అనంతలోకాలకు సీతయ్య

విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ వారసుడిగా బాల నటుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన నందమూరి హరికృష్ణ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు.  బాలనటుడిగా సినిమాల్లోకి... నందమూరి తారకరామారావు కథానాయకుడిగా సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో హరికృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1964లో వచ్చిన ఎన్టీఆర్ […]

విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ వారసుడిగా బాల నటుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన నందమూరి హరికృష్ణ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు. 

బాలనటుడిగా సినిమాల్లోకి...

నందమూరి తారకరామారావు కథానాయకుడిగా సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో హరికృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1964లో వచ్చిన ఎన్టీఆర్ చిత్రం ‘శ్రీకృష్ణావతారం’లో ఆయన బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరికృష్ణ చిన్ని కృష్ణుని పాత్రలో కనిపించారు. మొదటి చిత్రంలో చిన్న పాత్ర దక్కడంతో పెద్దగా ప్రతిభ చూపే అవకాశం దక్కలేదు. బాల నటుడిగా మళ్లీ మూడు సంవత్సరాల తర్వాత ‘తల్లా పెళ్లామా’ అనే చిత్రంలో హరికృష్ణ నటించాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్‌కు తగ్గ వారసుడు అంటూ హరికృష్ణను అంతా అభినందించారు.

స్టార్ డైరెక్టర్స్ నుంచి పిలుపు… 

‘తల్లా పెళ్లామా’ చిత్రంలో హరికృష్ణ పోషించిన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ పాత్రను చాలా సునాయాసంగా పోషించి సినిమాకు హైలైట్‌గా నిలిచారు. ఈ చిత్రంలో చలాకీ కుర్రాడిగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న హరికృష్ణకు ఆతర్వాత ఎన్నో చిత్రాల్లో బాల నటుడిగా అవకాశాలు వచ్చాయి. కేవలం 13 ఏళ్ల వయసులోనే హరికృష్ణ ఒకే ఒక్క సినిమాతో అందరికీ తెలిసిపోయాడు. తెలుగులో ఆయనకు అప్పటి స్టార్ డైరెక్టర్స్ నుండి పిలుపు వచ్చింది. అయితే ఎన్టీఆర్ మాత్రం తన కుమారుడు హరికృష్ణను బాలనటుడిగా నటింపచేసేందుకు ఆసక్తి చూపించలేదు.

నిర్మాతగానూ రాణించారు… 

‘తల్లా పెళ్లామా’ తర్వాత హరికృష్ణ చేసిన చిత్రం ‘తాతమ్మ కల’. ఈ చిత్రంలో కూడా ఒక మంచి పాత్రను పోషించిన హరికృష్ణ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. తాతమ్మ కల, రామ్ రహీమ్ చిత్రాల్లో సోదరుడు బాలకృష్ణతో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు 1974లో విడుదలయ్యాయి. ఇక 20 ఏళ్ల వయసులోనే తన తండ్రి ఎన్టీఆర్ తెరకెక్కించిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 1977లో వచ్చిన ఈ చిత్రానికి తండ్రి పర్యవేక్షణలో హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు సినిమాలో అర్జునుడి పాత్రలో కూడా నటించడం విశేషం. అనంతరం హరికృష్ణ కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో హరికృష్ణ ఆయన వెంట నడిచారు. అయితే 1998లో వచ్చిన ‘శ్రీరాములయ్య’ చిత్రంతో ఆయన తిరిగి సినిమాల్లోకి వచ్చారు. అనంతరం నాగార్జునతో కలిసి ‘సీతారామరాజు’ (1999), లాహిరి లాహిరి లాహిరిలో (2002), సీతయ్య (2003) చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘సీతయ్య’ చిత్రంలో ‘ఎవరి మాటా వినడు సీతయ్య’ అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇక లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో ఉత్తమ నటనకుగాను బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా నంది అవార్డును అందుకున్నారు హరికృష్ణ. అదేవిధంగా స్వామి, శ్రావణ మాసం, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, శివరామరాజు చిత్రాల్లో కూడా ఆయన నటించారు.

తీరని కోరిక…

హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్‌రామ్‌కు ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది. తమ్ముడు ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, తాను కలిసి ఓ చిత్రాన్ని నిర్మించాలనేదే ఆయన కోరిక. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెప్పడం జరిగింది. తన సన్నిహిత రచయితలతో కథను సిద్ధం చేయమంటూ కళ్యాణ్‌రామ్ చెప్పాడు. ఇంతలోనే హరికృష్ణ మృతి చెందడంతో కళ్యాణ్‌రామ్ షాక్‌కు గురయ్యాడు. తండ్రిపై చాలా అభిమానం కురిపించే ఎన్టీఆర్ కూడా ఆయనతో కలిసి నటించాలని ఆశపడ్డాడు. నందమూరి అభిమానులు కూడా ఈ ముగ్గురు నటిస్తే చూడాలని కోరుకున్నారు.

ఇక హైదరాబాద్ మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసగృహంలో ఏర్పాటుచేసిన ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు తమ నివాళులర్పించారు. చిరంజీవి, రామ్‌చరణ్, వెంకటేష్, సుమన్, రానా, దిల్‌రాజు, కె.ఎస్.రామారావు, కొరటాల శివ, పూరీ జగన్నాథ్, వంశీ పైడిపల్లి, వి.వి.వినాయక్ తదితరులు ఆయన నివాస గృహానికి విచ్చేశారు.

తండ్రి ముందు నడిచిన వారసత్వం…

‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న దర్శకుడు క్రిష్… హరికృష్ణ మృతి తర్వాత ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ముందు బాలుడు హరికృష్ణ నడుస్తూ ఉండగా ఎన్టీఆర్ ఆ వెనుక ప్రజలకు అభివాదం చేస్తూ వస్తున్నారు. ఈ ఫొటోను 1962వ సంవత్సరంలో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరించిన సమయంలో తీసినది. తండ్రితో పాటు విరాళాల సేకరణకు ప్రజల్లోకి వెళ్లి అప్పుడే తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు హరికృష్ణ. అయితే ‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య సారధ్యం… చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం’ అంటూ క్రిష్ ట్వీట్ చేశారు.

సినీ ప్రముఖుల సంతాపం…

హరికృష్ణ చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఎంతో మంది స్టార్స్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన మరణంతో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు.

చిరంజీవి : నందమూరి హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆత్మీయ మిత్రుడు, సోదర సమానుడైన ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. హరికృష్ణ ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలికరించేవారు… జోక్స్ వేస్తూ నవ్వించేవారు.

మహేష్‌బాబుః హరికృష్ణ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా సోదరుడు ఎన్టీఆర్‌కు, ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.

రామ్‌చరణ్ : రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణ వార్త విని షాకయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

నాగార్జునః ‘చాలా రోజులు అయింది నిన్ను చూడలి.. కలుద్దాం రా తమ్ముడు’ అంటూ కొన్ని వారాల క్రితం హరికృష్ణ ఫోన్ చేసి అన్నారు. ఇప్పుడు ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఐ మిస్ యు అన్న.

మోహన్‌బాబు : నా సోదరుడిని కోల్పోయాను. ఆయన మరణం నన్ను ఎంతగానో కలచివేసింది.

అల్లు అర్జున్ : విదేశాల్లో ఉన్న నేను హరికృష్ణ మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. నందమూరి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. కళ్యాణ్‌రామ్, తారక్‌కు ఇది ఓ పెద్ద లోటు.

దేవిశ్రీప్రసాద్ : హరికృష్ణ మరణ వార్త విని నా గుండె ముక్కలైనంత పనైంది. మా నాన్నగారికి హరికృష్ణతో చాలా మంచి సంబంధం ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

నాని : హరికృష్ణ వంటి వ్యక్తిని మళ్లీ చూడలేనేమో. ఆయన కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

సమంత : హరికృష్ణ మరణంతో చాలా బాధంగా ఉంది. ఈ కఠిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు బలం ఇవ్వాలి.

రకుల్‌ప్రీత్ సింగ్ : ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూయడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ అలాగే ఉంటారు.

Related Stories: