అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ఫైర్

వాడివేడిగా జిల్లా పరిషత్ సమావేశం మిషన్ భగీరథ పనుల అలసత్వంపై ఎంఎల్‌సి ఆగ్రహం భూసమస్యల పరిష్కారంలో నిర్లక్షంపై మంత్రి జోగురామన్న అసహనం నిధులు, విధులపై బిజెపి నిరసన మన తెలంగాణ/ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్షంగా వ్యవహరించడంపై మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపిపి, జడ్‌పిటిసిల నుంచి మంత్రుల వరకు సమస్యలపై అధికారులను నిలదీయడంతో వారు సమాధానం చెప్పేందుకు తడబడాల్సి వచ్చింది. […]

వాడివేడిగా జిల్లా పరిషత్ సమావేశం
మిషన్ భగీరథ పనుల అలసత్వంపై ఎంఎల్‌సి ఆగ్రహం
భూసమస్యల పరిష్కారంలో నిర్లక్షంపై మంత్రి జోగురామన్న అసహనం
నిధులు, విధులపై బిజెపి నిరసన

మన తెలంగాణ/ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్షంగా వ్యవహరించడంపై మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపిపి, జడ్‌పిటిసిల నుంచి మంత్రుల వరకు సమస్యలపై అధికారులను నిలదీయడంతో వారు సమాధానం చెప్పేందుకు తడబడాల్సి వచ్చింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి జిల్లా మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ నల్లాల ఓదేలు, ఎంఎల్‌సిలు సుధాకర్‌రెడ్డి, పురాణం సతీష్, ఎంఎల్‌ఎలు రాథోడ్ బాపూరావ్, రేఖాశ్యాంనాయక్, కోవ లక్ష్మీలతో పాటు జడ్‌పిటిసిలు, ఎంపిపిలు హాజరయ్యారు. జడ్‌పి చైర్‌పర్సన్ శోభారాణి మాట్లాడుతూ జడ్‌పి పాలక వర్గం ఏర్పాటై నాలుగేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్బంగా మంత్రులతో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను అన్నిరంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు అందించిన సహకారాన్ని ఇకముందు కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యాశాఖపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు తమ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులున్నా ఉపాధ్యాయులను నియమించడం లేదని పేర్కొనడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంఎల్‌సి సుధాకర్‌రెడ్డిలు సమాధానమిస్తూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అన్ని ప్రాంతాలకు ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరుగుతుందని, ఉపాధ్యాయులు రాని పక్షంలో విద్యా వాలంటీర్లను నియమించడం జరుగుతుందని తెలిపారు. బాలికల విద్యకు ప్రాధాన్యత నిస్తూ కెజిబివి పాఠశాలను ఇంటర్ వరకు ఉన్నతీకరించడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న పాఠశాలల బిల్లులను చెల్లించేందుకు అవసరమైన నిధులతో ప్రతిపాదనలు పంపించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇదిలాఉంటే పదో తరగతి ఫలితాలలో జిల్లా చివరి స్థానంలో నిలవడం పట్ల పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. ఇకముందు ఇలా జరగకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో జడ్‌పిటిసిలు, ఎంపిపిలు మాట్లాడుతూ రైతుబంధు చెక్కులు, రైతుబీమా పథకం వర్తింప చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. భూస్వాములకు వందలాది ఎకరాలకు సంబంధించి రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారని పలువురు సభ్యులు ఆరోపించారు. చిన్నపాటి వివాదాలను సాకుగా చూపిస్తూ రైతులకు పట్టా పాస్‌బుక్‌లు, చెక్కులను అందించలేదని దీంతోపాటు రైతుబీమాకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకర్లు రైతులకు రుణాలిచ్చేందుకు అనేక విధాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రి జోగురామన్న జోక్యం చేసుకొని స్థానికంగా లేని రైతుల పేరిట వచ్చిన చెక్కులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రత్యేక ఉత్తర్వులు త్వరలోనే జారీ చేయడం జరుగుతుందన్నారు. చిన్నపాటి తప్పిదాలను వెంటనే సవరించి రైతులకు న్యాయం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. సకాలంలో సవరణలు చేసి పాస్ పుస్తకాలను అందించని పక్షంలో రైతుబీమా పథకం వర్తింప చేసే అవకాశం ఉండదన్నారు. సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, వంద శాతం రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నారు. ఇదిలాఉంటే మిషన్ భగీరథ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంపై జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ తాగునీటిని అందిస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేని పరిస్థితులు నెలకొన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి పురాణం సతీష్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో పైప్‌లైన్ పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడంతో ఉద్దేశపూర్వకంగానే పనులను సకాలంలో చేపట్టడం లేదని, అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇంట్రా వాటర్ గ్రిడ్ ఈఈ అంజన్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను సకాలంలో పూర్తి చేయని పక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయం తెలిసినా నిర్లక్షంగా వ్యవహరిస్తున్న ఆర్‌డబ్లూఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల పేరిట 200 కోట్ల రూపాయలను వృధా చేశారని ధ్వజమెత్తారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సైతం వాటర్‌గ్రిడ్ పనుల పేరిట 103 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు చెబుతూ దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎంఎల్‌సితో పాటు మంత్రులు, ఎంఎల్‌ఎలు సంబంధిత అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే మిగిలిన అంశాలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రులు సూచించారు. ఇక మంత్రి జోగురామన్న జన్మదినం సందర్బంగా పలువురు నాయకులు మంత్రిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మల్బరీ పంట సాగుపై అటవీశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు ప్రశాంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నిధులు, విధులపై బిజెపి నిరసన
జడ్‌పిటిసిలుగా ఎన్నికై నాలుగేళ్లు పూర్తయినప్పటికీ తమకు నిధులను కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్‌కు చెందిన జడ్‌పిటిసి కొయ్యల ఏమాజీతో పాటు బిజెపి జడ్‌పిటిసి ప్ల కార్డులతో సమావేశంలో నిరసన తెలిపారు. ప్లకార్డులతో నిరసన తెలపడంతో అధికార పార్టీకి చెందిన సభ్యులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలు జోక్యం చేసుకొని జిల్లాలోని ప్రధానమైన సమస్యలపై చర్చిస్తున్న తరుణంలో ఇలా అడ్డుకోవడం భావ్యం కాదని వారిని సమాధానపర్చడంతో ఆందోళనను విరమించారు.

Related Stories: