అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 Vardannapeta constituency is developed in all spheres

మనతెలంగాణ/హసన్‌పర్తి : వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గంగా నిర్మిస్తామని వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్‌లు అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్‌లోని టిఎన్‌జిఒస్ కాలనీ, లక్ష్మినగర్, ఎఫ్‌సిఐ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఓం సాయికాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపి దయాకర్, నగర మేయర్ నరేందర్‌లు మాట్లాడుతూ నగరంలో రూ.వందల కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీల పనులు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా జిడబ్లుఎంసి నిధుల నుంచి రూ.35 లక్షలు, సిఎం నిధుల నుంచి రూ.65 లక్షలతో కాలనీలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలోనే దేశంలోనే నెం.1 స్థానంలో నిలిచిందన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందే వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారన్నారు.
గోపాలపూర్‌ను దత్తత తీసుకుంటున్నాం
ఎంఎల్‌ఎ రమేష్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్‌లో 46వ డివిజన్‌లో ఉన్న గోపాలపూర్‌ను ఈరోజు దత్తత తీసుకుంటున్నానని తెలిపారు. 46వ డివిజన్‌లోని పలు కాలనీలలో సమస్యలు తెలుసుకొని ఇప్పటికే ప లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజు ల్లో ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌లను పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. నాణ్యత, బాధ్యత పూర్తిగా అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో సిరంగి సునీల్‌కుమార్, డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షులు బైరి వెంకటరాజ్యం, టిఆర్‌ఎస్ నాయకులు చల్ల వెంకటేశ్వర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, మంచూరి విజయ్‌కుమార్, డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.