అరెస్టులపై సుప్రీంకోర్టు జోక్యం

భీమకోరెగాం హింస కేసుకు సంబంధించి పూణె (మహారాష్ట్ర) పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులను సెప్టెంబర్ 6 వరకు అరెస్టు లేకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించటం హర్షణీయం. చరిత్రకారిణి రొమిలా థాపర్, అర్థశాస్త్ర వేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవికాజైన్ సహా ఐదుగురు మేధావులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశమిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్‌లు ఎ.ఎం. కాన్విల్కర్, డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం నుంచి జస్టిస్ మిశ్రా […]

భీమకోరెగాం హింస కేసుకు సంబంధించి పూణె (మహారాష్ట్ర) పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులను సెప్టెంబర్ 6 వరకు అరెస్టు లేకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించటం హర్షణీయం. చరిత్రకారిణి రొమిలా థాపర్, అర్థశాస్త్ర వేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవికాజైన్ సహా ఐదుగురు మేధావులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశమిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్‌లు ఎ.ఎం. కాన్విల్కర్, డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం నుంచి జస్టిస్ మిశ్రా ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్య ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో విలువైనది: “అసమ్మతి ప్రజాస్వామ్యానికి రక్షణ కవాటం. ఈ రక్షణ కవాటాలను మీరు అనుమతించకపోతే అది బద్దలవుతుంది”. భీమకోరెగాం ఘటన తదుపరి దాదాపు 9 మాసాలకు అరెస్టులు చేయటాన్ని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

పూణె పోలీసులు మంగళవారం ఉదయాన్నే ఐదు నగరాల్లో స్థానిక పోలీసు సహకారంతో 9 మంది పౌర హక్కుల కార్యకర్తల ఇళ్లపై దాడి చేసి, అనేక గంటలపాటు సోదాలు చేసి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. వారు హైదరాబాద్‌లో పెండ్యాల వరవరరావు (విరసం నాయకుడు), ఢిల్లీలో గౌతం నవలఖ (జర్నలిస్టు, పెంగ్విన్ రచయిత), ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్ (ఐఐటి కాన్పూర్ నుంచి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, చత్తీస్‌ఘడ్‌లో అదివాసీల భూములు ఎం.ఎన్.సిలు లాక్కోవటానికి వ్యతిరేకంగా, గిరిజన సంక్షేమం కొరకు గత 30 ఏళ్లుగా వారి కేసులు వాదిస్తున్న లాయర్), ముంబైలో వెర్నాన్ గోన్‌సాల్వెస్ (చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద లోగడ అరెస్టు చేయబడిన ఆయన ఐదేళ్ల జైలు జీవితం తదుపరి నిర్దోషిగా విడుదలైనారు, ఆయన భార్య సుశాన్ అబ్రహం హక్కుల రక్షణ లాయర్), థానెలో మరో క్రియాశీల కార్యకర్త అరుణ్ ఫెర్రీరా. మావోయిస్టు సానుభూతిపరులుగా పోలీసులు ఆరోపిస్తున్న హక్కుల కార్యకర్తలపై ఇది మూడు మాసాల్లో రెండవ దాడి. ఎల్గార్ పరిషత్‌లో “రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, అది హింసకు దారితీసిందన్న ఆరోపణపై జూన్ 6, 7 తేదీల్లో పూనె పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వారు సుధీర్ ధావలె, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రాత్, రోనా విల్సన్, షోమా సేన్. శ్రీపెరంబదూర్‌లో రాజీవ్ గాంధి హత్య పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయాలన్న పథకం ప్రస్తావన ఉన్నట్లుగా ఒక లేఖ వీరి వద్ద దొరికినట్లు పోలీసులు కోర్టుకు చెప్పారు. తాజాగా అరెస్టు చేసిన ఐదుగురిపై భీమకోరెగాం హింసకు ప్రోత్సాహంతోపాటు పై అభియోగం బనాయిస్తారేమో స్పష్టత లేదు.

మరాఠా పీష్వా పాలకులకు బ్రిటిష్ వారికి మధ్య భీమకోరెగాంలో జరిగిన యుద్ధంలో దళితులు బ్రిటిష్ వారి పక్షాన పోరాడి పీష్వా పాలన అంతానికి తోడ్పడ్డారు. ఆ ఘటన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత డిసెంబర్ 31న ఎల్గార పరిషత్ (సదస్సు) జరిగింది. ఆ మరునాడు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుతున్న దళితులపై మరాఠాలు దాడి చేశారు. హింసను రెచ్చగొట్టిన హిందూత్వ నాయకులు మిలంద్ ఎక్బోటె, సంభాజీ భిడేపై కేసుల దర్యాప్తు ముందుకు సాగకపోగా, హక్కుల కార్యకర్తలపై కేసులు పెట్టి, దానికి మోడీ హత్యకు కుట్ర లేఖను జోడించి అరెస్టుల పర్వం సాగిస్తున్నారు. ఆ లేఖ బూటక సృష్టి అని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఖట్జూ సహా 100 మందికిపైగా మేధావులు ఖండించారు. అరెస్టు చేయబడిన కార్యకర్తలు పోలీసుల దృష్టిలో మావోయిస్టు సహచరులు, పట్టణ మావోయిస్టులు.

తాజా అరెస్టులను ప్రజాస్వామ్యంపై, వాక్ స్వాతంత్య్రంపై దాడిగా కాంగ్రెస్, వామపక్షాలేగాక సుప్రసిద్ధ రచయితలు రామచంద్రగుహ, అరుంధతీరాయ్, కవితా కృష్ణన్, ఇంకా అనేక మంది మేధావులు ఖండించారు. “అణగారిన తరగతులకు న్యాయం కొరకు పోరాడుతున్న వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నంగా” ఈ అరెస్టులను ఖండించిన రచయితలు, విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తల్లో స్వామి అగ్నివేశ్, షబ్నం హష్మీ, తీస్థా సెతల్వాడ్, నివేదితా మీనన్ ఉన్నారు. మూక హంతకులు, ఏహ్య ప్రచారకులపై చర్యలు తీసుకోకుండా లాయర్లు, మేధావులు, దళిత క్రియాశీలురను అరెస్టు చేయటం రాజ్యాంగంపై నిరంతరం జరుగుతున్న సైద్ధాంతిక దాడిలో భాగమని అరుంధతీరాయ్ వ్యాఖ్యానించారు. ఈ మేధావులనూ ‘పట్టణ మావోయిస్టు’ లంటారా!