన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మాత్రమే ఈ రంగంలో అడుగుపెట్టింది. ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తిలోకి ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించటాన్ని భారత ప్రభుత్వం 1999లో ప్రారంభించింది.

మన దేశంలో నిరూపణ అయిన ఆయిల్, గ్యాస్ నిల్వలను వాణిజ్యపరంగా వెలికి తీసేందుకు పెట్టుబడి పెట్టటానికి మరో ప్రైవేటు కంపెనీ వేదాంత ముందుకు వచ్చింది. ఇది విదేశాల్లో స్థిరపడిన భారత గుత్తపెట్టుబడిదారు అనితా అగర్వాల్‌కు చెందినది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ (డిజిహెచ్) ఇటీవల 55 ఆయిల్, గ్యాస్ బ్లాకులను వేలానికి పెట్టగా వాటిలో 41 బ్లాకులను వేదాంత దక్కించుకుంది. కాగా ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా 9, ఒఎన్‌జిసి 2, గైల్, భారత పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ఒక్కొక్క బ్లాకు సొంతం చేసుకున్నాయి. అయితే ఈ కంపెనీలు బావులు త్రవ్వే పనులు ఎప్పుడు మొదలు పెడతాయనేది పెద్ద ప్రశ్న.

ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు దేశంలో, విదేశాల్లో కొనుగోలు చేసిన బ్లాకుల్లో ఆయిల్ అన్వేషణ, వెలికి తీతకు శక్తి కొలది ప్రయత్నిస్తున్నప్పటికీ దేశ ఆయిల్ దృశ్యం నిరాశాజనకంగా ఉంది. ఒకవైపు ఇప్పటికే క్రూడ్ ఆయిలు తోడుతున్న బావుల్లో ఉత్పత్తి తగ్గుతున్నది. ఉదాహరణకు ఒఎన్‌జిసి క్రూడ్ ఆయిలు ఉత్పత్తి 2017 జులైతో పోల్చితే మొన్నటి జులైలో 7 శాతం (1932 టిఎంటి నుంచి 1789 టిఎంటి) తగ్గింది. ఆయిల్ ఇండియా ఉత్పత్తి 4 శాతం తగ్గింది. దేశీయ ఉత్పత్తి మొత్తంగా ఈ ఏడాది తొలి నాలుగు మాసాల్లో (ఏప్రిల్ జులై) గత సంవత్సరం అదే కాలం ఉత్పత్తితో పోల్చితే 12,085 టిఎంటి నుంచి 11,703కు తగ్గింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు పెరిగే కొలది ఇంధనానికి డిమాండ్ పెరుగుతుంది. అందులో ఆయిల్, గ్యాస్ ది పెద్ద వాటా. ఆయిల్ వినియోగంలో మన దేశం మూడేళ్ల క్రితం జపాన్‌ను మించిపోయి అమెరికా, చైనాల తదుపరి మూడవ స్థానంలోకి వచ్చింది.

భారత్ ఇంధన వినియోగం ఏటా 4.2 శాతం పెరుగుతూ 2035 నాటికి వినియోగ వృద్ధిరేటు అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను మించుతుందని బ్రిటీష్ పెట్రోలియం స్టాటిస్టికల్ రెవ్యూ అంచనా వేసింది. వృద్ధిలో శీఘ్రతర అభివృద్ధి అంచనా ఆనందదాయం. అందుకు తగిన ఇంధన వనరులను వృద్ధి చేసుకోవటం, ప్రోగు చేసుకోవటం సవాలు. బొగ్గు దిగుమతిపై ఆధారపడటం తగ్గింది. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి విస్తరిస్తున్నది. అయితే ఆయిల్, గ్యాస్‌కు పెరుగుతున్న డిమాండ్, దేశీయ ఉత్పత్తి తగ్గుదల ఆందోళనకరం. కొరతను తగ్గించటానికి ఇటీవల వృద్ధిలోకి వస్తున్న ఒక ప్రక్రియ ‘ఇంధన మిక్స్’. ఈ మధ్యనే విమాన రవాణాపై దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఎలక్ట్రిక్ వినియోగ రవాణా వాహనాల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఏమైనా ఆయిల్, గ్యాస్ అనేక దశాబ్దాలపాటు ప్రధాన ఇంధనంగా కొనసాగుతుంది. అందువల్ల ఆయిల్, గ్యాస్ అన్వేషణ, వెలికితీత, వాణిజ్య ఉత్పత్తిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెంచాలి; ఈ రంగంలో బహు తక్కువగా ఉన్న విదేశీ పెట్టుబడులను గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలి. స్వదేశంలో ఉత్పత్తి పెరిగినప్పుడే అంతర్జాతీయ మార్కెట్ ఆటుపోట్లను, అధ్యక్షుడు ట్రంప్ లాంటి వాళ్లు విధించే ఆంక్షలను దేశం తట్టుకుని నిలబడ గలుగుతుంది.