ఆందోళన విరమించిన రెవెన్యూ ఉద్యోగులు…

Revenue employees who withdraw anxiety...
వనపర్తి: వనపర్తి జిల్లా పరిధిలోని శ్రీరంగాపురం మండల తహశీల్దార్ శ్రీనివాస్ రావు, డిటి అనురాధ, విఆర్‌ఒ వెంకటరమణలను జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి సస్పెండ్ చేయడంపై జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారం రెండు రోజులు రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయాలకు తాళం వేసి కలెక్ట రేట్ ముందు ఆందోళనకు పూనుకున్నారు. శ్రీరంగాపురం మండలంలో రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల భూముల ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయకపోవడంపై బుధవారం రాత్రి వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో రైతుబంధుపథకం జిల్లా ప్రత్యేకాధికారిణి అనితా రాజేంద్రన్ జిల్లాలోని 14 మండలాల తహ శీల్దార్లతో రివ్యూ నిర్వహించారు. రివ్యూలో 80 శాతం ఆధార్‌నెంబర్లను మాత్రమే అనుసంధానం చేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తు ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆ మరుసటి రోజు గురువారం నుండి వనపర్తి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. శుక్రవారం రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చెన్న కిష్టన్న, వనపర్తి జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ కలెక్టర్ శ్వేతామహంతితో చర్చలు జరిపారు. సస్పెండ్‌కు గురైన ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులతో పాటు జిల్లా వ్యాప్తంగా సస్పెండ్ అయిన మరో నల్గురు ఉద్యోగులను రెండు రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గం జిల్లా రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. రెవెన్యూ అధికారులు పని తీరును మెరుగుపర్చుకోవాలని, విధుల పట్ల నిర్లక్షం వహించవద్దని ప్రభుత్వ లక్ష్యాన్ని అందుకునేందుకు ఉద్యోగులు పని చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్షం వహించే రెవెన్యూ సిబ్బంది సమస్యల పట్ల యూనియన్ కూడా ఏమి చేయలేదని సూచించారు.