ఆగని పెట్రో వడ్డింపు

పెట్రోలుపై 39 పైసలు. డీజిలుపై 44 పైసలు పెంపు
ఢిల్లీలో లీటరు రూ.80 దాటిన పెట్రోలు ధర

Petrol-Price-Hike

న్యూఢిల్లీ: పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒక్క రోజే 48పైసలు పెరిగిన పెట్రోలు ధర శనివారం మరో 39 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర తొలిసారిగా రూ.80ని దాటేసింది. కాగా మరో వైపు ముంబయిలో పెట్రోలు ధర లీటరుకు రూ.87.77కు చేరుకుంది. పెట్రోలియం కంపెనీల ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ.80.38గా ఉండగా, చెన్నైలో రూ. 83.54, కోల్‌కతాలో రూ.83.27, హైదరాబాద్‌లో రూ.85.23గా ఉంది. కాగా డీజిలు ధర లీటరుకు 44పైసలు పెరిగి ఢిల్లీలో రూ.72.51గా ఉంది. ముంబయిలో రూ.76.98, చెన్నైలో రూ.76.64, కోల్‌కతాలో రూ.75.36, హైదరాబాద్‌లో రూ.78.87గా ఉంది. వాస్తవానికి నాలుగు మెట్రో నగరాల్లో ఢిల్లీలోనే పెట్రోలు, డీజిలు ధరలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ వాటిపై వ్యాట్ మిగతా నగరాలకన్నా తక్కువ. కాగా ముంబయిలో వీటిపై వ్యాట్ వడ్డింపు ఎక్కువ.

ముడి చమురు ధరలు పెరగడంతో పాటుగా, డాలరుతో రూపాయి విలువ పడిపోవడవ కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడానికి స్రధాన కారణం. వీటికి తోడు కేంద్రం వీటిపై ఎక్సైజ్ సుంకాలను భారీగానూ వడ్డిస్తోంది. పెట్రోలు, డీజిలు ధరల్లో దాదాపు సగం దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఉన్నాయి.

చమురు ధరల హెచ్చుతగ్గుల  వల్లే ధరల పెరుగుదల

ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై హామీ ఇవ్వని జైట్లీ

పెట్రోలు, డీజిలు ధరలు సరికొత్త రికార్డుల స్థాయికి పెరిగిపోయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం వినియోగదారులకు కాస్తయినా ఊరట కల్పించడానికి ఎక్సైజ్ సుంకాలను తగ్గించే విషయంలో ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వ లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు  భారీ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని, అవి తగ్గే సూచనలేమీ కనిపించడం లేదని ఆయన అన్నారు.

ప్రతిపక్ష నేతలుగా తాను, సుష్మాస్వరాజ్‌లు అప్పటి యుపిఎ ప్రభుత్వంపై చేసిన విమర్శలను జైట్లీ సమర్థించుకుంటూ, అప్పట్లో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉండిందని, పెట్రోలియం ధరలను అదుపు చేయకపోతే ధరలు మరింత పెరిగి పోతాయని, అలాంటి పరిస్థితిలో ప్రభుత్వాన్ని విమర్శించకపోతే ప్రతిపక్ష నేతలుగా తమ కర్తవ్యాన్ని విస్మరించిన వాళ్లమయ్యే వాళ్లమని జైట్లీ అన్నారు. దేశ అవసరాల్లో అధిక భాగం చమురును మన దేశం బయటి దేశాలనుంచే కొనుగోలు చేస్తుందని, అందువల్ల ముడి చమురు ధరలు పెరిగినప్పడు దాని ప్రభావం మన దేశంపై తాత్కాలికంగా పడుతుందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవని  ఆయన అంటూ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ముడి చమురు ధరలపై తీవ్రమైన ఒత్తిడి ఉండిందని, అయితే జూన్. జూలై నెలల్లో ఈ ధరలు కాస్త తగ్గాయని చెప్పారు.అయితే ఆగస్టులో మళ్లీ పెరిగాయని చెప్పారు. అయితే గత రెండు రోజులుగా ముడి చమురు ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్త్తోందని కూడా జైట్లీ చెప్పారు.

Comments

comments