అభాగ్యులకు బాసటగా ఆమె ప్రస్థానం..

Basti peoples was the Kameshwari my family

ఆమె సాహిత్య కుటుంబంలో పుట్టింది. నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుంది ‘దిక్కూమొక్కూ లేని జనం’ కోసం ఆమె ఆరాటం. తను రాసే రచనలన్నీ సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రజలను అజేయులుగా నిలబెడతాయి. రచన మాత్రమే కాదు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, సమస్యలను ఎత్తి చూపుతూ మెట్రో నగరాల్లో కనీస అవసరాలు, కూడు, గూడు, గుడ్డ లేని వారి జీవితాలను ఈ సమాజానికి పరిచయం చేయాలని ‘అభాగ్యజీవనాల భాగ్యనగరం’ అంటూ అక్షరరూపం దాల్చింది. వారి జీవితాలను బాగుపరచడానికి తనకు సాధ్యమైనంత వరకూ కృషి చేస్తానంటూ, మురికివాడల బస్తీలకు అడుగులు వేస్తున్న ప్రముఖ మహిళా రచయిత సామాజికవేత్త ఆలూరి కవిని. మెట్రో నగరాల్లో జీవించే బస్తీ కుటుంబాల దీన పరిస్థితుల గురించి వివరిస్తూ , ప్రజలే నా కుటుంబం అంటూ సకుటుంబంతో ముచ్చటించారు.

మీ కుటుంబం, బాల్యం, చదువు గురించి..?
నాపేరు ఆలూరి కామేశ్వరి. కాని కామేశ్వరి పేరుతో కవితలు వ్యాసాలు రాస్తే మా అత్తగారు వద్దన్నారు. దాంతో మానాన్న కవిని పేరుతో రాయమన్నారు. ఇక అప్పటి నుండి నా పేరు కవినిగా మారిపోయింది. మా నాన్న ఆలూరి భుజంగరావు అమ్మ లలిత పరమేశ్వర్. మేము ఐదుగురం పిల్లలం. మా నాన్న ఉపాధ్యాయుడు, రచయిత. మా ఇంట్లో సాహిత్య వాతావరణమే ఉండేది. ఇప్పటికి నా ఇల్లు కూడా అలాగే ఉంది. నా చిన్న తనంలో నాన్న మాకు ట్యూషన్ చెప్పేవారు. మేము చిన్న పిల్లలమైనప్పటికీ మా కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అందరి అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునేవారు. అలా మాలో ఉన్న అనుమానాలను, బయటకి తీసి వాటి గురించి వివరంగా చెప్పేవారు. ఇంటిలో అంతా ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. సాహిత్య పరమైన మీటింగ్‌లకు తీసుకెళ్లేవారు. నేను రెండు ఏంఏలు, బిఈడి, ఎంఫిల్ చేశాను. ప్రస్తుతం హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. నాకు పద్దెనిమిదిఏళ్ల వయసులో పెళ్లైంది. మాది ఆదర్శ వివాహం. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత పగలంతా పిల్లలను చూసుకుని, రాత్రంతా చదువుకున్నాను.

‘అభాగ్యజీవనాల భాగ్యనగరం’ గురించి..?
ఇంతకు ముందు మేము బతుకమ్మకుంటలో ఉండే వాళ్లం.అక్కడ చాలా గుడిసెలు ఉండేవి. రోజూ నేను వచ్చి పోయేదారిలో గుడిసెల్లో జీవనం గడిపే వారిని చూసుకుంటూ వెళ్లేదాన్ని. బస్తీలో మాసిన బట్టలు, ఆకలి దారిద్య్రంతో నిండి ఉండేవి. కొన్ని దృశ్యాలు నన్ను ఎంతో వేదనకు గురి చేశాయి. ఆ బస్తీలో పానిపూరీ బండి ఉండేది. కొంతమంది పిల్లలు ఆ బండి దగ్గరకు వెళ్లి రెండు చేతులు చాచి పానీపూరి అడుక్కునే వారు. అతను ఒక మూరెడు కట్టె పట్టుకుని వాళ్లను బండి దగ్గరకు రావద్దని కొట్టేవాడు. వాళ్లొస్తే గిరాకీ రాదని అయన చెప్పేవాడు. ఒకరోజు పిల్లలు మట్టిలో ఆడుకుంటూ మట్టి తింటున్నారు. మట్టి తినొద్దని చెబితే ఆ పిల్లల తల్లి “తినకుండా ఏం చేయమంటావు తినడానికి తిండి దొరక్కపోతే మట్టి కాక ఇంకా ఏం తినమంటారు” అని దుఃఖ స్వరంతో చెప్పింది.

మనం ఒక చిన్న పురుగు కనిపిస్తే ఆ ఆహారాన్ని పడేస్తాం. వారికి అన్నంలో పురుగులు వస్తే వాటిని తొక్కలుగా భావించి తీసిపారేసి తినడం చూశాను. ఒక వైపు సమాజంలో తిన్నది అరగని మనుషులు, ఇంకోవైపు తిండి దొరకని మనుషులు. ఈ సమాజం ఎందుకు ఇలా ఉంది. ఈ మెట్రోనగరాల్లో ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నా సరిపోవట్లేదని అంటారు. మరి ఆ చిన్న గుడిసెలో వాళ్లు ఎట్లా జీవిస్తున్నారో ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి సందర్భాలెన్నో నన్ను వేదనకు గురిచేశాయి. ఈ నిచ్చనమెట్ల సమాజం ఎందుకిలా ఉంది అనే ప్రశ్న నన్ను వెంటాడింది. నాకు సాధ్యమైనంత వరకూ వారికి న్యాయం చేయాలని నా అడుగులు వాళ్ల బస్తీల వైపు కదిలాయి ..

బస్తీల జీవన విధానం గురించి మీ సర్వే ఉద్దేశం ఏమిటి..?
చాలా సంపద ఉన్నవాళ్ల ప్రేమల కంటే వారి ప్రేమలు గొప్పగా ఉంటాయి. మానవవిలువలు ఉన్నతంగా ఉంటాయి. బస్తీలో ఉండే పిల్లలు ముఖ్యంగా మహిళలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేక ఇండ్లలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. మేకల తోళ్లకు ఉప్పుపెట్టి ఇస్తే ఒక తోలుకి రెండు రూపాయలు ఇస్తే ఆ వచ్చే ఆదాయంతో జీవనం గడుపుతుంటారు. ఎక్కువగా ముస్లిం మహిళలు ఈ పని చేస్తుంటారు. ఇంత అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో వాళ్ల జీవితాలు ఎందుకు మారట్లేదు అనేది నా ప్రశ్న.

మురికి వాడలు, వారి కష్టాలను, వారు పడుతున్న బాధలను ఈ సమాజానికి ప్రభుత్వాలకు తెలియజేయలనుకున్నాను. ఇప్పటివరకూ బస్తీవాసుల గురించి ఒక క్రమబద్ధమైన సర్వే జరగలేదు. నా వంతుగా నేను వారి అభివృద్ధి కోసం పని చేయాలను కున్నాను. ప్రజల చరిత్ర అక్షర బద్ధం చేస్తే ఆ చరిత్ర కొన్ని తరాలకు కనువిప్పు కలిగిస్తుంది. మళ్లీ అవి పునర్నిర్మాణం జరుగుతాయి. అందుకే నేను చాలా బస్తీలు నందనవనం, ఎల్లమ్మగడ్డ, బోరబండ, బండ్లగూడ, గుడిమల్కాపూర్, గౌస్‌నగర్, వాంబేకాలని ఇలా ఎన్నో మురికి వాడలు తిరిగాను. వారి దీన పరిస్థితులను అక్షర రూపంలో తెలియజేస్తు నాకు సాధ్యమైనంత వరకూ వారికి న్యాయం జరిగేటట్లు చేస్తున్నాను.

మీరు రాసిన పుస్తకాలు, మీ సాహిత్యం గురించి..?
మా నాన్న ఎప్పుడూ ఆధ్యయనం చేయాలని “ఆధ్యయనంతోనే జ్ఞానం వస్తుందని” చెప్పారు. చిన్నప్పుడే నేను నాదేశం, రక్తాక్షరాలు, చర్చ’ వంటి పుస్తకాలు చదివి ఏడో తరగతి లోనే “ ఉన్నవాళ్లు గొప్ప వాళ్లా” అనే కవిత్వం రాశాను. చిన్నప్పటి నుండి చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు, నా రచనకు, సాహిత్యానికి గురువు మా నాన్నే. ఆయన మొదలు పెట్టిన ‘వైజ్ఞానిక, గతితార్కిక భౌతిక వాదం” ఈ తెలుగు సమాజానికి అందిచాల్సిన పుస్తకం అనేవారు. తరువాత ఆయన ఆరోగ్యం సహకరించలేదు. ఆ పుస్తకాన్ని నేను కొనసాగించి పూర్తి చేశాను. సంస్కృతం, హిందీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేస్తాను. ఇప్పటివరకూ ఇరవై ఐదు రాజకీయ వ్యాసాలు, ఐదు పుస్తకాలు రాశాను. తెలంగాణ ఉద్యమంలో ‘పోరాడితేనే రాజ్యం’ పుస్తకం రాసినపుడు ఆ పుస్తకం నన్ను నాలో ఉన్న రచయితను నిద్రలేపింది. ‘అభాగ్యజీవనాల భాగ్యనగరం’ రాశాను. శ్రమజీవుల గురించి ఒక పుస్తకం రాస్తూ, రాహుల్ సాంకృత్యయన్ (బాగో నహీ దునియాకి బదుల్) ‘పారిపోకు ప్రపంచాన్ని మార్చుకో” అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను.

మహిళా రచయితగా ఈ రోజుల్లో మహిళల కుటుంబాల పరిస్థితులు ..?
మహిళలకు ఇంటా బయటా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కుటుంబంలో ఒక రకమైన హింస అయితే, ఉద్యోగం చేసే దగ్గర మరో రకమైన హింస. స్త్రీపురుష సమానత్వం అంటున్నాం కానీ అది మాటల్లో తప్ప ఆచరణలో కనిపించటం చాలా అరుదు. ప్రపంచీకరణ తరువాత మహిళల శ్రమను ఎక్కువగా దోచుకుంటున్నారు. ఈ మాయల మార్కెట్ ప్రపంచం పిల్లలను చాలా రకాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. డిగ్రీలు, పీజీలు చదువుకున్న పిల్లలకు కూడా సమాజం మీద కనీస అవగాహన ఉండట్లేదు. ఊహల ప్రపంచంలో తేలిపోతున్నారు. నిజ జీవితంలో ఏది మంచి ఏది చేడు అనే విజ్ఞానం పెరగట్లేదు. స్వార్థపూరితమైన ఆలోచనల ధోరణి ఎక్కువవుతుంది.

మన వంతు సమాజానికి మంచి చేద్దాం అనే వారు చాలా తక్కువ. కొన్ని కుటుంబాల్లో వారి జీవితాలను ఇంటికి మాత్రమే పరిమితం చేసే వాళ్లు లేకపోలేదు. ప్రధానంగా నేను రచనలు చేసి పరిశోధించి శోధించి ప్రజలకు అందించాలనుకుంటున్నాను. చెప్పడమే కాదు ఆచరణలో పెట్టే పనిలో ఉన్నాను. ఆడ పిల్లలకు సాధ్యమైనంత వరకు ప్రోత్సాహం అందిస్తూ , నేను రాష్ట్రంలో ఉన్న మహిళ కాలేజీలకు వెళ్లి పిల్లలకు చాలా విషయాల మీద చర్చలు లేవనెత్తి వారికి అవగాహన కల్పిస్తుంటాను. ఈ ఆధునిక ప్రపంచంలో కొంత మంది పురుషుల మానసిక స్థితి పరిణతి చెందక వారిలో మహిళల పట్ల హింసారూపం పెరుగుతుంది. చివరగా నా మాట మానవ సమాజం ఊహల్లో కాకుండా వాస్తవికంగా జీవించాలి. పిల్లలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ తప్పుదోవ పట్టించొద్దు. అలాంటి వాటి నుండి కాపాడి, అందరికీ కనీస వసతులు కల్పించి. ఆకలి బాధలు లేని సమ సమాజాన్ని నిర్మిద్దాం.