అమ్మపాలే పిల్లలకు అమృతం

Mothers-image

పిల్లలకు ముర్రుపాలు పట్టించాలి
ఎంపిపి మెండ వెంకటస్వామి

మన తెలంగాణ/మహాముత్తారం : తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారమని , శిశువుకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, రోగ నిరోధక శక్తిని ప్రసాదించే ఔషధమని ఎంపిపి మెండ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మహాముత్తారం మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే కొందరు తల్లులు పిల్లలకు పాలు పట్టేందుకు అసహ్యించుకుంటారని అవగాహన లేమితో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి తల్లులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 1నుంచి 7వరకు ‘తల్లిపాల వారోత్సవాలు’ నిర్వహిస్తోందన్నారు. ఎంతో విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డకు ఎంత వయస్సు వచ్చేదాకా ఇవ్వాలి..? రోజుకు ఎన్ని సార్లు ఇవ్వాలి..? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి..? తదితర అంశాలపై గర్భిణీలు, బాలింతలకు ఐసిడిఎస్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ మహాదేవ్‌పూర్ ఇన్‌చార్జి సిడిపిఒ సరస్వతి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే పాలు పట్టించాలని కోరారు. తల్లి ముర్రుపాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని. ప్రకృతి పరంగా.. కృత్రిమంగా లభించన పోషకాలెన్నో ఈ పాలల్లో ఉంటాయన్నారు. తల్లి పాల వలన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. తల్లి ముర్రుపాలు పడితే మెదడుకు సరైన పోషకాలు అందుతాయన్నారు. తల్లి ప్రసవించాక మూడు రోజుల పాటు తల్లిపాలు జిగట జిగటగా పసుపు రంగులో వస్తాయని చెప్పారు. వీటినే ముర్రుపాలు (కొలస్ట్రా) అంటారన్నారు. ఈ పాలాల్లో ఎ,డి,సి,కె,ఈ తదితర విటమిన్లు, కొవ్వు, చక్కెర, ప్రోటీన్లు ఉంటాయని, ఈ పాలు తాగిన పిల్లల్లో క్యాన్సర్, బిపి, గుండె జబ్బులను తట్టుకునే శక్తి పెరుగుతుందని, పైగా తల్లికి రొమ్ము క్యాన్సర్ దూరమవుతుందని బాలింతలు, గర్భిణీలకు వివరించారు. పిల్లలకు డబ్బాపాలు పట్టడం ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు మార్క రాముగౌడ్, ఇఒఆర్‌డి వై.భాస్కర్‌రావు, ఐకెపి ఇన్‌చార్జి ఎపిఎం మాధవి, మాజీ సర్పంచ్ తాటి అనసూర్య అంగన్‌వాడీలు జయప్రద, రాజేశ్వరి, శ్యామల మండలంలోని అన్ని గ్రామాల అంగన్‌వాడీలు, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు.
కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడంతో పాటు తల్లి పాలే పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి శ్రేయస్కకరం అన్నారు. తల్లులు తమ పిల్లలకు తల్లిపాలనే ఉపయోగించి పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఎఎన్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.