అప్పుడే నటీనటులను గుర్తుంచుకుంటారు

సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. పవన్‌కుమార్ దర్శకత్వంలో ఈ మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ చిత్రం ఈనెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లాతో ఇంటర్వూ విశేషాలు… థ్రిల్ ఫీలయ్యాను… ‘యు టర్న్’ ఒరిజినల్ మూవీ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు పవన్‌కుమార్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించి తెలుగు వర్షన్ స్క్రిప్ట్ వినిపించినప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. ముఖ్యంగా తెలుగు […]

సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. పవన్‌కుమార్ దర్శకత్వంలో ఈ మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ చిత్రం ఈనెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లాతో ఇంటర్వూ విశేషాలు…

థ్రిల్ ఫీలయ్యాను…
‘యు టర్న్’ ఒరిజినల్ మూవీ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు పవన్‌కుమార్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించి తెలుగు వర్షన్ స్క్రిప్ట్ వినిపించినప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన స్క్రిప్ట్‌ను తయారుచేసిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే ఈ సినిమా చేస్తున్నానని ఆయనతో చెప్పాను.
హ్యాపీగా ఉన్నాను…
సినిమాలో నా పాత్ర చాలా ముఖ్యమైనది. కథలో నా క్యారెక్టర్ మిళితమై ఉంటుంది. ఈ పాత్రలో నటించడంతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా కెరీర్‌లో గుర్తుపెట్టుకునే పాత్ర ఇది అవుతుంది. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు మా దర్శకుడితో చాలా చర్చించాను. ఏ సందర్భంలో ఎలా నటించాలనే విషయాలను మాట్లాడాను.
ఆమె పవర్‌ఫుల్ నటి…
సమంతతో కలిసి నటించడం నాకు మంచి అనుభూతినిచ్చింది. ఆమె నటించిన ఈగ, రంగస్థలం సినిమాలు చూశాను. ఆమె పవర్‌ఫుల్ నటి సమంత సెట్‌లో చాలా సరదాగా ఉంటుంది. కానీ ఒకసారి మేకప్ వేసుకున్నాక పూర్తిగా క్యారెక్టర్‌లోకి వెళ్లిపోతుంది. హావభావాల నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింటినీ అకస్మాత్తుగా మార్చుకోవడమంటే మామూలు విషయం కాదు. ‘యు టర్న్’ సినిమా సమంత కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
నా పాత్ర అలాగే ఉండాలి…
సినిమాలో నా పాత్ర ఎంత సేపు ఉన్నా… నేను చేస్తున్న పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నానా? లేదా? అనేది మాత్రమే చూసుకుంటాను. ఎందుకంటే సినిమాకు పాత్ర వ్యవధి ముఖ్యం కాదు. నటించిన కొన్ని సన్నివేశాలైనా సినిమా మీద చాలా ప్రభావం చూపించాలి. నేనే చేసే పాత్ర అలాగే ఉండాలని కోరుకుంటాను. అప్పుడే ప్రేక్షకులు నటీనటులను గుర్తుంచుకుంటారు.
వారిని కోరుతున్నది ఒక్కటే…
కాలం వేగంగా మారిపోతోంది. అందుకు తగ్గట్లుగానే సినిమాలు, సినిమాల్లోని పాత్రలు కూడా చాలా వరకు మారుతూ వస్తున్నాయి. అయితే నేను రచయితలను కోరుతున్నది ఒక్కటే. 30, 40 ప్లస్ నటీమణుల కోసం మరిన్ని మంచి పాత్రలు రాయాలని కోరుతున్నా. అప్పుడు మాత్రమే మంచి కథలు మరుగున పడకుండా వెలుగులోకి వస్తాయి. హిందీలో విద్యాబాలన్ నటించిన ‘తుమ్హారీ సులు’ వంటి మంచి చిత్రాలు తెలుగులోనూ వస్తాయి.
నేను కూడా మారుతున్నా…
ఈమధ్య నాకు చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే, అభిమానించే పాత్రలు పోషించాలని ఉంది. వచ్చే ఏడాదితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. నేటి సినిమా వాతావరణానికి అనుగుణంగా నేను కూడా మారుతున్నాను.

Comments

comments

Related Stories: