అమెరికా అసంబద్ధ నిర్ణయాలు

         అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కిన కొమ్మనే నరుక్కునే మూర్ఖుని తలపిస్తున్నాడు. పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రంలా, శత్రువునీ, మిత్రుడినీ ఒకే గాటన కడుతున్నాడు. ఒకవైపు చైనాతో వాణిజ్య యుద్ధాన్ని సాగిస్తున్న అమెరికా భారత దేశం మీద కూడా అకారణమైన ప్రతికూల నిర్ణయాల బాణాలను సంధిస్తున్నది. ఈ దిశగా ఇటీవల మూడు వరుస నిర్ణయాలను ప్రకటించింది. ఇండియా, మరి ఏడు దేశాలకు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులకు లభిస్తూ వచ్చిన స్వేచ్ఛను […] The post అమెరికా అసంబద్ధ నిర్ణయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

         అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కిన కొమ్మనే నరుక్కునే మూర్ఖుని తలపిస్తున్నాడు. పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రంలా, శత్రువునీ, మిత్రుడినీ ఒకే గాటన కడుతున్నాడు. ఒకవైపు చైనాతో వాణిజ్య యుద్ధాన్ని సాగిస్తున్న అమెరికా భారత దేశం మీద కూడా అకారణమైన ప్రతికూల నిర్ణయాల బాణాలను సంధిస్తున్నది. ఈ దిశగా ఇటీవల మూడు వరుస నిర్ణయాలను ప్రకటించింది. ఇండియా, మరి ఏడు దేశాలకు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులకు లభిస్తూ వచ్చిన స్వేచ్ఛను అరికట్టాలని అమెరికా గత ఏప్రిల్‌లో తీసుకున్న నిర్ణయం మొదటిది కాగా, రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దాని నుంచి ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి వీల్లేదని జారీ చేసిన ఫర్మానా రెండవది, తన వాణిజ్య ప్రాధాన్య దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం మూడవది.

ట్రంప్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అరికట్టే వ్యూహంలో ఇండియాకు విశేష ప్రాధాన్యం ఇవ్వడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే. ఇప్పుడు అది తీసుకున్న ఈ నిర్ణయాలు భారత్‌ను కూడా వ్యతిరేక దృష్టితోనే అమెరికా చూస్తున్నదని రుజువు చేస్తున్నాయి. ఒబామా హయాంలో మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి ట్రంప్ ప్రభుత్వం ఏకపక్షంగా వైదొలగిన తర్వాత దానిపై ఆంక్షలను తిరిగి విధించింది. అప్పుడు ఇండియాను మరి ఏడు దేశాలను ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో ఆంక్షల ప్రభావం నుంచి మినహాయించింది. మరి కొంత కాలం పాటు ఇరాన్ నుంచి క్రూడాయిల్‌ను కొనుక్కునే అవకాశం వీటికి కల్పించింది. భారత దేశం తన చమురు కొనుగోళ్లలో 10 శాతం మేరకు ఇరాన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నది. ఇప్పుడు అమెరికా విధించే ఆంక్షల భయంతో ఇరాన్ ఆయిల్ కొనుగోలును మానుకుంటే అది భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

అంత సౌకర్యవంత మైన ప్రత్యామ్నాయ ఆయిల్ విక్రయదారు మనకు లభించరు. అంతేకాదు ఇరాన్‌తో మనం పెనవేసుకుంటున్న వ్యూహాత్మక అనుబంధం కూడా దెబ్బ తింటుంది. చిరకాలంగా మనకు విశ్వసనీయ మిత్రుడుగా నిరూపించుకుంటున్న రష్యా నుంచి ఇంతకుముందే కుదర్చుకున్న ఒప్పందం మేరకు ఎస్ 400 క్షిపణి రక్షక వ్యవస్థలను కొనుగోలు చేయడానికి వీల్లేదని అమెరికా ఆజ్ఞాపించడం ఒక రకంగా మన సార్వభౌమాధికారం మీద ప్రయోగించిన నిరంకుశ అస్త్రమే. ఒకప్పుడు ఆయుధాలకు పూర్తిగా సోవియట్ మీద ఆధారపడిన భారత్ ఇప్పుడు అమెరికా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నది. 2012 నుంచి 2017 వరకు గల ఐదేళ్ల్లలో అమెరికా నుంచి భారత్ ఆయుధ కొనుగోళ్లు 550 శాతం పెరిగాయి. అమెరికా నుంచి అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాలలో రెండవ స్థానాన్ని ఇండియా ఆక్రమించుకున్నది.

అమెరికాతో వాణిజ్యంతో భారత్ 21 బిలియన్ డాలర్ల మేరకు పైచేయిగా ఉన్నది. మరిన్ని దిగుమతులు చేసుకోడం ద్వారా ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తు న్నది. అమెరికా జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫెరెన్సెస్ (జిఎస్‌పి) అనే వాణిజ్య ప్రాధాన్య కార్యక్రమం నుంచి ఇండియాను తొలగించడం వల్ల ఈ సరళి దెబ్బ తింటుంది. ప్రత్యేక వాణిజ్య హోదా సౌకర్యం కింద అమెరికాకు మన ఎగుమతుల్లోని 10 శాతం సామగ్రిని ఎటువంటి సుంకాల్లేకుండా పంపించుకోగలుగుతున్నాము. ఒక్క 2017లోనే దీని కింద 5.7 బిలియన్ డాలర్ల వస్తువులను అమెరికాకు ఎగుమతి చేయగలిగాం. ఈ హోదాను మనకు రద్దు చేయడం వల్ల ఇక ముందు ఈ సామగ్రిపై అమెరికా సుంకాలు విధిస్తుంది. అది మన ఎగుమతి వ్యాపారుల మీద అసాధారణ ఆర్థిక భారాన్ని వేస్తుంది. భారత దేశం తన సువిశాల మార్కెట్‌లో అమెరికన్ సరకులకు తగినంత చోటు ఇవ్వడం లేదనే సాకు చూపి ట్రంప్ ఈ అసాధారణ చర్యకు తలపడ్డాడు.

చైనా చేసినట్టే మనం కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద అదనపు సుంకాలను విధించి వాషింగ్టన్‌తో వాణిజ్య యుద్ధానికి తెర లేపవచ్చు. కాని అటువంటి సూచనలు కనిపించడం లేదు. సఖ్యతతో చర్చల ద్వారా అమెరికా వైఖరిలో మార్పు తీసుకురావాలనే విజ్ఞతాయుతమైన ఆలోచనలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ 1 ప్రభుత్వం అమెరికాతో మరింత సత్సంబంధాలను ఆశించి అందుకనుగుణంగా అడుగులు వేసింది. మోడీ స్వయంగా ట్రంప్ తో గాఢమైన మైత్రిని కోరుకున్నారు. కాని ట్రంప్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు అనువుగా లేవు. ట్రంప్ కనబరుస్తున్న ఈ పోకడలు అంతిమంగా అమెరికాను ఏకాకిని చేసి మిగతా ప్రపంచానికి దూరంగా జరిపితే ఆశ్చర్యపోనవసరం లేదు.

US to end sanctions exemptions for major importers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమెరికా అసంబద్ధ నిర్ణయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: