అవహేళన చేసిన వారే సన్మానించారు

manహృదయాంతరాల నుండి ఉప్పెనలా ఉబికివచ్చే పదబంధాల కూర్పు ఉత్తమమైన పాట అవుతుంది.ఆ పాట సాహిత్యప్రియుల ఎదవీణను మీటుతుంది,ఉద్యమానికి ఊపిరవుతుంది,నిర్జీవ హృదయాల్లో జీవరసం అవుతుంది,మేధావుల మేధకు పదును పెడుతుంది,చివరికి సమాజానికి కర్తవ్యమార్గాన్ని నిర్దేశిస్తుంది.కొందరిచేతుల్లో కలం హలంగామారి అభ్యుదయభావాల పొలాన్ని అవలీలగా దున్నేస్తుంది.ప్రతిసారీ కలం పట్టినవాడి చదువే దాని బలం నిర్దేశించకనూ పోవచ్చు,దానికి ఉన్నతమైన ఉదాహరణ-వందల సంవత్సరాల ముందే రాబోయే ప్రపంచపోకడలను సరళమైన శైలిలో యోగి వేమన రచించి మనకందించిన పద్యాలు.సరిగ్గా ఆ కోవకు చెందిన వారే మిట్టపల్లి సురేందర్.చిన్న వయసులోనే సమాజాన్ని చదివి ఉన్నతవిలువలు ఒంటబట్టించుకున్నారు.తను నమ్మిన సిద్ధాంతాలతో సమాజానికి మార్గనిర్దేశనం చేస్తూనే,తన కలంతో అక్షరీకరించిన ప్రతి పాటనూ తన అంతరాత్మ ప్రభోధంగానే మలిచారు.రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాటకు సమైఖ్యరాష్ట్రంలో నంది అవార్డు అందుకున్నారు సురేందర్.ధైర్యం సినిమాలో పాటలరచయితగా సినీరంగ ప్రవేశం చేసి నేడు మరెన్నో కమర్షియల్ సినిమాలకు పాటలందించేదిగా,ఎంతో మంది యువగాయకులను తెలుగు సినీ కళామతల్లికి పరిచయం చేసేవిధంగా సాగుతుంది.సరికొత్త బాణీతో సినీరంగంలో సాగిపోతున్న సురేందర్ జీవితంలోని ఒడిదుడుకులు వారి మాటల్లోనే మన తెలంగాణ పాఠకులకోసం…
మూడుజిల్లాల్లో గడిచిన బాల్యం-మా సొంతూరు వరంగల్.నాన్న నర్సయ్య సింగరేణి ఉద్యోగి,అమ్మ మధునమ్మ గృహిణి.నాన్నకు అండర్‌గ్రౌండ్‌లో పని చేస్తూ అనారోగ్యానికి గురికావడంతో ఆ ఉద్యోగం వదిలి సొంతంగా వ్యవసాయం పనులు చూసుకునేందుకు సొంతూరికి వచ్చేశారు.నాకు ఇద్దరక్కయ్యలు ఒక అన్నయ్య.నాన్న వాళ్ళు వరంగల్ దగ్గరలోని చిన్న గ్రామానికి వెళ్ళడంతో నేను గొదావరిఖని దగ్గర 8ఇంక్లైన్ కాలనీలో మేనమామ వద్ద ఉండి ఆరవ తరగతివరకు చదువుకున్నాను.తర్వాత వరంగల్‌లో అమ్మ నాన్న వాళ్ళదగ్గరికి వెళ్లాను,అక్కడే ఏడవ తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదివి పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మానేశాను.మొత్తంగా చాలా చిన్న వయసులోనే వరంగల్,కరీంనగర్,ఆదిలాబాద్ మూడు జిల్లాల జీవితాలను,వివిధరకాల ప్రదేశాలను,మనుషులను చూశాను.ఈ అనుభవాలు నాకు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పాయి.అవే నాకు సమాజం పై అవగాహన ఏర్పడే విధంగా దొహదపడ్డాయి.
తుమ్మెద ఓ తుమ్మెదా పాటను అద్భుతంగా పాడేవాడిని- సింగరేణి ప్రాంతంలో పెరగడంతో నాలో కళారంగం వైపు అడుగులు వేయాలనే తపన పెరిగింది.నేను ఏడోతరగతిలో ఉన్నప్పుడు అవకాశం దొరికిన ప్రతివేదికపై పాటపాడేవాడిని.శ్రీనివాస కళ్యాణం సినిమాలోని తుమ్మెద ఓ తుమ్మెదా పాటను ఇష్టంగా పాడేవాడిని,దాన్ని అందరూ ఆస్వాదించేవారు.అలా కళారంగంపై మరింత ఆసక్తి పెరిగింది. పద్దెనమిది సంవత్సరాల వయసునుండే నాకు వచ్చిన ప్రతి ఆలోచనను పేపర్‌పై పెట్టేవాడిని.అలా నా జీవితంలో జరిగిన ఓ దుర్ఘటన నాలో కల్పించిన కలకలానికి అక్షరరూపం ఇచ్చాను అదే నా మొదటి పాట,నవమాసాలు మోసిన తల్లిప్రేమకు దూరం అయ్యాను.నవీన్ అన్నకు చూపిస్తే రికార్డింగ్ కోసం నన్ను నేర్నాల కిషోర్ దగ్గరకి పంపించారు,వడ్లకొండ అనిల్‌కుమార్ పాడారు అంతే మొదటి పాటే ఊహించని విజయాన్ని తెచ్చిపెట్టింది.
మొదటిపాటకే దిష్టిబొమ్మలు కాల్చారు – డైరెక్టర్ తేజ అంటే అభిమానం దాంతో వారిని కలవడానికి హైదరాబాద్ వచ్చాను.దిల్‌రాజు,వి.వి వినాయక్,నితిన్ నేను రాసిన పాట విని దాన్ని పాడిన అనిల్‌కుమార్‌ను అడిగి నన్ను పిలిపించారు. దిల్ సినిమాకోసం పాట రాసిచ్చాను కాని అందులో ఆ పాటరాలేదు.తిరిగి తేజ దగ్గరికి వెళ్ళి పాట ఇచ్చాను,అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో ధైర్యం సినిమాకోసం ఆ పాటను నేనే పాడాను(బై.పి.సి బద్మాసుపోరి బాగుంది మామో) అప్పుడు నాకు 102 డిగ్రీల జ్వరం ఉంది,తేజ ట్రీట్‌మెంట్ ఇప్పించారు.ఇక నా మొదటిపాటే దిష్టిబొమ్మలు కాల్చేవిధంగా వచ్చింది.
డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు- నా పాటకు రెమ్యునరేషన్ 40000 రూపాయలు తేజ నా స్నేహితుడికి పంపించి అందివ్వమని చెప్పారు కాని అతను నాకు డబ్బులు ఇవ్వలేదు.తేజకు థాంక్స్ చెప్పడానికి వెళితే డబ్బు అందిందా అని అడిగారు,అందిందని చెప్పాను.ఆ డబ్బు నాకు చేరిఉంటే ఇప్పటికి ఎంతో ఎత్తులో ఉండేవాడిని.నేనున్న రూం రెంట్ కట్టడానికి నా వద్ద డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడడంతో తిరిగి ఊరికి వెళ్ళాను.
మోసం నన్ను సమాజానికి ఉపయోగపడేవిధంగా మార్చింది- ఇంటికి వచ్చి చైతన్యగీతాలు రాయడం మొదలుపెట్టాను.2006 సంవత్సరంలో కే.సి.ఆర్ కాకతీయ యునివర్సిటీలో మనభాష-మన యాస అంటూ ఉద్యమాన్ని నడుపుతున్న సమయంలో నేనూ భాగం అయ్యాను.ఆనాటి నుండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకు కే.సి.ఆర్‌తో కలిసి అడుగులు వేశాను.ఉద్యమంలో నా పాటలేని వేదిక లేదు అంటే అతిశయోక్తికాదు.దాదాపు 200 చైతన్య ఉద్యమ గీతాలు రాశాను.నమ్మిన వాడు మోసం చేయడంతో నాలో ఏర్పడిన కసి నన్ను సమాజానికి ఉపయోగపడే విధంగా మార్చింది. సమైఖ్య రాష్ట్రంలో నంది అవార్డ్- చైతన్య గీతాలతో పాటుగా సినీ గీతాలు రాశాను.అందులో రాజన్న,పోరు తెలంగాణ సినిమాలకోసం రాసిన పాటలు గుర్తింపుతో పాటు నంది అవార్డ్‌ను అందించాయి.పోరు తెలంగాణ సినిమా కోసం రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాటకు సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా నంది అవార్డ్ అందుకున్నాను.
అనిత యెలిశెట్టి.

Comments

comments