అర కిలోమీటర్ దూరం…అరగంట ప్రయాణం…

 Contractors  Not Completed  RoadWorks In Mothkoor
మోత్కూరు: అరకిలోమీటర్ దూరం….. అరగంట ప్రయాణంగా మారింది. మోత్కూరు మండల కేంద్రంలోని పెద్దచెరువును మిని ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మిని ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డిలు ప్రారంభించి యేడాది గడిచి పోయింది. మిని ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికి సగం పనులు కూడా పూర్తి కాలేదు. చెరువుకట్ట వెడల్పులో భాగంగా కట్టపై ఉన్న బిటి రోడ్డును కాంట్రాక్టర్ తొలగించి మట్టితో చదును చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కట్టపై ఉన్న మోత్కూరు-తిరుమలగిరి ప్రధాన రహదారి బురద మయంగా మారింది. మోత్కూరు తహశీల్దార్, మండల పరిషత్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, విద్యుత్, ఐసిడిఎస్ కార్యాలయాలు చెరువుకట్ట అవతలి వైపు ఉండటంతో కార్యాలయాలకు వెళ్లే ప్రజలు, ఉద్యోగులు కట్టపై నుండే ప్రయాణించాల్సి ఉంటుంది. కట్టపై రోడ్డు బురద మయంగా, గుంతలుగా మారడంతో ప్రయాణికులు, ప్రజలు, ఉద్యోగస్తులు అర కిలోమీటర్ దూరం ప్రయాణాన్ని అరగంటకు పైగా కొనసాగిస్తూ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మిని ట్యాంక్‌బండ్‌లో భాగంగా కట్టపై నిర్మించాల్సిన డబుల్‌ బిటి రోడ్డును తక్షణం నిర్మాణం జరపాలని ప్రజలు కొరుతున్నారు.