‘అసెంబ్లీ రద్దు తొందరపాటు చర్య కాదు’

Harish Rao on Telangana Assembly Dissolution

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు ముమ్మాటికీ తొందరపాటు చర్య కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హుస్నాబాద్‌ సభతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామన్నారు. టిఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే పూరించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హమీలు పూర్తిగా అమలు చేయడమేకాకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో లేనివి కూడా ప్రజల సంక్షేమం కోసం కెసిఆర్ తీసుకువచ్చారని హరీష్ గుర్తు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయనే వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌, టిడిపి కలిసి ఎలా పోటీ చేస్తాయని ఆయన ప్రశ్నించారు. టిడిపి చివరి వరకూ తెలంగాణను అడ్డుకున్నదని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై అక్రమ కేసులు వేసి అడ్డుకున్నదని విమర్శించారు. అలాంటి ఈ రెండు పార్టీలు కలిస్తే ప్రగతి నిరోధక కూటమి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అంతేగాక కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా కలుషితం చేసిందని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు.

Comments

comments