అవినీతిపై అశ్రద్ధకు పరాకాష్ట

‘అవినీతిపరుల పనిపడతాం; విదేశాలకు పారిపోయిన పేరు మోసిన ఆర్థిక నేరస్థులను పట్టి తెచ్చి బోనులో నిలబెడతాం’ లాంటి గంభీర వాక్కులను ప్రభుత్వ బాధ్యుల నుంచి తరచూ వింటుంటాం. కాని దగా, మోసం, అక్రమంగా విదేశాలకు డబ్బు తరలింపు (మనీలాండరింగ్) నేరారోపణలకు గురైన ఐపిఎల్ (క్రికెట్) మాజీ చీఫ్ లలిత్ మోడీ లండన్ పారిపోయి ఏడెనిమిదేళ్లు గడిచినా ఇంతవరకు ఛార్జిషీటు దాఖలు కాలేదన్న సమాచారం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని తమిళనాడు ప్రభుత్వం 9 […]

‘అవినీతిపరుల పనిపడతాం; విదేశాలకు పారిపోయిన పేరు మోసిన ఆర్థిక నేరస్థులను పట్టి తెచ్చి బోనులో నిలబెడతాం’ లాంటి గంభీర వాక్కులను ప్రభుత్వ బాధ్యుల నుంచి తరచూ వింటుంటాం. కాని దగా, మోసం, అక్రమంగా విదేశాలకు డబ్బు తరలింపు (మనీలాండరింగ్) నేరారోపణలకు గురైన ఐపిఎల్ (క్రికెట్) మాజీ చీఫ్ లలిత్ మోడీ లండన్ పారిపోయి ఏడెనిమిదేళ్లు గడిచినా ఇంతవరకు ఛార్జిషీటు దాఖలు కాలేదన్న సమాచారం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని తమిళనాడు ప్రభుత్వం 9 నెలల క్రితం పంపిన అభ్యర్థన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ “పరిశీలనలోనే” ఉండటం మరింత దిగ్భ్రాంతికరం. కేసు దర్యాప్తులో తాబేలు సైతం సిగ్గుపడేంతగా తమిళనాడు పోలీసుల మహాతాత్సారం, కేంద్ర ప్రభుత్వ నిద్రావస్థ చూస్తుం టే లలిత్ మోడీకి బలమైన అదృశ్యశక్తుల అండదండలున్నాయన్న అనుమానం ఎవరికైనా కలగకమానదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య కార్యనిర్వాహకునిగా బిసిసిఐ ధనాన్ని దుర్వినియోగం చేసిన లలిత్ మోడీ, బ్యాంకులకు దాదాపు రూ. 9500 కోట్లు ఎగనామం పెట్టిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 13 వేల కోట్లకు బురుడీ కొట్టించిన నీరవ్ మోడీ, మరో రూ. 4 వేల కోట్లకు ముంచిన అతడి మామ మెహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయిన మహా ఆర్థిక నేరస్థులు. లలిత్ మోడీ, విజయ్ మాల్యా దీర్ఘకాలంగా లండన్‌లో నివాసం ఉంటుండగా, నీరవ్ మోడీ కూడా లండన్‌లోనే ఉన్నట్లు ఇటీవల ధృవీకరణ జరిగింది. కాగా చోక్సీ వెస్టిండీస్‌లో అతిచిన్న దీవి దేశం అంటిగ్వా బార్బుడా పౌరసత్వం పొందాడు. భారత ప్రభుత్వ అనుమతితోనే అతడు దేశం మార్చేశాడు. అయితే బ్యాంకు దగా కేసు బయట పడక మునుపు అందుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విజయ మాల్యాను స్వదేశానికి రప్పించే కేసు లండన్ కోర్టులో సాగుతూండగా, నీరవ్ మోడీ అరెస్టుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. మెహెల్ చోక్సీ విషయంలో భారత్‌కు సహకరిస్తామని అంటిగ్వా చెప్పింది. కాని లలిత్ మోడీ విషయంలో ఎటువంటి ప్రయత్నం లేదు. సారవ్ దాస్ అనే విద్యార్థి ఆర్‌టిఐ క్రియాశీలికి హోంశాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ (డిఒపిటి), విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అందిన సమాధానాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.
లలిత్ మోడీ కేసును పరిశీలిస్తే, అతనికీ మరో ఆర్గురికి వ్యతిరేకంగా బిసిసిఐ గౌరవ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ ఫిర్యాదుపై తమిళనాడు స్టేట్ పోలీసు క్రైం బ్రాంచి 2010 అక్టోబర్ 13న కేసు రిజిస్టర్ చేసుకుంది. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) 2012 డిసెంబర్‌లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు దాఖలు చేసింది. అయితే తమిళనాడు పోలీసు ఛార్జిషీటు దాఖలు చేయనందున ఇడి ముందుకు సాగలేదు. ఈ కేసు ‘భౌగోళిక పరిధి’ తమది కాదని, ముంబై పోలీసులదన్న నిర్ధారణకు రావటానికి తమిళనాడు పోలీసుకు దాదాపు ఏడేళ్లు పట్టింది. అయితే తమ పరిధిలోనిది కాదంటూ ముంబై పోలీసు కొద్ది రోజుల్లోనే ఫైళ్లను తమిళనాడు పోలీసుకు తిప్పి పంపింది. మరింత న్యాయ సలహా తీసుకున్న సిబిసిఐడి కేసును సిబిఐకి నివేదించాలని 2017 అక్టోబర్ 31న కేంద్ర హోంశాఖకు సిఫారసు చేసింది. దాన్ని నవంబర్ 16న డిఒపిటికి పంపినట్లు హోం శాఖ ఆర్‌టిఐ కార్యకర్తకు సమాధానమిచ్చింది. ఆ ప్రతిపాదన ఇంకనూ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని డిఒపిటి తెలియజేసింది. లలిత్ మోడీని స్వదేశానికి రప్పించే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాయగా తమకు అటువంటి అభ్యర్థన అందలేదని సమాధాన మిచ్చింది.
లలిత్ మోడీ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు గుర్తు చేసుకోదగినవి. లండన్‌లో నివాసం కొరకు రాజె సహాయం చేశారని, కాగా పోర్చుగల్‌లో చికిత్స పొందుతున్న భార్యను పరామర్శించి వచ్చే నిమిత్తం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అతనికి వీసా కొరకు సుష్మా స్వరాజ్ తోడ్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తాను ‘మానవతా దృష్టితో” మాత్రమే సహాయం చేశానని సుష్మా స్వరాజ్ తన చర్యను సమర్థించుకుంటూ ప్రతిపక్షాల ఆరోపణను ఖండించారు.
లలిత్ మోడీ, ఇతర నిందితులు కుట్ర పూరితంగా బిసిసిఐని మోసం చేసి రూ. 425 కోట్లు, రూ. 125 కోట్లు, రూ. 200 కోట్లు, రూ. 3.5 కోట్లు సొంత లాభం పొందారన్నది వారిపై ఎఫ్‌ఐఆర్ ఆరోపణ.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో చలనం కలుగుతుందా?