ఆపరేషన్ ముస్కాన్

 Child labor system eradication

మనతెలంగాణ/ సిటీబ్యూరో : చిన్నారుల చిరునవ్వులు బోసిపోరాదని… అవి భావితరాలకు దశా దిశా నిర్దేశం చేసేవని భావించిన రాచకొండ పోలీసు యంత్రాంగం వారి స్వేచ్చకోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రధానంగా అందరూ ఉండి కార్మికులుగా, అదృశ్యమై అనాథలుగా మారకుండా చూస్తున్నది రాచకొండ పోలీసు కమిషనరేట్. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ఆపరేషన్ స్మైల్ , ఆపరేషన్ ముస్కాన్‌లను ప్రతిఏటా నిర్వహిస్తూ చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతున్నారు. 2017లో మొత్తం 210 మందిని వెట్టి నుండి విముక్తిని కల్పించారు. ఇందులో బాలురు 185, బాలికలు 25 మంది ఉన్నారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 52, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 158గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి భవిష్యత్‌కు చదువులే పునాదిగా వేస్తున్నారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన… తప్పిపోయిన చిన్నారులను తిరిగి తల్లి ఒడికి చేర్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా బాల కార్మికులు ఎక్కడ ఉన్నా సమాచారాన్ని సేకరించి ఆకస్మిక దాడులు నిర్వహించి వెట్టి నుండి విముక్తిని కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు రాచకొండ పోలీసులు. ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, ప్రతి సంవత్సరం జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
ప్రధాన ఉద్దేశ్యం: కమిషనరేట్ పరిధిలో బాలకార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేకంగా 8 బృందాలను డివిజన్‌ల వారిగా నియామకం చేశారు. ప్రతిఏటా జులై మాసాంతం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం, దాడులు చేయడం, తనిఖీలు ముమ్మరంగా జరపడం చేసి బాలకార్మికులను వెట్టిచాకిరి నుండి తప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇటుకబట్టీలలో పనిచేయకుండా నివారిస్తున్నారు. అధిక శాతం మంది ఇతర రాష్ట్రాలైన ఒడిశా, చత్తీష్‌ఘడ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్‌ల నుండి నగర శివారు ప్రాంతాలకు చేరుకుని కార్మికులుగా మారుతున్నారు. ఇటుకబట్టీలు, భవన నిర్మాణ రంగంలో బాలలు పనిచేస్తున్నట్టు పోలీసు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. వారిని తమతమ కుటుంబీకులకు అప్పగించడంతో పాటు పునరావాసం కల్పించడంలో భాగంగా పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలలను పనిఒప్పందం చేసుకుని తీసుకువచ్చిన ఉద్యోగులపై బాలకార్మిక చట్టం ప్రకారంగా 4 కేసులు నమోదు చేశారు.
ప్రత్యేక పాఠశాలలు
బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తి పొందిన బాలలకు, వారికి విద్యభ్యాసం కోసం ప్రత్యేకంగా 5 పాఠశాలను కమిషనరేట్ ప్రారంభించింది. యాదాద్రి- భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో 180 మంది విద్యార్థులు ఉన్నారు. రెండవది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రావిర్యాల గ్రామంలో 800 మంది విద్యార్థులున్నారు. చీకటి మామిడిలో 50 మంది విద్యార్థులు, బొమ్మలరామారం మందలం కాజీపేటలో 25 మంది, లక్ష్మి తండాలో 45 మంది బాలకార్మిక వ్యస్థనుండి విముక్తి పొందిన చిన్నారులు విద్యార్థులుగా ఎదుగుతున్నారు. పిల్లలు మన బాధ్యతలుగా నిర్వర్తించాలని పోలీసులు ప్రచారం సాగిస్తున్నారు.
ఇటుకబట్టీలే లక్షం: నగర శివారులోని ఇటుకబట్టీలను లక్షంగా చేసుకుని పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుండి బాలకార్మికులు నగరానికి చేరుకుని బట్టీల్లో పనిచేస్తున్నారు. దీనిని గుర్తించిన కమిషనర్ ముందగా బట్టీలను లక్షంగా చేసుకున్నారు. అనంతరం నిర్మాణాల పనుల నేపథ్యంలో సాగుతున్న బాలకార్మికులను పట్టుకుని వారికి కేటాయించిన స్కూళ్లో చేర్పించి నేర్పిస్తున్నారు. ఫలితంగా బాలకార్మికుల రహిత కమిషనరేట్‌గా పేరు సంపాదించడానికి కమిషనర్ కృషిచేస్తున్నారు.
వ్యభిచార గృహాలపైనా దృష్టి: ఇప్పటి వరకు ఇటుకబట్టీలనే లక్షంగా చేసుకున్న పోలీసులు ఇప్పుడు వ్యభిచార గృహాలపైనా దాడులు నిర్వహిస్తున్నారు. చిన్నారులను బడిమానిపించి వ్యభిచార కూపంలోకి దింపడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టినట్టు వారు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల యాదాద్రి జిల్లా పరిధిలో వరుస దాడులు నిర్వహిస్తున్నామని వారు వివరిస్తున్నారు.

Comments

comments