కోఠి ఆస్పత్రిలో అదృశ్యమైన పసికందు ఆచూకీ లభ్యం

mising-baby

హైదరాబాద్: కోఠి ప్రభుత్వ ప్రస్తూతి ఆసుపత్రిలో సోమవారం ఉదయం అదృశ్యమైన పసికందు ఆచూకీని పోలీసులు గుర్తించారు. సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… రంగారెడ్డి జిల్లా ఎల్లమ్మ తండాకు చెందిన విజయ అనే మహిళ ఈ ఆస్పత్రిలో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆమె ప్రస్తుతం కదల్లేని పరిస్థితితో ఆసుపత్రిలోనే ఉంది. సోమవారం ఆమె దగ్గరకి వచ్చిన ఓ మహిళ పసిబిడ్డకు టీకా ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పాపను తీసుకెళ్లింది. ఆ మహిళ తిరిగి రాకపోవడంతో భాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ పసికందును బీదర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారిని పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. బీదర్‌లో పసికందును గుర్తించామని సుల్తాన్ బజార్ ఎసిపి డాక్టర్ చేతన వెల్లడించారు. మంగళవారం రాత్రి వరకు చిన్నారిని కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురానున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిందితురాలు ఎవరు అనే దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.