అర్హులైన ప్రతి రైతుకు జీవిత బీమా

Successful farmer Scheme

18 నుండి 59 వయస్సు నిర్దారణ..
బి కేటగిరిలో ఉన్న రైతులు త్వరితగతిన ఆధార్‌ను అనుసంధానం చేయించండి
రైతుబీమా పథకాన్ని విజయవంతం చేయండి
రైతుసమన్వయ సమితి సదస్సులో కలెక్టర్ శ్వేతామహంతి

మన తెలంగాణ/వనపర్తి : రైతుజీవిత భీమా పథకం కింద అర్హులైన రైతులందరిచేత రైతు బీమా చేయించాలని కలెక్టర్ శ్వేతామహంతి కోరారు. రైతు జీవిత భీమా పథకంపై ఆత్మ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం వనపర్తిలోని ఎంవైఎస్ బంక్వెట్ హాల్‌లో రైతు సమన్వయ సమితి సభ్యులు,  వ్యవసాయ అధికారులకు ఉద్ధేశించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ శ్వేతామహంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతు జీవిత భీమా పథకం కింద 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సున్న రైతులు జీవిత భీమా చేసుకునేందుకు అర్హులన్నారు. వనపర్తి జిల్లాలో 94 శాతం భూములు ఎలాంటి  వివరాలు లేనివిగా గుర్తించి వాటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా పంపిణీ చేశామని తక్కిన 6 శాతం భూములు అటవీశాఖ భూములు, కోర్టు కేసులు, విస్తీర్ణంలో తేడాలున్న భూములున్నాయన్నారు. బి.కేటగిరిలో ఉన్న భూములను మరోసారి రికార్డుల ప్రకారం తనిఖీ చేసి 3 నెలల్లో పరిష్కరించడం జరుగుతుందని ఆ రైతులకు  కూడా జీవిత  బీమా వర్తిస్తుందన్నారు. రైతు జీవిత భీమా వయస్సును పెంచాలని వస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వయస్సు నిర్దారణకు ఆధార్‌ను పరిగణిస్తామని, పట్టాదారు పాస్‌బుక్‌ల్లో పేర్లు తప్పుంటే సరిచేసి ఇస్తామని తెలిపారు. 15 రోజుల్లో గ్రామాల వారిగా రైతుభీమా ఇంటింటి సర్వే నిర్వహించి రైతుభీమా పథకాన్ని విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.