అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి

President's arrival to the IIT should be vigilant

ఐఐటి స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి
వేడుకలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు 

మన తెలంగాణ/సంగారెడ్డి : భారత రాష్ట్రపతి ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కంది వద్ద గల ఐఐటి, హైదరాబాద్‌లో జరుగనున్న స్నాతకోత్సవానికి హాజరవుతున్నందున ఆయా శాఖ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో పోలీసు ఉన్నతాధికారులు, ఐఐటి, హైదరాబాద్ ప్రతినిధులు, రెవెన్యూ, రోడ్డు భవనాలు, ఫైర్, మెడికల్, ఆర్టీవో, డిపివో తదితర శాఖల అధికారులతో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో పాటు ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొననున్నందున అధికారులు ప్రణాళికతో ఏర్పాట్లను చేయాలని సూచించారు. అత్యంత కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు తెలిపారు. పర్యటనకు ముందు నుండే జాగరుకులై ఉండాలన్నారు. హెలీప్యాడ్ ఏర్పాట్లు, గ్యాలరి, ముఖ్య అతిధులు కూర్చునే వేధిక, ప్రముఖులు కూర్చునే స్థలాన్ని ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ఆహ్వానితుల జాబితాను ముందుగా సిద్దం చేసి అనుమతి పొందాలని సూచించారు. ఐఐటీ పరిసర ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. ప్రోటోకాల్ పాటించాలని, అగ్నిమాపక,ఆర్టీవో, వైద్యశాఖల అధికారులు తమ తమ ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని సూచించారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, ఐఐటీ వారి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జేసి నిఖిల, ఐఐటీ ప్రొఫెసర్ సుబ్రమణ్యం, డీఎస్పీలు, అగ్నిమాపక శాఖాధికారి, డీపీవో వెంకటేశ్వర్లు, మెడికల్, ఆర్టీవో, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments