అసెంబ్లీ రద్దు తెలంగాణ కోసమే

KCR Cabinet meeting in telangana bhavan

అసెంబ్లీ రద్దుకు ప్రగతి భవన్ కేబినెట్ భేటీలో ఏకగ్రీవ ఆమోదం
ఏక వాక్య తీర్మానంతో శాసనసభ రద్దు
నాలుగైదు నిమిషాల్లో ముగిసిన మంత్రివర్గ సమావేశం
వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తీర్మానం సమర్పించిన సిఎం
తక్షణమే ఆమోదం తెలిపిన నరసింహన్
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరిన గవర్నర్
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సిఎస్
రాష్ట్ర ప్రగతి కోసమే రద్దు : మీడియా సమావేశంలో కెసిఆర్

స్వరాష్ట్ర సాధనోద్యమ సారథి, పరంపర విజయాల నవ చరిత్ర సృష్టికర్త,  సిఎం కెసిఆర్  తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభను తొమ్మిది నెలల ముందు రద్దు చేశారు. ఈ మేరకు మంత్రిమండలి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయానికి గవర్నర్ నరసింహన్  గురువారం మధ్యాహ్నం  ఆమోదం తెలిపారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ గురువారం రద్దయింది. అసెంబ్లీని రద్దు  నిర్ణయానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశమైన మంత్రిమండలి అసెంబ్లీ రద్దుకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం  తెలిపింది.  కేవలం నాలుగైదు నిమిషాల పాటు జరిగిన క్యాబినెట్ స మావేశంలో అసెంబ్లీ రద్దు తీర్మానానికి ఆమోదం లభించిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు దానిని సమర్పించారు. ఈ తీర్మానానికి గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ను కొనసాగాలని కోరారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కెసిఆర్ అంగీకరించారు.  కెసిఆర్ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగనున్నట్టు తెలియజేస్తూ నిమిషాల వ్యవధిలోనే  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఆ మేరకు జీవో (నెం 134) కూడా విడుదలైంది. తెలంగాణ తొలి సిఎంగా కెసిఆర్ జూన్ 2, 2014న ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం 4 సంవత్సరాల 3 నెలల 4 రోజుల పాటు కొనసాగింది. దాదాపు మరో తొమ్మిది నెలల గడువు ఉండగానే అసెంబ్లీని ముఖ్యమంత్రి రద్దుచేశారు.

ఉదయం నుంచి ‘ప్రగతి భవన్’లో నాటకీయ పరిణామాలు
అసెంబ్లీ రద్దు ఉండవచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి పొద్దుపోయే వరకూ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులంతా కూలంకషంగా చర్చలు జరిపారు. బుధవారం రాత్రికే మంత్రిమండలి సమావేశం ఉం టుందని తొలుత ఊహాగానాలు వచ్చినా శుక్రవారం ఉంటుందని సమాచారం మంత్రులందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం చేరవేసింది. గురువారం ఉదయం ఆరుగంటల నుంచే ప్రగతిభవన్‌లో సందడి నెలకొనింది. మరోవైపు సచివాలయంలో సైతం పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళకు వెంటవెంటనే ఆయా శాఖల నుంచి క్లియరెన్స్ కోసం పనులు చకచకా జరిగిపోయాయి. ప్రగతిభవన్‌కు పార్టీ నేతలు, ఎంపిలు, శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు ఒక్కొక్కరుగా క్యూ కట్టారు. చివరకు మధ్యా హ్నం ఒంటిగంటకు మంత్రిమండలి సమావేశం ఉంటుందని ఖరారుకావడంతో ఒక్కరొక్కరుగా మంత్రులంతా హాజరయ్యారు. నాలుగైదు నిమిషాల వ్యవధిలోనే సమావేశం పూర్తయింది. ఆ వెంటనే తీర్మానానికి ఆమోదం లభించడం, రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు సమర్పించడం, ఆమోదం తెలపడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించడం, ప్రభుత్వం ఉత్తర్వులను, గెజిట్‌ను విడుదలచేయడం& అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది.

Comments

comments