అమెరికాతో మరింతగా రక్షణ బంధం

India looks to America for help with aerial protection

అమెరికా భారత్ రక్షణ బంధం మరింత బలపడింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి చర్చల సందర్భంలో (2+2) సంతకాలు జరిగిన ‘కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (COMCASA) ద్వైపాక్షిక సైనిక భాగస్వామ్యంలో మరింత సన్నిహిత సహకారానికి బాటవేస్తుంది. ఇరు దేశాల రక్షణ మంత్రులు జేమ్స్ ఎన్ మాటిస్, నిర్మలా సీతారామన్; విదేశాంగ మంత్రులు మిఖాయిల్ ఆర్ పాంపియో, సుష్మా స్వరాజ్ మధ్య చర్చలు 2+2 సంభాషణగా పిలవబడుతున్నాయి. ఇటువంటి సమావేశం ఇదే ప్రథమం. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య ‘హాట్‌లైన్’ల ఏర్పాటు, 2019లో భారత్ తూర్పు సముద్రంలో ఇరు దేశాల త్రివిధ సైనిక దళాల సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ సంతకాలు జరిగిన మరో రెండు ఒప్పందాలు. ఇటువంటి సైనిక విన్యాసాలు కూడా ఇదే ప్రథమం. అమెరికాతో అనేక సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్న నాలుగు ప్రధానమైన రక్షణ ఒప్పందాల్లో కంకసా మూడవది. సైనిక సమాచారంపై సాధారణ ఒప్పందంపై (GSOMIA) 2002లో, లాజిస్టిక్స్ ఎక్సేంజి మెమొరాండం ఒప్పందంపై (LEMOA) 2016 లో సంతకాలు జరిగాయి. మన దేశ సైనిక వ్యవస్థల్లో ప్రవేశించిన అమెరికన్ తయారీ సి. 17, సి 130, పి. 81 విమానం వంటి వ్యవస్థల్లో ఇరు దేశాలు మాత్రమే సమాచార మార్పిడి చేసుకునేందుకు ప్రత్యేకించిన యంత్రాలను అమెరికా సరఫరా చేసేందుకు కంకసా వీలు కల్పిస్తుంది. అయితే మన సైనిక సమాచార గోప్యతకు దీనివల్ల విఘాతం ఏర్పడుతుందన్న భయాందోళనలు లేకపోలేదు. పదేళ్లపాటు అమలులో ఉండే కంకసా ఒప్పంద పాఠం గోప్యం. అయితే అమెరికా సరఫరా చేసే యాంత్రిక వ్యవస్థలతో మనకు పూర్తి సంబంధం ఉంటుందని, సరఫరాలకు విఘాతాలు ఉండవని, వాటి ద్వారా సేకరించిన సమాచారం మన దేశం అనుమతి లేకుండా ఏ వ్యక్తికి లేదా సంస్థకు వెల్లడించటం, బదిలీ చేయటం జరగకుండా అందులో హామీలు పొందుపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికా రక్షణ పరిశ్రమతో భారత ప్రైవేటు పరిశ్రమ భాగస్వామ్యాన్ని అనుమతించే పారిశ్రామిక భద్రత అనెక్స్ (ఐఎస్‌ఎ) సంప్రదింపులు ప్రారంభించేందుకు ఇరు దేశాల రక్షణ మంత్రులు సంసిద్ధత ప్రకటించారు.
మన దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రెండు అంశాలపై అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపులు పొందాల్సిన సందర్భంలో మన మంత్రులు అటువంటి ఒత్తిడి చేయకుండా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూతల ఒత్తిడికి లొంగినట్లు కనిపిస్తున్నది. మన సైనిక దళాలకు యుద్ధ సామాగ్రి సరఫరాలో దీర్ఘకాలంగా అగ్రస్థానంలో ఉన్న రష్యాను వెనక్కునెట్టి అమెరికా ప్రథమ స్థానంలోకి వచ్చింది. అయినా భారత ప్రభుత్వం రష్యా, ఫ్రాన్స్ వంటి ప్రధాన ఆయుధోత్పత్తి దేశాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నది. అమెరికాతో యుద్ధ క్రీడలో సమన్వయం పెరిగే కొద్ది ఈ అవకాశాలు తగ్గి అమెరికాపై పూర్తిగా ఆధారపడే పరిస్థితులు భవిష్యత్‌లో ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు.
6 బిలియన్ డాలర్లు వెచ్చించి రష్యా నుంచి ఎస్ 400 రకం గగనతల రక్షణ మిస్సిలీల కొనుగోలుకు భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. “కౌంటరింగ్ అమెరికాస్ యాడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్‌” (CAATSA) ద్వారా అమెరికా దీన్ని అడ్డుకునే ప్రమాదముంది. రష్యాపై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం నుండి ఆయుధాలను, ఇరాన్‌పై ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి ఆయిలును కొనరాదని ట్రంప్ ఆంక్ష పెట్టాడు. ఈ రెండు ఆంక్షల నుంచి భారత్ మినహాయింపు కోరుతోంది. ఎస్ 400 మిస్సిలీల కొనుగోలుకు మినహాయింపు ఇవ్వటంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పాంపియో ఢిల్లీలో చెప్పారు. ఇరాన్‌తో అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన ట్రంప్ దాన్ని శిక్షించేందుకు విధించిన ఆయిలు ఆంక్షలు నవంబర్ 4 నుంచి అమలులోకి రానున్నాయి. ఇరాన్ నుంచి ఆయిలు కొనుగోలుకు వీలు కల్పిస్తూ ట్రంప్ మినహాయింపు ఇవ్వకపోతే రూపాయి విలువ అధమ స్థితితో అస్తుబిస్తు అవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా ఇబ్బందులపాలవుతుంది. అమెరికాతో వాణిజ్యంలో 23 బిలియన్ డాలర్ల మిగులులో ఉన్న భారత్ స్థితిని తగ్గించేందుకుగాను అమెరికా నుంచి వచ్చే మూడేళ్లపాటు ఏటా 10 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లను పెంచాలని ట్రంప్ ఒత్తిడి చేస్తుండగా, భారత ప్రభుత్వం పై రెండు ప్రధానాంశాల్లో మినహాయింపులు సాధించలేకపోగా అమెరికాతో మరింతగా రక్షణ బంధంలో బిగుసుకుంది.